పేద కుటుంబాలకు ఆసరా

24 Jan, 2018 01:51 IST|Sakshi

మృతదేహాల తరలింపునకు మరో 45 వాహనాలు  

 నెలాఖరులో అందుబాటులోకి కొత్త వాహనాలు  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రతి నెలా సగటున రెండు వేల మరణాలు నమోదవుతున్నాయి. మృతుల్లో అధిక శాతం పేదలే ఉంటున్నారు. మృతదేహాలను సొంత ఖర్చులతో ఇళ్లకు తీసుకెళ్లలేని స్థితిలో వీరు ఉంటున్నారు. ప్రైవేటు వాహనాల యాజమానులు చెప్పిందే ధరగా ఉంటోంది. దూరాన్ని బట్టి కనీసం రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చవుతోంది. మృతదేహాల తరలింపు ప్రస్తుతం పెద్ద ఖర్చుగా మారుతోంది. దీంతో పేద కుటుంబాలకు ఆసరాగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఆస్పత్రులలో చనిపోయిన వారిని ఉచితంగా ఇళ్ల వద్దకు చేర్చాలని నిర్ణయించింది. ప్రస్తుతం 18 జిల్లాల్లో 50 వాహనాలతో ఈ సేవలను అందిస్తున్నారు. రెండో దశలో మరో 45 వాహనాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేసింది. జనవరి చివరి వారంలో కొత్త వాహనాల సేవలను ప్రారంభించనున్నట్లు ఆరోగ్య, కుటుం బ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.  

ఇప్పటివరకు 16,552 మృతదేహాల తరలింపు.. 
రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా మృతదేహాల తరలింపు కార్యక్రమాన్ని 2016 నవంబర్‌ 18న ప్రారంభించింది. దీని కోసం రూ.50 కోట్లను విడుదల చేసింది. మొదటి దశలో 50 వాహనాలను ఏర్పాటు చేసింది. ఉచిత మార్చురీ సేవల కార్యక్రమంతో 2018 జనవరి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 16,552 మృతదేహాలను ఇళ్ల వద్దకు చేర్చారు. ఒకేసారి రెండు మృతదేహాలను తరలించేలా ఈ వాహనాలను తయారు చేయించారు.

మృతదేహాలు చెడిపోకుండా ఉండేందుకు బాడీ ఫ్రీజర్లను అమర్చారు. మృతుల బంధువులు అదే వాహనంలో వెళ్లేలా సీట్లను అమర్చారు. ప్రతి వాహనానికి ఒక సహాయకుడిని నియమించారు. ఉచిత మార్చురీ వాహనాల నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం జీవీకే–ఈఎంఆర్‌ఐకి అప్పగించింది. ప్రతి వాహనానికి నెలకు రూ.60 వేల చొప్పన ప్రభుత్వం చెల్లిస్తోంది. ఆయా ఆస్పత్రులలోని ప్రాంతీయ వైద్యాధికారి గానీ, సూపరింటెండెంట్‌ గానీ ధ్రువీకరించిన తర్వాతే ఉచిత వాహనాల సేవలను కేటాయిస్తున్నారు.

మరిన్ని వార్తలు