చెత్తకూ ఓ యాప్..!

11 Mar, 2016 08:31 IST|Sakshi
చెత్తకూ ఓ యాప్..!

- త్వరలో అందుబాటులోకి తేనున్న జీహెచ్‌ఎంసీ
- నెలరోజుల్లో 1116 క్లీన్ ప్రాంతాలు

 
సిటీబ్యూరో: నగర ప్రజలకు ఓ శుభవార్త.. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో చెత్త పేరుకుపోతే విసుక్కోనవసరం లేదు.. తరలింపు సిబ్బంది కోసం ఎదురు చూడాల్సిన పనీలేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఒక్క ఫొటో తీసి గ్రేటర్ శానిటేషన్ విభాగానికి పంపితే చాలు తొలగింపు, తరలింపు పనులు వెంటనే వారే చూసుకుంటారు.

 

ఇందుకోసం ప్రత్యేకంగా ‘యాప్’ సైతం అందుబాటులోకి రానుంది. ఈ యాప్ అందుబాటులోకి వస్తే.. ప్రజలు ఎక్కడ తమకు చెత్త కనిపించినా.. ఫొటో తీస్తే గూగుల్ మ్యాప్స్ ద్వారా సదరు చెత్త ఎక్కడ ఉందో.. ఏ లాంగిట్యూట్, లాటిడ్యూడ్‌లో పేరుకుపోయిందో వివరాలన్నీ సంబంధిత పరిధిని పర్యవేక్షించే సహాయ వైద్యాధికారి (ఏఎంఓహెచ్) కి చేరతాయి. ఏఎంఓహెచ్ వెంటనే చర్యలకు ఉపక్రమిస్తారు. తద్వారా ఇప్పటికే చెత్త ప్రాంతాలుగా ఉన్న ప్రాంతాలను శుభ్రం చేయడంతో పాటు.. కొత్తగా చెత్త ప్రాంతాలు ఏర్పడకుండా చూడవచ్చునని అధికారులు భావిస్తున్నారు. దాదాపు నెలరోజుల్లో ఇది అందుబాటులోకి రాగలదని అంచనా వేస్తున్నారు.

 

మరోవైపు గ్రేటర్‌లో రెండువేలకు పైగా ప్రాంతాల్లో బహిరంగంగా, రోడ్లపైనే చెత్త వేయడాన్ని గుర్తించిన జీహెచ్‌ఎంసీ.. అందులో 1116 ప్రాంతాలను చెత్త ర హిత ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకుంది. ఈమేరకు మంత్రి కేటీఆర్‌కు సైతం మాట ఇచ్చారు. వందరోజుల్లో 1116 ప్రదేశాలను చెత్త రహితంగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఆ దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించిన అధికారులు దాదాపు 200 ప్రదేశాల్లోని చెత్తను తరలించడమే కాకుండా తిరిగి అక్కడ చెత్త వేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా ఇక్కడ చెత్త వేసిన వారికి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని ప్రకటన బోర్డులు సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఓవైపు ఈ పనులు చేస్తూనే మరోవైపు యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమయ్యారు.
 
ఇంటిగ్రేటెడ్ యాప్..
నగరంలోని ప్రధాన సమస్యలైన పారిశుద్ధ్యం, తాగునీరు, మురుగునీరు, రహదారులతో పాటు ఇతరత్రా సేవలన్నీ జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు రెండు విభాగాల పరిధిలోనే ఉండటం తెలిసిందే. ఏ సమస్యను ఎవరు పరిష్కరిస్తారో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా, వాటర్‌బోర్డు ఎండీగా డాక్టర్ బి. జనార్దన్‌రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. అందుకు అనుగుణంగా రెండు విభాగాల సేవలనూ ఒకే యాప్ ద్వారా అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తున్నారు. మే నెలాఖరు నాటికి దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు.
 
 

మరిన్ని వార్తలు