నెహ్రూ కుటుంబ చరిత్రను చెరిపేందుకు కుట్ర

6 Aug, 2016 06:32 IST|Sakshi
నెహ్రూ కుటుంబ చరిత్రను చెరిపేందుకు కుట్ర

యూత్‌కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు అమరేందర్‌సింగ్
సాక్షి, హైదరాబాద్: నెహ్రూ, గాంధీ కుటుంబ చరిత్రను చెరిపేసే కుట్ర జరుగుతోందని అఖిల భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అమరేందర్‌సింగ్ రాజబ్రార్ ఆరోపించారు. అయితే, ఈ కుట్రలో బీజేపీకి భంగపాటు తప్పదని అన్నారు. శుక్రవారం రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ‘మనలో రాజీవ్’ పేరిట నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలు ముందుకు రావాలని ప్రధానమంత్రి పదే పదే చెప్తున్నారని, అయితే భార్యను గౌరవించని వ్యక్తి ఇతర మహిళలను ఎలా గౌరవిస్తారని ఎద్దేవా చేశారు.

కేసీఆర్, కేటీఆర్‌లు కాంగ్రెస్‌ను ఖతం చేస్తామని అనడం సిగ్గుచేటని, కాంగ్రెస్‌నుంచే కేసీఆర్ ఇంత ఎత్తుకు ఎదిగారన్న సంగతి గుర్తుంచుకోవాలని అన్నారు. పార్టీ మళ్లీ అధికారంలోకి రావడానికి యువజన కార్యకర్తలు ప్రధాన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ దేశానికి సేవ చేయటానికే రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చాడని అన్నారు. పద్దెనిమిదేళ్లకే ఓటు హక్కును కల్పించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని అన్నారు.

ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. సీఎల్‌పి నేత కె. జానారెడ్డి మాట్లాడుతూ ఈ దేశానికి మేలు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. అప్రజాస్వామికమైన పాలన తెలంగాణలో కొనసాగుతోందని విమర్శించారు. సదస్సులో మాజీ మంత్రి డీకే అరుణ,  రాష్ట్ర యూత్‌కాంగ్రెస్ అధ్యక్షుడు మందడి అనిల్‌కుమార్ యాదవ్, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు