నాన్‌ బోర్డర్లకు ఓయూ వీసీ అప్పీల్‌

26 Jul, 2017 11:50 IST|Sakshi
నాన్‌ బోర్డర్లకు ఓయూ వీసీ అప్పీల్‌

హైదరాబాద్‌: పరిస్థితులు అర్థం చేసుకొని ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని వసతి గృహాల్లో ఉంటున్న నాన్‌ బోర్డర్లు వెంటనే యూనివర్సిటీని ఖాళీ చేసి వెళ్లిపోవాలని వర్సిటీ వైఎస్‌ ఛాన్సలర్‌ రామచంద్రం విజ్ఞప్తి చేస్తూ ఓ లేఖ రాశారు. లేదంటే ఎన్నో ఆశలతో వర్సిటీకి వస్తున్న నూతన విద్యార్థులకు అన్యాయం చేసినవాళ్లం అవుతామంటూ అందులో వ్యాఖ్యానించారు. తెలంగాణ విద్యార్థుల పరిస్థితిపై అవగాహన ఉండి కూడా గతంలో విద్యనభ్యసించి కోర్సు పూర్తయినా వెళ్లకుండా ఉండిపోతున్న నాన్‌ బోర్డర్లు ఇలా వ్యవహరించడం భావ్యం కాదని అన్నారు.

'ఎంతో శ్రమపడి ఉన్నత విద్యాభ్యాసం ద్వారా ఆర్థికంగా, సామాజికంగా స్వశక్తిని సంపాదించుకునేందుకు మన యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం ఎంతోమంది విద్యార్థులు చేరుతారు. మన విద్యార్థులకు సామాజిక, ఆర్థిక వసతుల లేమి మీకు(నాన్‌ బోర్డర్లకు) బాగా తెలుసు. అలాంటి పరిస్థితి నుంచి ఎడ్యుకేషన్‌ ద్వారా బయటపడేందుకు నూతన విద్యార్థులు వస్తుంటారు. వారికి తగిన సౌకర్యాలను అందించాల్సిన బాధ్యత యూనివర్సిటీ అధికారులుగా మాపై ఉంది. సంతృప్తికరమైన వసతి, భోజనం ఏర్పాట్లు, పరిసరాలు లేకుండా విద్యార్థులకు తాము కోరుకున్న స్వశక్తిని సాధించడం సాధ్యం కాదు.

హాస్టల్‌ వసతులు, బడ్జెట్‌ అర్హత ఉన్న లబ్ధిదారులకు చేరుకోవడం లేదు. దీనికి కారణం నాన్‌ బోర్డర్లే. కోర్సులు ముగిసినప్పటికీ వారు ఖాళీ చేయకుండా అలాగే ఉండిపోతున్నారు. దీంతో కొత్తగా వస్తున్న విద్యార్థులకు వసతి గృహాల్లో, విద్యావకాశాల్లో తమ అవకాశాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌గా ఆయా కోర్సుల్లో ప్రవేశం పొందిన నూతన విద్యార్థులకు అకాడమిక్‌ అనుభవాన్ని అందించడం నా ధర్మకతృత్వ బాధ్యత మాత్రమే కాకుండా నైతిక బాధ్యత కూడా.

నూతనంగా ప్రవేశం పొందుతున్న విద్యార్థుల భవిష్యత్‌ను అర్థం చేసుకొని వెంటనే హాస్టళ్లు ఖాళీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. లేదంటే మన విద్యార్థులకు, వారి కలలకు, ఆశయాలకు పెద్ద అన్యాయం జరిగినట్లు అవుతుంది. మనమంతా కలిసి ప్రతి విద్యార్థికి ఉస్మానియా యూనివర్సిటీ అందుబాటులో ఉండేలా చూడాలి. అప్పుడే మనమంతా మన యూనివర్సిటీని విద్యాపరిశోధనా రంగంలో అత్యున్నత శిఖరాలకు చేర్చగలం' అని బహిరంగ లేఖలో వీసీ విజ్ఞప్తి  చేశారు.

>
మరిన్ని వార్తలు