ప్రత్యేక హోదా.. ఆంధ్రుల హక్కు

4 Aug, 2016 02:57 IST|Sakshi
ప్రత్యేక హోదా.. ఆంధ్రుల హక్కు

లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీల నినాదాలు
సమావేశానికి ముందు       గాంధీ విగ్రహం వద్ద ధర్నా
నిరసన తెలుపుతున్న   ఎంపీలను అభినందించిన జేసీ

 
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అమలుచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు పట్టుసడలని దీక్షతో పార్లమెంటు వెలుపల, లోక్‌సభలో మూడో రోజు తమ ఆందోళన కొనసాగించారు. తొలుత ఉదయం 10.30 గంటలకు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్రత్యేక హోదా నినాదాలతో తమ నిరసన తెలిపారు. ప్రత్యేక హోదా కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి నేతృత్వంలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, బుట్టా రేణుక, వై.ఎస్.అవినాష్ రెడ్డి ఈ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ధర్నా వద్దకు వచ్చి ఎంపీలందరితో కరచాలనం చేసి అభినందించడం విశేషం. అనంతరం లోక్‌సభ సమావేశం ప్రారంభం కాగానే సభాపతి సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు వెల్‌లోకి వెళ్లి ‘ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు- కేంద్రం బాధ్యత’, ‘ప్రత్యేక హోదా- ఆరు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు’, ‘ఢిల్లీ మేల్కోవాలి- ఏపీని రక్షించాలి’ అన్న నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. ప్రధాని ఎదురుగానే ఎంపీలు తమ నిరసన కొనసాగించారు.

మధ్యాహ్నం 12 గంటల సమయంలో వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు సభాపతి ప్రకటించిన తరువాత వైఎస్సార్‌సీపీ ఎంపీల నిరసన సభను హోరెత్తించింది. ‘కావాలి.. కావాలి.. ప్రత్యేక హోదా కావాలి..’ అంటూ తెలుగులో నినాదాలు చేశారు. మధ్యాహ్నం 1.20 గంటలకు సభ వాయిదా పడేంతవరకు వారు వెల్‌లో నిల్చొని గొంతులు పగిలేలా ప్రత్యేక హోదా కోసం నినదించారు. దాదాపు రెండున్నర గంటలపాటు విరామం లేకుండా నినదించారు.

పలు పార్టీల సంఘీభావం..: వైఎస్సార్‌సీపీ ఎంపీల మొక్కవోని పట్టుదలను చూసి పలు పార్టీలు సంఘీభావం తెలిపాయి. కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే ఒంటి గంట సమయంలో లేచి వైఎస్సార్‌సీపీ ఎంపీలు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఆర్థిక మంత్రి ఇప్పటికే ప్రకటన చేశారు కాబట్టి అవకాశం ఇవ్వలేనని స్పీకర్ చెప్పారు. నిరసన కొనసాగుతున్న సమయంలో సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్, పలువురు ఇతర పార్టీల ఎంపీలు వైఎస్సార్‌సీపీ ఎంపీలను పలుకరిస్తూ సంఘీభావం తెలిపారు.
 
వెల్‌లో ధర్నా చేస్తున్నంతసేపు కనబడలేదా?
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశానికి త్వరలోనే పరిష్కార మార్గం చూపనున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం మధ్యాహ్నం ప్రకటన చేసేటప్పుడు సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు లేరని టీడీపీ విమర్శించడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేక పాటి రాజమోహన్ రెడ్డి తప్పుబట్టారు. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం సభ వాయిదా పడేవరకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు, టీడీపీ ఎంపీలకు కనబడలేదా? అని ప్రశ్నించారు. మధ్నాహ్నం సభ వాయిదా పడగానే బయట మీడియాతో మాట్లాడి వచ్చేలోపే సభ ప్రారంభమైందని, ఆ వెంటనే హోదా అంశాన్ని పరిశీలిస్తున్నామని అరుణ్ జైట్లీ ప్రకటన చేశారని తెలిపారు. దీన్ని పట్టుకుని వైఎస్సార్‌సీపీ ఎంపీలకు చిత్తశుద్ధి లేదని విమర్శించడం తగదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలని చిత్తశుద్ధి ఉంది కాబట్టే గత రెండున్నరేళ్లుగా తమ పార్టీ, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారని చెప్పారు.

హోదాపై ముందు నుంచి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నది టీడీపీయేనని విమర్శించారు. ఇప్పుడు కూడా హోదా సాధనకు టీడీపీ చేపట్టిన ఆందోళనకు రెండు రోజులకే విరామం ప్రకటించిందని చెప్పారు. డ్రామాలు ఆపి హోదా సాధనకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని మేకపాటి హితవు పలికారు.
 
 

మరిన్ని వార్తలు