టీడీపీ నేతల్ని రక్షించుకోవడానికే సవాంగ్‌ను సెలవుపై పంపారు

16 Dec, 2015 03:44 IST|Sakshi
టీడీపీ నేతల్ని రక్షించుకోవడానికే సవాంగ్‌ను సెలవుపై పంపారు

చంద్రబాబుపై అంబటి రాంబాబు ధ్వజం
♦ నిష్పాక్షికంగా ఉండే అధికారుల్ని మార్చడం బాబుకు కొత్తకాదు
♦ బాబు, కేసీఆర్ మధ్య సయోధ్య కుదరడం వెనుక కథేంటో చెప్పాలి?
 
 సాక్షి, హైదరాబాద్: కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్న విజయవాడ పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్‌ను ఏపీ ప్రభుత్వం సెలవుపై పంపడం దారుణమని, అధికారపార్టీ వారిని రక్షించుకునేందుకే ఏపీ సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంవద్ద మీడియాతో మాట్లాడుతూ సంచలనం సృష్టిస్తున్న కాల్‌మనీ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతున్న తరుణంలో సవాంగ్‌ను సెలవుమీద పంపడంపై ప్రభుత్వం జవాబు చెప్పాలన్నారు.

సవాంగ్‌కు ముక్కుసూటిగా వెళ్లే అధికారిగా పేరుందని నేరస్తులు ఎవరైనా శిక్షపడేలా చేస్తారనే నమ్మకం ప్రజలకుందని, ఆయనుంటే ఇబ్బందులెదురవుతాయనే.. సెలవుపై పంపినట్లుగా ఉందన్నారు. తమమాట వినకుండా నిష్పాక్షికంగా వ్యవహరించే పోలీసు ఉన్నతాధికారుల్ని మార్చడం బాబుకు కొత్తేం కాదని, అమరావతి ప్రాంతంలో పొలాలు కాలిపోయినపుడు గుంటూరు రూరల్, అర్బన్ ఎస్పీలను కూడా బదిలీ చేశారన్నారు.  

 పాలనపై బాబుకు పట్టు లేదు
 చంద్రబాబుకు పాలనపై పూర్తిగా పట్టు సడలిందని, కేవలం తమ పార్టీవారిని కుంభకోణాల నుంచి కాపాడుకునే దుస్థితిలో ప్రస్తుతమున్నారని అంబటి అన్నారు. కాల్‌మనీలో పీకల్లోతున టీడీపీ నేతలంతా మునిగిపోతే ఆత్మరక్షణలో పడిపోయిన బాబు ఇతరపక్షాలపైనా బురద జల్లాలని చూస్తున్నారని  మండిపడ్డారు. గుంటూరులో తమ పార్టీ యువజన నేత కావటి మనోహర్‌నాయుడు ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించడమే అందుకు పరాకాష్టన్నారు.

మనోహర్‌నాయుడు ఇంట్లో వారికేమీ దొరకలేదన్నారు. ప్రభుత్వాలు ఇవాళుండి, రేపు పోతాయని, ఎప్పటికీ సర్వీసులో ఉండే పోలీసులు జాగ్రత్తగా ఉండాలన్నారు. నిన్నటి దాకా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదించుకున్న ఉభయరాష్ట్రాల సీఎంలు కేసీఆర్, బాబుల మధ్య హఠాత్తుగా ఆ సయోధ్య ఎలా కుదిరిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో తిరుగులేని సాక్ష్యాధారాలున్నాయని నిన్నటివరకూ కేసీఆర్ చెప్పారని, ఇప్పుడవి ఉలవచారులో మునిగిపోయాయా? అని ప్రశ్నించారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా