నూతన విద్యా విధానంలో మరో 4 అంశాలు

29 Dec, 2015 00:35 IST|Sakshi
నూతన విద్యా విధానంలో మరో 4 అంశాలు

♦ కేంద్రానికి ప్రతిపాదించాలని నిర్ణయించిన రాష్ట్రం
♦ రాష్ట్ర అవసరాలపై సూచనల కోసం రాజకీయ పార్టీలతో అఖిలపక్షం
♦ ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాల నుంచి అభిప్రాయాల సేకరణ
♦ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా సిఫారసులు: డిప్యూటీ సీఎం కడియం
 
 సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తేనున్న నూతన విద్యా విధానంలో మరో నాలుగు ప్రధాన అంశాలపై చర్చించి విధాన పరమైన నిర్ణయాలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసేందుకు రాష్ట్ర విద్యా శాఖ సిద్ధమైంది. విద్యా హక్కు చట్టం నిబంధనలు, అమలు, విద్యా రంగం బలోపేతానికి ఆర్థిక వనరుల కల్పన, నాణ్యమైన విద్యాబోధన,  ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతం, పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం వంటి నాలుగు ప్రధా న అంశాలకు నూతన విద్యా విధానంలో చోటు కల్పించాలని, వాటిపై ప్రభుత్వానికి స్పష్టమైన వైఖరి ఉండాలని పేర్కొంది.

ఈ మేరకు పాఠశాల స్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించిన సమావేశాల్లో వెల్లడైన అభిప్రాయాల ఆధారంగా ఈ సిఫారసులను సిద్ధం చేస్తోంది. విద్యాశాఖ ఇటీవల రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యా య సంఘాలు, ఎమ్మెల్సీలు, మేధావులతో సమావేశాలు నిర్వహించింది. ఇక సోమవారం పాఠశాల విద్యా డెరైక్టరేట్‌లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీల నేతల నుంచి అభిప్రాయాలు స్వీకరించింది. వీటన్నింటినీ క్రోడీకరించి ఈ నెల 31 లోగా కేంద్రానికి  సిఫారసులను పంపించాలని నిర్ణయించింది.  

 కనీస సామర్థ్యం కరువు: కడియం
 ప్రస్తుతం రాష్ట్రంతోపాటు దేశ వ్యాప్తంగా పాఠశాల విద్యార్థుల్లో కనీస సామర్థ్యం ఉండ టం లేదని కడియం అన్నారు. తెలంగాణలోని పాఠశాలల్లో విద్యార్థుల నమోదు 98 శాతం ఉందని, అయితే వారంతా హైస్కూ లు చదువు పూర్తయ్యే వరకు పాఠశాలల్లో ఉండటం లేదన్నారు. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు, విద్యా ప్రమాణాల పెంపునకు అవసరమైన సూచనలు కోరారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.  
 
 పార్టీల నేతలేమన్నారంటే...
 
 శ్రీనివాసరెడ్డి, సుధాకర్‌రెడ్డి(టీఆర్‌ఎస్): యూనివర్సిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వీసీలను నియమించాలి. అలాగే పర్యవేక్షణ బలోపేతం చేస్తే స్కూళ్లు బాగుపడతాయి.
  కమలాకర్‌రావు(కాంగ్రెస్): అనుభవ పూర్వక విద్య అవసరం. వ్యవసాయ ఆధారిత కోర్సులు ప్రవేశ పెట్టాలి. ప్రాథమిక విద్యనుంచే ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టాలి. ఉన్నత విద్యలో వృత్తి విద్యను ప్రవేశ పెట్టాలి.
  ఆర్.కృష్ణయ్య, రావుల చంద్రశేఖర్‌రెడ్డి (టీడీపీ): ఐదో తరగతి వరకు మాతృభాషలోనే విద్య ఉండాలి. ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తూనే ప్రైవేటు స్కూళ్లను నియంత్రించాలి. 50 శాతం మహిళా టీచర్లను నియమించాలి.
  నల్లా సూర్య ప్రకాశ్(వైఎస్సార్‌సీపీ): ఒకటో తరగతి నుంచే ఇంగ్లిషు మీడియం ప్రవేశ పెట్టాలి. పోటీని తట్టుకోవాలంటే ఇంగ్లిషు మీడియం అవసరం. అధికారులు, రాజకీయ నాయకులు, తమ పిల్లలను ఇంగ్లిషు మీడియంలో చదివిస్తూ ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం తెలుగు మీడియం ఉండాలంటున్నారు. ఈ ద్వంద్వ విధానాన్ని విడనాడాలి. టీచర్లు స్థానికంగా ఉండేలా చర్యలు చేపట్టాలి.
  మనోహర్‌రెడ్డి (బీజేపీ): స్కూళ్లలో ల్యాబ్‌ల నిర్వహణపై చర్యలు చేపట్టాలి. బయో మెట్రిక్ విధానం పక్కాగా అమలు చేయాలి.
  పల్లా వెంకట్‌రెడ్డి (సీపీఐ): సరిపడా నిధులు ఇవ్వాలి. టీచర్ల బదిలీలను సెలవుల్లోనే చేపట్టాలి. రాష్ట్రంలో కామన్ విధానం ఉండాలి.
  సాగర్(సీపీఎం): కేంద్రం కిందిస్థాయి నుంచి అభిప్రాయాలు తీసుకోకుండా, పైస్థాయి నుంచే నిర్దిష్ట అంశాలపై నిర్ణయాలు తీసుకోవాలి. టెట్ అవసరం లేదు.
  రాజారెడ్డి(లోక్‌సత్తా): ప్రభుత్వ విద్యారంగంలో ప్లే స్కూళ్లను ఏర్పాటు చేయాలి.
 ఆయేషా రుబినా (ఎంఐఎం): స్కూళ్లలో వసతులు కల్పించాలి. కంప్యూటర్ విద ్యను బలోపేతం చేయాలి.

మరిన్ని వార్తలు