రాష్ట్రంలో కొత్త విద్యుత్‌ సర్కిళ్లు!

20 Jun, 2017 00:30 IST|Sakshi
రాష్ట్రంలో కొత్త విద్యుత్‌ సర్కిళ్లు!

మరో 21 సర్కిల్‌ కార్యాలయాల ఏర్పాటు
- 15 నుంచి 36కు పెరిగిన డిస్కంల ఆపరేషన్స్‌ సర్కిళ్లు
- గ్రేటర్‌ హైదరాబాద్‌లో కొత్తగా 4 సర్కిళ్లు
- కొత్త జిల్లాలకు అనుగుణంగా డిస్కంల అధికార వికేంద్రీకరణ


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన జిల్లాలకు అనుగుణంగా రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు అధికార వికేంద్రీకరణ చేపట్టాయి. ఉమ్మడి జిల్లాల ఆపరేషన్స్‌ సర్కిల్‌ కార్యాలయాల ఆధ్వర్యంలోనే కొత్త జిల్లాల్లో విద్యుత్‌ పంపిణీ వ్యవహారాలను డిస్కంలు పర్యవేక్షిస్తుండగా, తాజాగా కొత్త జిల్లాల్లో సర్కిల్‌ కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌), ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్‌)ల పరిధిలో ఇప్పటివరకు మొత్తం 15 ఆపరేషన్స్‌ సర్కిల్‌ కార్యాలయాలుండగా, తాజాగా మరో 21 కొత్త సర్కిల్‌ కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. దీంతో రాష్ట్రంలో విద్యుత్‌ సర్కిల్‌ కార్యాలయాల సంఖ్య 36కు పెరిగింది.

గ్రేటర్‌ పరిధిలో 6 సర్కిల్‌ కార్యాలయాలు ఉండగా.. పెంపులో భాగంగా 4 కొత్త సర్కిళ్లు ఏర్పాటయ్యాయి. విద్యుత్‌ సర్కిల్‌ కార్యాలయాల పర్యవేక్షణలోనే క్షేత్రస్థాయి వరకు విద్యుత్‌ సరఫరా జరుగుతుంది. విద్యుత్‌ పంపిణీలో అంతరాయాలను సరిదిద్దడం, విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు, విద్యుత్‌ బిల్లుల వసూళ్లు తదితర కీలక బాధ్యతలను విద్యుత్‌ సర్కిల్‌ కార్యాలయాలు పర్యవేక్షిస్తున్నాయి. ఒకేసారి వీటి సంఖ్య భారీగా పెంచడంతో క్షేత్రస్థాయి వరకు సర్కిల్‌ కార్యాలయాల సేవలు అందనున్నాయి. ఈ కార్యాలయాలకు సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ (ఎస్‌ఈ) స్థాయి అధికారులను నియమిస్తూ డిస్కంలు ఉత్తర్వులిచ్చాయి. భారీ ఎత్తున డివిజనల్‌ ఇంజ నీర్లను ఎస్‌ఈలుగా పదోన్నతులు కల్పించాయి.

దక్షిణ డిస్కం పరిధిలో..
టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ పరిధిలో 10 సర్కిల్‌ కార్యాలయాలుండగా, కొత్తగా మరో 9 కార్యాలయాలను సంస్థ యాజమాన్యం ఏర్పాటు చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో హైదరాబాద్‌ సెంట్రల్, హైదరాబాద్‌ సౌత్, హైదరాబాద్‌ నార్త్, రంగారెడ్డి ఈస్ట్, రంగారెడ్డి నార్త్, రంగా రెడ్డి సౌత్‌ సర్కిల్‌ కార్యాలయాలున్నాయి. తాజా గా గ్రేటర్‌ పరిధిలో 4 సర్కిల్‌ కార్యాలయాలను  ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ నార్త్‌ సర్కిల్‌ను రెండుగా విభజించి బంజారాహిల్స్, సికింద్రాబాద్‌ సర్కిల్‌ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. సరూర్‌నగర్, రాజేంద్రనగర్, సైబర్‌ సిటీ సర్కిళ్లను ఏర్పాటు చేసింది. రంగారెడ్డి సౌత్‌ సర్కిల్‌ పేరును వికారాబాద్‌గా మార్చింది. గ్రామీణ ఉమ్మడి జిల్లాలైన నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్‌లతోపాటు సిద్దిపేటలో ఒక్కో సర్కిల్‌ కార్యాలయం ఉండగా, ఇప్పుడు యాదాద్రి, సూర్యాపేట, గద్వాల్, నాగర్‌ కర్నూల్, వనపర్తి, మెదక్‌లలో కొత్త సర్కిల్‌లను ఏర్పాటు చేసింది.

ఉత్తర తెలంగాణ డిస్కం పరిధిలో..
టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ పరిధిలో 5 సర్కిళ్లు ఉండగా, తాజాగా మరో 10 కొత్త సర్కిళ్లు ఏర్పాటయ్యా యి. గతంలో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌ సర్కిళ్లు ఉండగా, కొత్తగా నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, జగి త్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కామారెడ్డి, వరంగల్‌ రూరల్, జయశంకర్‌ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, భద్రాద్రి సర్కిళ్లను ఏర్పాటు చేసింది. వరంగల్‌ సర్కిల్‌ను వరంగల్‌ అర్బన్‌గా పేరు మార్చింది. దీంతో టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ పరిధిలో సర్కిళ్ల సంఖ్య 17కి పెరిగింది.

మరిన్ని వార్తలు