వైఎస్సార్సీపీని నిర్వీర్యం చేయలేరు

24 Jan, 2016 04:01 IST|Sakshi
వైఎస్సార్సీపీని నిర్వీర్యం చేయలేరు

అంబటి రాంబాబు స్పష్టీకరణ
మా ఎమ్మెల్యేలు, నేతలపై అక్రమంగా
కేసులు పెట్టి వేధిస్తున్నారు


సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీని నిర్వీర్యం చేసి, ప్రతిపక్ష నేతల్ని లొంగదీసుకోవాలని సీఎం చంద్రబాబు వ్యూహం పన్నారని, అయితే అది జరగని పనని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

తమ పార్టీ ప్రజాప్రతినిధులు ఎంపీ మిథున్‌రెడ్డి మొదలు ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆర్.కె.రోజా, దాడిశెట్టి రాజా వరకూ అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని యావత్తు పోలీసు యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని ప్రభుత్వం తమ ఎమ్మెల్యేలపైన, నేతలపైన విచక్షణారహితంగా అక్రమ కేసులు పెడుతోందని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేతల్ని లొంగదీసుకోవాలనుకునే సంప్రదాయాన్ని చంద్రబాబే ప్రవేశపెట్టారని, ఇది చాలా ప్రమాదకరమని, అరాచకానికి దారితీస్తుందని ఆయన హెచ్చరించారు.

ఇవి సాక్ష్యాలవుతాయా?

నెల్లూరు జైల్లో ఉన్న మిథున్‌రెడ్డి, చెవిరెడ్డిలను పరామర్శించడానికి వెళ్లిన తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్కడ మాట్లాడుతూ తిరుపతి ఎయిర్‌పోర్టు సంఘటన తాలూకు వీడియో ఫుటేజీని విడుదల చేయాలని డిమాండ్ చేస్తే కొన్ని దృశ్యాల్ని మాత్రం విడుదల చేసి అవే సాక్ష్యాలంటున్నారని అంబటి మండిపడ్డారు. టీడీపీ విడుదల చేసిన వీడియోల్ని ప్రదర్శిస్తూ... విమానాశ్రయం అన్నాక పలు కెమెరాలుంటాయని, వాటిలో ఒక భాగం మాత్రం విడుదల చేసి అవే సాక్ష్యాలనడం ఎంతవరకు సమంజసమన్నారు. చెవిరెడ్డి, మిథున్‌రెడ్డి ఎయిర్‌పోర్టులో కొట్టారనడానికి ఇవి సాక్ష్యాలవుతాయా? ఒకసారి రాష్ట్ర ప్రజలే ఆలోచించాలన్నారు.

ఇవీ...సాక్ష్యాలంటే..

లోకేశ్ విదేశాల్లో అమ్మాయిలతో విహరిస్తున్న, హోటళ్లలో చిందులేస్తున్న ఫొటోలను అంబటి ప్రదర్శిస్తూ... సాక్ష్యాలంటే ఇవీ.. ఇలా ఉండాలి.. ఇలాంటి తిరుగులేని సాక్ష్యాలు ఎంతోకాలంగా కళ్లముందు సాక్షాత్కరిస్తున్నా.. వాటిపై లోకేశ్ నోరు మెదపట్లేదని విమర్శించారు. ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదం లాగా రాష్ట్రంలో వైఎస్ ఉగ్రవాదం తయారైందని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అనడంపై రాంబాబు అభ్యంతరం తెలుపుతూ మంత్రి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.

‘‘టీడీపీ 20 నెలలుగా పోలీసుల్ని అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ నేతలపై దౌర్జన్యాలు సాగిస్తోంది గాక మమ్మల్ని ఉగ్రవాదులంటారా? మీదా ఉగ్రవాదం.. మాదా? మంత్రి ఇలాగే మాట్లాడితే చూస్తూ ఊరుకోబోం’’ అని హెచ్చరించారు.నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డిపై ఫిర్యాదు చేయాలని పోలీసులు తనపై ఒత్తిడి చేసినట్టు స్వయంగా ఎమ్మార్వో చెప్పడాన్నిబట్టి పరిస్థితులను తెలుసుకోవచ్చన్నారు. కామినేని మెదడుకు ఆపరేషన్ చేసుకుంటే మంచిది..

ప్రభుత్వాసుపత్రిపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలనే ఉద్దేశంతో వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకోవడం సంతోషదాయకమేనని, ఆయన బయట్నుంచి ప్రైవేటు వైద్యులను, ఇతర పరికరాల్ని తెప్పించుకోవడమే విచిత్రమని అంబటి అన్నారు. సాధారణ ప్రజలకోసమూ ఇలాగే కార్పొరేట్ వైద్యుల్ని రప్పించి చికిత్సలు చేయిస్తారా? అని ప్రశ్నించారు. మంత్రి చర్యలతో ప్రభుత్వాసుపత్రులపై ఇపుడున్న విశ్వాసం కూడా  సడలిపోతుందన్నారు. అందుకే  కామినేని మోకాలికి కాకుండా మెదడుకు ఆపరేషన్ చేయించుకుంటే మంచిదని ఆయన వ్యంగ్యంగా అన్నారు.

 

మరిన్ని వార్తలు