ఓ రూ.10 వేల కోట్లు లాగేద్దాం!

25 Mar, 2016 10:13 IST|Sakshi

కొత్త బడ్జెట్‌లో పన్నులద్వారా రాబట్టాలని ప్రభుత్వ నిర్దేశం
వ్యాట్‌లో ఏకంగా రూ.8,500 కోట్లు లక్ష్యం
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా రూ.1,600 కోట్లు..
మద్యంపైనా భారీగా ఆదాయాన్ని సముపార్జించాలని లక్ష్యం
భారీగా ఆదాయ లక్ష్యాల నిర్దేశం పట్ల ఆదాయ వనరుల శాఖల గగ్గోలు
ఆచరణ సాధ్యం కాదని స్పష్టీకరణ పన్నులు పెంచితేనే సాధ్యమని కుండబద్దలు
అయితే పన్నులు పెంచేందుకు వీల్లేనందున బడ్జెట్ అమల్లో తిప్పలు తప్పవని హెచ్చరిక

 
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం(2016-17) బడ్జెట్‌లో పన్నుల రూపంలో అదనంగా రూ.పదివేల కోట్లకుపైగా ఆర్జించాలని లక్ష్యంగా నిర్ధారించడం పట్ల ఆదాయ వనరుల శాఖలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాస్తవంగా వచ్చిన ఆదాయానికి అనుగుణంగా పదిశాతం వృద్ధితో ఆదాయ లక్ష్యాల్ని నిర్ధారించాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా ఆర్థిక శాఖ భారీ లక్ష్యాల్ని నిర్దేశించిందని ఆయా శాఖలు పేర్కొంటున్నాయి.

బడ్జెట్‌లో ప్రధానంగా ఆదాయ వనరులు ఆర్జించే వ్యాట్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రవాణా, ఎ క్సైజ్ రంగాల లక్ష్యాలు అశాస్త్రీయంగా, ఆచరణ సాధ్యం కానివిగా ఉన్నాయని ఆయా శాఖల అధికారులు గగ్గోలు పెడుతున్నారు. ఆయా శాఖలతో సంప్రదింపులు జరపకుండానే ఆర్థికశాఖ ఏకపక్షంగా లక్ష్యాల్ని నిర్ధారిస్తూ వచ్చే బడ్జెట్‌ను రూపొందించిందని, దీంతో ఆ బడ్జెట్ అమల్లో తిప్పలు తప్పవన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఇంత భారీస్థాయిలో వ్యాట్ లక్ష్యమా?  
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యాట్ ద్వారా రూ.32,840 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా నిర్ధారించగా.. ఫిబ్రవరి నాటికి రూ.27,600 కోట్ల ఆదాయం వచ్చింది. మార్చి నెలాఖరుకు ఇది రూ.29,200 కోట్లకు మించదని వాణిజ్య పన్నులశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి వ్యాట్ లక్ష్యాన్ని రూ.37,435 కోట్లుగా ఆర్థికశాఖ నిర్ణయించడం గమనార్హం. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వచ్చిన ఆదాయంకంటే అదనంగా రూ.8,500 కోట్లకుపైగా ఆర్జించాలని ఆర్థికశాఖ నిర్ధారించింది.

ఇంత పెద్ద మొత్తంలో అదనంగా వ్యాట్ ద్వారా ఆదాయం సముపార్జన సాధ్యమవదని వాణిజ్య పన్నులశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. వ్యాట్ పన్ను ఇప్పటికే ఎక్కువగా ఉందని, అదనంగా పన్ను పెంచడానికి ఆస్కారం లేదని వారంటున్నారు. ఒకవైపు రాష్ట్రప్రభుత్వమే బియ్యం, పప్పుల మిల్లర్లు చెల్లించాల్సిన సీఎస్‌టీ బకాయిల్ని రూ.500 కోట్ల మేరకు రద్దు చేసిందని, ఇలా రాయితీలిచ్చుకుంటూ మరోవైపు పన్నులు పెంచకుండా వ్యాట్ ఆదాయం పెంచడం ఎలా సాధ్యమని వారు ప్రశ్నిస్తున్నారు.

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా అదనంగా రూ.1,600 కోట్లు లక్ష్యం..
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్‌శాఖ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3,500 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా నిర్ధారించగా ఫిబ్రవరికి రూ.3,200 కోట్ల ఆదాయం లభించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.4,060 కోట్ల ఆదాయం ఆర్జించగలమని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ స్పష్టం చేయగా ఆర్థికశాఖ మాత్రం ఏకంగా రూ.5,180 కోట్లు లక్ష్యంగా నిర్దేశించింది. అంటే ప్రస్తుత సంవత్సరం లక్ష్యం కంటే ఏకంగా రూ.1,600 కోట్లు అదనంగా ఆర్జించాలని నిర్ధారించారు. అయితే ఇంత పెద్దమొత్తంలో ఆదాయం సమకూర్చడం సాధ్యపడదని ఆ శాఖ అధికారులంటున్నారు. గతేడాది ఆగస్టులోనే భూముల విలువల్ని పెంచినందున వచ్చే ఏడాదిదాకా మళ్లీ పెంచేందుకు ఆస్కారం లేదంటున్నారు.
 
'మద్యం' లక్ష్యం సాధించాలంటే మరింత మందితో తాగించాలి!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మద్యం ద్వారా రూ.4,680 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టగా.. రూ.4,400 కోట్లు ఆర్జించారు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.5,756 కోట్లు లక్ష్యంగా పెట్టారు. ఆ మేరకు ఇప్పటికంటే అదనంగా రూ.1,300 కోట్లు ఆర్జించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ఆర్జించాలంటే వీలైనంత ఎక్కువ మందితో మద్యం తాగించాలని, లేదంటే ధరలు పెంచాలని ఎక్సైజ్‌శాఖ అధికారులు చెబుతుండడం గమనార్హం. ఇక రవాణా ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,977 కోట్లు ఆర్జించాలనేది లక్ష్యంకాగా ఫిబ్రవరి నాటికి రూ.1,950 కోట్లు వచ్చింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.2,412 కోట్లు ఆర్జించాలని ఆర్థికశాఖ నిర్ణయించింది.
 
అమలు తలకిందులవక తప్పదా?
ఆచరణ సాధ్యం కాని, వ్యూహలతో కూడిన ఆదాయ లక్ష్యాల్ని నిర్ధారిస్తూ బడ్జెట్‌ను రూపొందించడంతో దీని అమలు తలకిందులు కాక తప్పదనే భావనను ఆయా శాఖల అధికారులు వ్యక్తం చేస్తున్నారు. పన్నులు పెంచితేనే ఆదాయ లక్ష్యాల్ని చేరుకోవడం సాధ్యమని, కానీ ఇప్పటికే పన్నులు పెంచినందున.. ఇప్పుడు పెంచడం సాధ్యపడదని వారు చెబుతున్నారు. రెవెన్యూ మిగులుతోపాటు 53 శాతం ఆదాయం వచ్చే తెలంగాణ సర్కారు వచ్చే బడ్జెట్‌లో రాష్ట్ర సొంత ఆదాయాన్ని రూ.54,849 కోట్లుగా నిర్ధారించగా.. 47 శాతం ఆదాయం వచ్చే ఆంధ్రప్రదేశ్ సర్కారు వచ్చే బడ్జెట్‌లో రాష్ట్ర సొంత ఆదాయాన్ని రూ.57,800 కోట్లుగా నిర్ధారించడంలోనే బడ్జెట్‌లోని డొల్లతనం బయటపడుతోంది.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు