కిర్లంపూడికి అనుమతించండి

8 Feb, 2016 07:20 IST|Sakshi
కిర్లంపూడికి అనుమతించండి

మానవహక్కుల కమిషన్‌ను కోరిన రఘువీరా, పీసీసీ నేతలు

 సాక్షి, హైదరాబాద్: కాపు రిజర్వేషన్ల సాధనకు నిరాహారదీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభంను కలుసుకునేందుకు తాము కిర్లంపూడికి వెళ్లడానికి అడ్డంకులు సృష్టించవద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా కాంగ్రెస్ నేతలు మానవహక్కుల కమిషన్‌ను కోరారు. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఏఐసీసీ ఎస్‌సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు, మాజీ మంత్రి సాకె శైలజానాథ్, న్యాయ విభాగం చైర్మన్ సి.సుందరరామశర్మ ఆదివారం రాత్రి హక్కుల కమిషన్ చైర్మన్ నిసార్ అహ్మద్ కక్రూను ఆయన నివాసంలో కలుసుకుని ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

ఈ అంశంపై ఒక నిర్మాణాత్మకమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు అవసరమైన సూచనలు చేసేందుకు తాను, ఎంపీ చిరంజీవి కిర్లంపూడికి వెళుతున్నట్లు కక్రూకు రఘువీరా వివరించారు. కిర్లంపూడికి వెళ్లేందుకు ప్రయత్నించిన తమ పార్టీ నేతలు సి.రామచంద్రయ్య, వట్టి వసంతకుమార్, పళ్లంరాజులను నిరోధించిన విషయాన్ని ఆయన తెలిపారు. చైర్మన్‌ను కలసి బయటకు వచ్చిన తరువాత రఘువీరా మీడియాతో మాట్లాడుతూ కిర్లంపూడి వెళ్లడానికి తమకు కమిషన్ చైర్మన్ అనుమతించారని వివరించారు.

 ముఖ్యమంత్రే రెచ్చగొడుతున్నారు: కాపులకు రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని పరిష్కరించాల్సింది పోయి రెచ్చగొట్టే విధంగా సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరాభవన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాపులకు రిజర్వేషన్లు కల్పించడానికి రెండు నెలల కంటే ఎక్కువ సమయం పట్టదనేది తమ పార్టీ అభిప్రాయమని ఆయన అన్నారు. తునిలో రైలు తగలబడగానే ఆ నెపాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపైనా, కాంగ్రెస్‌పైనా వేస్తూ రాయలసీమ వాళ్లే ఈ దురాగతానికి పాల్పడ్డారని చెప్పిన చంద్రబాబునాయుడు.. ఇపుడు కేసులు వేరే వాళ్ల మీద ఎందుకు పెట్టారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు తెలియకుండానే టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని తాను భావించడం లేదని రఘువీరా మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

మరిన్ని వార్తలు