హోదా నినాదానికి నోటీసులు

19 Oct, 2016 01:00 IST|Sakshi
హోదా నినాదానికి నోటీసులు

12 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు లేఖలు
- అభిప్రాయాలు 25, 26 తేదీల్లో వెల్లడించాలని వినతి
- 25న ఆరుగురు, 26న మరో ఆరుగురు రావాలని లేఖలు
- హోదా కోసం అసెంబ్లీలో నినదించిన విపక్ష ఎమ్మెల్యేలు
 
 సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని శాసనసభలో నినదించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు 12 మందికి హక్కుల కమిటీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 25, 26 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగిన కమిటీ సమావేశానికి హాజరై  అభిప్రాయాలు వెల్లడించాల్సిందిగా కోరింది. 25వ తేదీన ఆరుగురు, 26న ఆరుగురు కమిటీ ముందు హాజరై అభిప్రాయాలు చెప్పాల్సిందిగా శాసనసభ  ఇన్‌చార్జి కార్యదర్శి కె. సత్యనారాయణ ఎమ్మెల్యేలకు లేఖలు రాశారు. కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని, గుడివాడ), చెవిరెడ్డి భాస్కరరెడ్డి (చంద్రగిరి), దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా, తుని), కొరుముట్ల శ్రీనివాసులు (రైల్వే కోడూరు), చిర్ల జగ్గిరెడ్డి (కొత్తపేట), రాచమల్లు శివప్రసాదరెడ్డి(ప్రొద్దుటూరు)లను ఈనెల 25న మంగళవారం ఉదయం 11.30 గంటలకు హాజరై అభిప్రాయాలు వెల్లడించాల్సిందిగా కోరారు. కమిటీ వీక్షించిన వీడియో టేపుల్లో కొడాలి నాని రెండు విడతలు కనిపించటంతో ఆయన పేరును నోటీసులో రెండుసార్లు ప్రస్తావించారు. 26వ తేదీ బుధవారం నాడు అదే సమయానికి కమిటీ ముందు హాజరై అభిప్రాయాలు వెల్లడించాల్సిందిగా పిన్నెలి రామకృష్ణారెడ్డి (మాచర్ల), ఆళ్ల రామకృష్ణారెడ్డి (మంగళగిరి), బూడి ముత్యాల నాయుడు (మాడుగుల), డాక్టర్ ఎం.సునీల్ కుమార్ (పూతలపట్టు), కిలేటి సంజీవ య్య (సూళ్లూరుపేట), కంబాల జోగులు(రాజాం)లకు నోటీసులు జారీ చేశారు.

 ప్రత్యేకహోదా కోసమే నినాదాలు...
 రాష్ట్రానికి హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గత నెల 8 నుంచి 10 వరకూ శాసనసభ వర్షాకాల సమావేశాల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు నినదించారు... సభను స్తంభింపచేశారు. దీంతో హోదాకోసం శాసన సభను స్తంభింప చేసినవారు సభలో అనుసరించిన వ్యవహారశైలిపై విచారణ జరపాల్సిందిగా శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తీర్మానం మెజారిటీ సభ్యులున్న అధికారపక్షం ఆమోదించింది. ఆ తీర్మానానికి  అనుగుణంగా గత నెలలో కమిటీ హైదరాబాద్‌లో సమావేశమైంది. ఆ తరువాత  ఈ నెల 14న విజయవాడలో సమావేశమైంది. ఈ సందర్భంగా అధికారపక్షం నుంచి హాజరైన సభ్యులు శాసనసభలో హోదా కోసం నినదించిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని వాదించారు.


వైఎస్సార్‌సీపీ తరపున కమిటీలో సభ్యుడిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వారి వాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. వారిపై చర్య తీసుకుంటే హోదా కోసం ఆందోళన చేస్తున్న రాష్ట్ర ప్రజలను అవమానించినట్లేనని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలను సభలో వినిపించే వారిని కమిటీ ముందుకు పిలిపించి, అభిప్రాయాలు విని అధికారపక్షానికి బలముందనే కారణంతో చర్యలు తీసుకుంటూ పోతే ఇక సభలో ఎవరూ మిగలరని వాదించారు. అయినా మెజారిటీ సభ్యులున్నా ప్రివిలేజెస్ కమిటీ పట్టు వీడకుండా 12 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ జరిగే సమయంలో రికార్డింగ్ చేసిన వీడియో టేపులను కమిటీ వీక్షించింది. ఆ వీడియో టేపుల ఆధారంగా సభ్యులకు నోటీసులు జారీ చేసింది.

>
మరిన్ని వార్తలు