575 టీఎంసీలు కావాల్సిందే!

8 Feb, 2018 02:52 IST|Sakshi

కృష్ణా జలాల కేటాయింపులు పెంచాల్సిందే

కేంద్రంపై ఒత్తిడికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నదీ జలాల్లో నీటి కేటాయింపులు పెంచేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా 575 టీఎంసీలు కేటాయించాల్సిందిగా కోరనుంది. ఈ మేరకు రెండేళ్ల తర్వాత తొలిసారి ఈ నెల 15న రాష్ట్రం తరఫున కేంద్ర జల వనరుల శాఖ ముందు తెలపాల్సిన అంశాలపై నివేదిక సిద్ధం చేసింది. రాష్ట్రంలో కృష్ణా పరీవాహక ప్రాంతం 68.5, ఆయకట్టు 62.5 శాతం ఉంటే మొత్తం జలాల్లో 35 శాతమే తెలంగాణకు నీరు కేటాయించారు.

ఏపీలో పరీవాహకం 31.5, ఆయకట్టు 37.5 శాతం ఉన్నా 60 శాతానికి పైగా కేటాయింపులు జరిపారు. ఆ ప్రకారం మొత్తం 811 టీఎంసీల జలాల్లో ఏపీకి 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీల నీరు కేటాయించారు. పరీవాహకం, ఆయకట్టును లెక్కలోకి తీసుకున్నా కేటాయింపులు పెరగాలని రాష్ట్రం వాదించనుంది. ఇక 1978 గోదావరి అవార్డు ప్రకారం.. పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు రాగానే నాగార్జునసాగర్‌ ఎగువన ఉన్న పై రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయి.

ఈ లెక్కన తెలంగాణకు 45 టీఎంసీలు దక్కాలని, అలాగే పట్టిసీమను కొత్త ప్రాజెక్టుగా పరిగణించి దాని ద్వారా తరలిస్తున్న 80 టీఎంసీల్లో మరో 45 టీఎంసీల వాటా ఇవ్వాలని కోరనుంది. మొత్తంగా 575 టీఎంసీలు తెలంగాణకు కేటాయించి మిగిలిన 236 టీఎంసీలను ఏపీకి కేటాయించాలని వివరించనుంది. మరోవైపు ఆర్డీఎస్‌ పథకం కింద రాష్ట్రానికి 15.9 టీఎంసీల కేటాయింపులున్నా 5–6 టీఎంసీలకు మించి నీరందడం లేదు. దీనిపైనా కేంద్రం వద్దే తేల్చకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  

రేపు ప్రాజెక్టుల నియంత్రణపై చర్చలు
కృష్ణా, గోదావరి బేసిన్‌ పరిధిలో ప్రాజెక్టుల నియంత్రణపై కేంద్రం ఈ నెల 9న ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్‌లు భేటీకి హాజరుకానున్నారు. ప్రాజెక్టులను రాష్ట్రాల పరిధిలో ఉంచాలా? లేక బోర్డు పరిధిలోకి తేవాలా? అంశంపై ఇందులో చర్చించనున్నారు.  

మరిన్ని వార్తలు