‘స్వచ్ఛ’తలో గ్రేటర్‌..

5 May, 2017 01:45 IST|Sakshi
‘స్వచ్ఛ’తలో గ్రేటర్‌..

స్వచ్ఛభారత్‌ మిషన్‌ ర్యాంకుల ప్రకటన
సిటీకి దేశంలో 22వ స్థానం
తెలంగాణలో నెం.1


సిటీబ్యూరో: నగరాన్ని క్లీన్‌సిటీగా తీర్చిదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ చేపట్టిన యజ్ఞానికి తగిన ఫలితం వచ్చింది. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ గురువారం వెల్లడించిన స్వచ్ఛ ర్యాంకుల్లో ఇతర మెట్రో నగరాలను తలదన్ని మెరుగైన ర్యాంకులో నిలిచింది. ఇటు తెలంగాణలోని  మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కంటే జీహెచ్‌ఎంసీ అగ్రస్థానంలో నిలిచింది. చిన్న పట్టణాలను, పెద్ద నగరాలను ఒకేగాటన కట్టవద్దంటూ జీహెచ్‌ఎంసీ చేసిన విజ్ఞప్తిని కేంద్రం పట్టించుకోకుండా అన్నింటికీ కలిపి ర్యాంకులు ప్రకటించింది. అయినాసరే జీహెచ్‌ఎంసీ జాతీయస్థాయిలో 22వ స్థానాన్ని సాధించింది. గ్రేటర్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ నగరాలను తలదన్ని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిల్‌ కార్పొరేషన్‌ అగ్రభాగాన నిలిచింది. న్యూఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్, సౌత్‌ ఎంసీడీ, నార్త్‌ ఎంసీడీ, ఈస్ట్‌ ఎంసీడీ, ఢిల్లీ కంటోన్మెంట్‌ అన్నింటికీ కలిపి 2015లో 16వ ర్యాంకు రాగా ప్రస్తుతం 100వ ర్యాంకుకు పైగా స్థానానికి పడిపోయాయి. మొత్తం ఐదు
కార్పొరేషన్లకు వెరసి సగటున 1118 మార్కులు లభించాయి. కోల్‌కతాకు 2015లో 56వ ర్యాంకు రాగా, ఈసారి పోటీలో పాల్గొనలేదు.

ఇంకా.. మరింత మెరుగ్గా..
స్వచ్ఛ భారత్‌ మిషన్‌ వెల్లడించిన స్వచ్ఛ ర్యాంకుల్లో జీహెచ్‌ఎంసీకి 22వ ర్యాంకు రావడంపై మేయర్‌ బొంతు రామ్మోహన్, కమిషనర్‌ డా.బి.జనార్దన్‌రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. నగర ప్రజలందరి సహకారం, జీహెచ్‌ఎంసీలోని అన్ని స్థాయిల సిబ్బంది కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. స్వచ్ఛ నగరం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించిన కార్యక్రమాలు, మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ చూపిన చొరవతో ఈ గౌరవం దక్కిందన్నారు. బహిరంగ మల, మూత్ర విసర్జన రహితం, వ్యక్తిగత మరుగుదొడ్లు వంటి కొన్ని అంశాల్లో వెనుకబడినందునే మొదటి స్థానం రాలేదని అభిప్రాయపడ్డారు. వచ్చే సంవత్సరం తొలి రెండు స్థానాల్లో నిలవగలమన్నారు. సమావేశంలో డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్, పలువురు అధికారులు పాల్గొన్నారు.

సమష్టి కృషితోనే అగ్రస్థానం
స్వచ్ఛ నగరమనే మహత్తర యజ్ఞంలో అందరి సమష్టి కృషితో అగ్రస్థానంలో నిలిచాం. సీఎంతో సహా అందరు ప్రజాప్రతినిధులు, అధికారుల కృషి వల్లే ఇది సాధ్యమైంది. నిత్యం దాదాపు 40 లక్షల మంది రాకపోకలు సాగించే నగరంలో పరిశుభ్రత అనేది అంత సులభం కాదు. నేను, నా నగరం అనే తలంపుతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛత కోసం కృషి చేశారు. ఈ స్ఫూర్తితో మరింత ముందుకెళతాం. త్వరలో అందుబాటులోకి రానున్న డెబ్రిస్‌ రీసైక్లింగ్‌ ప్లాంట్‌ వల్ల ప్రైవేట్‌వ్యక్తులు డెబ్రిస్‌ తరలించే వీలుండదు. భవన నిర్మాణ అనుమతులు, రహదారుల నిర్మాణ సమయంలోనే వ్యర్థాల తరలింపు ఫీజు వసూలు చేసేలా నిబంధనలు తీసుకురానున్నాం. నాలాల్లో చెత్త వేయకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటాం. స్వచ్ఛ నగరం కోసం ప్రజల్లో మరిన్ని అవగాహన కార్యక్రమాలు పెంచుతాం.
–  బొంతు రామ్మోహన్, మేయర్‌

ఇతర నగరాలకు స్ఫూర్తి
మహానగరాలు, పెద్ద నగరాలు, చిన్న పట్టణాలుగా వర్గీకరించి పోటీ పెడితే బాగుంటుందని మేం స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు సూచించాం. అలాచేసి ఉంటే మొదటి పదిస్థానాల్లో కచ్చితంగా నిలిచేవాళ్లం. మొత్తం 2 వేల మార్కులకు గాను 80 శాతం మార్కులు వచ్చాయి. వివిధ అంశాల్లో పారిశుధ్య కార్మికుల బయోమెట్రిక్‌ హాజరు, వాహనాల ట్రాకింగ్‌ , ఓడీఎఫ్‌ వంటి అంశాల్లో మార్కులు తగ్గి ఉంటాయి. ర్యాంకు ఎలా ఉన్నా జీహెచ్‌ఎంసీ ప్రవేశపెట్టిన బెస్ట్‌ ప్రాక్టీసెస్‌ జాతీయస్థాయిని ఆకర్షించాయి. తడి, పొడి చెత్త వేరుచేసే కార్యక్రమాన్ని జూన్‌ 5న అన్ని స్థానిక సంస్థలు అమలు చేయాల్సిందిగా సర్క్యులర్‌ జారీ అయింది. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా ఈనెల 5 నుంచే ప్రారంభిస్తున్నాం. వచ్చే సంవత్సరం మొదటి, రెండుస్థానాలు పొందేందుకు మరింత ఉత్సాహంతో పనిచేస్తాం.
– డా.బి.జనార్దన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌
 

మరిన్ని వార్తలు