వైఎస్సార్‌సీపీపై ఇది కక్ష సాధింపే

18 Sep, 2016 03:25 IST|Sakshi
వైఎస్సార్‌సీపీపై ఇది కక్ష సాధింపే

ప్రభుత్వంపై అంబటి ధ్వజం
 
 సాక్షి, హైదరాబాద్: తుని ఘటనను అడ్డం పెట్టుకుని వైఎస్సార్‌సీపీపై ‘పచ్చ’ ప్రభుత్వం కక్ష సాధిస్తోందని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. తుని కేసులో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిని ఇరికించాలన్న ప్రభుత్వం కుట్రలో భాగంగా.. మరోసారి సీఐడీ నోటీసులిచ్చారని మండిపడ్డారు. ఈ నెల 6, 7 తేదీల్లోనూ భూమనను సీఐడీ ఆఫీసుకు పిలిచి సుదీర్ఘంగా విచారణ చేశారని, మళ్లీ ఇప్పుడు 19న రమ్మనటం వేధింపులకు పాల్పడటమేనన్నారు. అంబటి శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.కేసులు, కాసులతో చంద్రబాబు అక్రమ పాలన సాగిస్తున్నారని అంబటి నిప్పులు చెరిగారు.

కాపుల ఉద్యమాన్ని, విపక్షాన్ని అణచివేసే కుట్రలో భాగంగానే చంద్రబాబు, హోంమంత్రి.. తుని ఘటనతో సంబంధం లేని భూమనను ఇరికించాలని చూస్తున్నారని మండిపడ్డారు. తుని సంఘటన జరగడానికి కారణం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యంతప్ప మరొకటి కాదని అంబటి స్పష్టంచేశారు. అసలు యనమల రామకృష్ణుడు, అతని సోదరుడు కుట్రచేసి, హింసను ప్రోత్సహించి వైఎస్సార్‌సీపీపైన, కాపులపైన రుద్దేందుకు ముందుగా ప్రణాళిక చేసి ఉంటారన్న కోణంలో ఎందుకు దర్యాప్తు చేయట్లేదని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు