ఎంజీఎంలో మరో నాసిరకం ఔషధం?

25 Jul, 2016 03:06 IST|Sakshi

-  ప్రాలీడోక్సైజ్ క్లోరైడ్ ఇంజక్షన్ లో ఫంగస్..!
 
ఎంజీఎం: ప్రభుత్వాస్పత్రులకు టీఎస్ ఎంఎస్‌ఐడీసీ ద్వారా సరఫరా చేస్తున్న ఔషధాలలో నాసిరకమైనవి సరఫరా అవుతున్నట్లు ఆరోపణలు సద్దుమణగకముందే ఆదివారం ఎంజీఎం ఆస్పత్రిలో మరో ఔషధంలో ఫంగస్ వచ్చినట్లు సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో డ్రగ్ అధికారులు ఆదివారం రాత్రి శాంపిల్స్‌ సేకరించారు. క్రిమిసంహారక మందు తాగడంతో పాటు ఏదైనా విషం తాగి కొట్టుమిట్టాడుతున్న రోగులకు అందించే ప్రాలీడోక్సైజ్ క్లోరైడ్ ఇంజక్షన్‌లో ఫంగస్ వచ్చినట్లు వైద్యసిబ్బంది  గుర్తించారు. అయితే, ఈ విషయాన్ని ఎంజీఎం పరిపాలనాధికారులు వెలుగులోకి రాకుండా జాగ్ర త్తలు తీసుకోగా, విషయాన్ని రోగులు వెలుగులోకి తీసుకొచ్చారు.
 
 దీంతో అధికారులు ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఎంజీఎంకు వచ్చారు. ఫార్మాసిస్టులు అందుబాటులో లేకపోవంతో డ్రగ్ అధికారులు శాంపిల్స్ సేకరించడానికి రెండు గంటల సమయం పట్టింది. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి సరఫరా అరుున 1604502 బ్యాచ్‌కు చెందిన ప్రాలీ డోక్సైమ్ క్లోరైడ్ ఇంజక్షన్‌లో ఫంగస్ ఉన్నట్లు ఆరోపణలు రావడంతో  రోగులకు ఈ బ్యాచ్ ఇంజక్షన్‌లు అందించవద్దని డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఉపేందర్ ఎంజీఎం ఫార్మాసిస్టులను అదేశించారు. ఔషధ నియంత్రణ శాఖ జేడీ అమృతరావు, డీడీ సురేంద్రనాథ్‌సాయి అదేశాల మేరకు వీటి శాంపిల్స్‌ను పరిశీలిస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు