అసెంబ్లీలో ఎదుర్కోవడమెలా...?

16 Dec, 2015 16:02 IST|Sakshi
అసెంబ్లీలో ఎదుర్కోవడమెలా...?

అసెంబ్లీని కుదిపేయనున్న కాల్ మనీ సెక్స్ రాకెట్
ఎప్పటిలాగే ఎదురుదాడి వ్యూహంతో సర్కారు


హైదరాబాద్: గురువారం నుంచి ప్రారంభమవుతున్న ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ శీతాకాల సమావేశాలు వాడివేడిగా సాగనున్నాయి. ఇటీవలే వెలుగులోకి వచ్చిన కాల్ మనీ రాకెట్ దుమారంపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధమైంది. తెలుగుదేశం నేతల ప్రమేయంతో ఈ రాకెట్ సాగుతోందని పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో దీనిపై ఇప్పటికే ప్రతిపక్షం గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం, ఈ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్ హెచ్ఆర్‌సీ) తీవ్రంగా స్పందించడంతో చంద్రబాబు ప్రభుత్వం ఇరకాటంలో పడింది.

ఏపీలో తీవ్ర సంచలనం రేపిన కాల్ మనీ రాకెట్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న విజయవాడ కమిషనర్‌పై తీవ్ర ఒత్తిళ్ల నేపథ్యంలో ఆయన సెలవు కోరడం, దానిపైనా విమర్శలు వెళ్లువెత్తడంతో ఆయన సెలవు రద్దు చేయడం వంటి పరిణామాలు ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలోకి నెట్టింది. దీనిపై కూపీ లాగుతున్న కొద్దీ ఈ మొత్తం వ్యవహారం వెనుక అధికార పార్టీ నేతల పాత్ర స్పష్టం కావడంతో దీనిపై అసెంబ్లీలో ఎలా సమాధానం చెప్పాలన్న అంశంపై మంత్రులతో చంద్రబాబు తర్జనభర్జన పడ్డారు.

అసెంబ్లీలో ప్రతిపక్షం నిలదీసే అవకాశాలుండటంతో చివరి నిమిషంలో విజయవాడ కమిషనర్ గౌతం సవాంగ్ సెలవులను రద్దు చేసి దిద్దుబాట చర్యలకు ఉపక్రమించింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారులపై చర్యలు లేవన్న విషయంపై ప్రతిపక్షం లేవనెత్తితే ఎప్పటిలాగే ఎదురుదాడి చేయాలన్న నిర్ణయానికి వచ్చారు.

విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ అంశంపై చర్చించింది. మంత్రులకు పలు సూచనలు చేశారు. ప్రతిపక్షం ఈ అంశం లేవనెత్తగానే ఎదురుదాడికి దిగాలని ముఖ్యమంత్రి చెప్పినట్టు సమాచారం. అందుకు పార్టీకి చెందిన కొంత మంది నేతలను ఎంపిక చేశారు. కాల్ మనీ వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణ చేయాలని కేబినేట్ లో నిర్ణయించిన ప్రభుత్వం ఇదే అంశంపై సభలో ఒక ప్రకటన చేయడం ద్వారా విపక్షం దాడిని కట్టడి చేయాలని భావించారు.

బీఏసీలో నిర్ణయం
అసెంబ్లీ సమావేశాల్లో చేపట్టాల్సిన ఎజెండా నిర్ణయించడానికి స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన గురువారం సభా వ్యవహారాల మండలి (బీఏసీ) సమావేశం ఏర్పాటు చేశారు. శీతాకాల సమావేశాలు అయిదు రోజుల పాటే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండగా, ప్రజా సమస్యలు అనేకం చర్చించాల్సి ఉన్నందున సమావేశాలను పొడిగించాలని ప్రతిపక్షం కోరుతోంది.

మరిన్ని వార్తలు