కత్తిమీద సాముగా సీట్ల సర్దుబాటు!

14 Jan, 2018 02:12 IST|Sakshi

టీఆర్‌ఎస్‌ నాయకత్వానికి సవాలుగా టికెట్ల కేటాయింపు  

వచ్చే ఎన్నికల్లో పోటీకి పార్టీ నుంచి భారీగా ఆశావహులు 

నేతలతో కిక్కిరిసిన నియోజకవర్గాలు 

నియోజకవర్గాల పునర్విభజనపై చావని ఆశలు 

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేస్తున్న అధికార టీఆర్‌ఎస్‌ అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. రానున్న ఎన్నికల్లో పార్టీ తరఫున బరిలోకి దింపాల్సిన గెలుపు గుర్రాల ఎంపిక అంత తేలిక కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సారి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చాలా మంది ఆశావహులు ఎదురు చూస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల సీట్ల సర్దుబాటు టీఆర్‌ఎస్‌ నాయకత్వానికి కత్తిమీద సాము కానుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గడిచిన మూడేళ్లలో దాదాపు అన్ని జిల్లాల్లో ఇతర పార్టీలనుంచి టీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు జరిగాయి. దీంతో పాత, కొత్త నేతలతో అసెంబ్లీ నియోజకవర్గాలు కిక్కిరిసిపోయాయి.

ఇలా టీఆర్‌ఎస్‌లో చేరిన నేతల్లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలూ ఉన్నారు. వీరంతా తమ రాజకీయ భవిష్యత్‌ కోసమే గులాబీ గూటికి చేరారన్నది బహిరంగ రహస్యం. వీరిలో అత్యధికులు వచ్చే ఎన్నికల్లో పోటీకి టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఆశిస్తున్నవారే. పార్టీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు కనీసం వెయ్యి మంది ఆశావహులు ఉంటారన్నది ఒక అంచనా. ఈ పరిస్థితుల్లో అధినేత కేసీఆర్‌ ఏ సమీకరణాలతో టికెట్లు ఇస్తారన్నది అధికార పార్టీలో ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది చివరిలోగా ముందస్తు ఎన్నికలు ముంచుకు వచ్చే అవకాశం ఉందని, అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని ఇప్పటికే పార్టీ నేతలకు సమాచారం అందడంతో నియోజకవర్గాల్లో ‘రాజకీయం’వేగం పుంజుకుంది.  

అయిదు వర్గాలుగా ఆశావహులు.. 
టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేయాలని ఉబలాట పడుతున్న నేతలు అయిదు వర్గాలుగా ఉన్నారు. గత ఎన్నికల్లో పార్టీ టికెట్‌పై గెలిచిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నుంచి వచ్చి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడిన వారు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి నియోజకవర్గ ఇన్‌చార్జులుగా కొనసాగుతున్న వారు, వివిధ పార్టీల నుంచి వచ్చి టీఆర్‌ఎస్‌లో చేరి టికెట్లు ఆశిస్తున్న వారు... ఇలా మొత్తంగా అయిదు వర్గాల నేతలు ఆశావహులుగా ఉన్నారు.  ఏపీ పునర్విభజన చట్టం మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగకుంటే టికెట్లకోసం మరింత ఒత్తిడి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 63 స్థానాల్లో గెలవగా, ఉప ఎన్నికల్లో మరో రెండు చోట్ల గెలిచింది. దీంతో ఆ సంఖ్య 65కు చేరగా, వివిధ పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు 25 మందిని కలిపితే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంఖ్య 90కి చేరింది. వీరందరికీ టికెట్లు ఇస్తారనుకున్నా, ఇక మిగిలేది కేవలం 29 నియోజకవర్గాలు మాత్రమే. కానీ, టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య దీనికి పదింతలకు పైనే ఉందని, ఈ లెక్కన వడబోత అంత తేలిక కాదని అంటున్నారు.  

 పునర్విభజనపై ఆశలు.. 
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అదనంగా మరో 34 స్థానాలు పెరుగుతాయని, దీంతో కొంత ఒత్తిడిని అధిగమించవచ్చన్న భావనలో టీఆర్‌ఎస్‌ నాయకత్వం ఉంది. జరగని పక్షంలో పనితీరు ప్రాతిపదికన కొందరు సిట్టింగ్‌లపై వేటు తప్పదని తెలుస్తోంది. కనీసం 30 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేల మెడలపై కత్తి వేలాడుతోందని చెబుతున్నారు. ఆశావహుల జాబితాను తగ్గించేందుకు నామినేటెడ్‌ పదవుల భర్తీని చేపట్టారు. దీంతో రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు దక్కిన వారికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

మరిన్ని వార్తలు