ఆత్మగౌరవం కోసం మరో పోరాటం

3 Jun, 2017 02:08 IST|Sakshi
ఆత్మగౌరవం కోసం మరో పోరాటం
- అందుకోసమే ‘తెలంగాణ ఇంటి పార్టీ’
ఆవిర్భావ సభలో చెరుకు సుధాకర్‌ ప్రకటన
- సమైక్య పాలనకు, టీఆర్‌ఎస్‌ పాలనకు తేడా ఏమీ లేదు
- బీసీలకు అధికారమే లక్ష్యం
 
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆత్మగౌరవం కోసం, సామాజిక శక్తులకు గుర్తింపు, సామాజిక తెలంగాణ సాధనే ధ్యేయంగా ‘తెలంగాణ ఇంటి పార్టీ’ని స్థాపిస్తున్నట్లు తెలంగాణ ఉద్యమ నాయకుడు చెరుకు సుధాకర్‌ ప్రకటించారు. 2019లో బీసీలకు అధికారమే లక్ష్యంగా ఈ కొత్త పార్టీని ప్రారంభిస్తున్నామని తెలిపా రు. శుక్రవారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో ‘తెలంగాణ ఇంటి పార్టీ’ని ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, పలువురు మలిదశ తెలంగాణ ఉద్యమకారులతో ఈ పార్టీ ప్రారంభమైంది.

వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు హాజరైన ఈ సభలో చెరుకు సుధాకర్‌ పార్టీ ఆవిర్భావాన్ని ప్రకటించి.. ప్రసంగించారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలేవీ నెరవేరడం లేదని... సమైక్య పాలకుల పాలనకు, ఇప్పుడు టీఆర్‌ఎస్‌ పాలనకు పెద్దగా తేడా లేకుండా పోయిందని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, సామాజిక శక్తులకు, ఉద్యమ కారులకు గౌరవం దక్కే సామాజిక తెలంగాణను సాధించేందుకు కొత్త పార్టీతో ముందుకువచ్చామని చెప్పారు. ఒక ఉద్యమ స్ఫూర్తితో వచ్చిన పార్టీ ‘తెలంగాణ ఇంటి పార్టీ’అని పాలకులకు తెలిసేలా శ్రేణులంతా నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు.

బీసీలకు అధికారం కావాలన్న కోరిక ముందు ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా నడవబోవని, 52 శాతంగా ఉన్న బీసీలకు ముఖ్యమంత్రి పదవి దక్కేలా పనిచేస్తామని ప్రకటించారు. తెలం గాణ ఆత్మగౌరవ పతాకగా తమ పార్టీ పనిచేస్తుందని చెప్పారు. ‘‘బానిసత్వం మృత్యువు కంటే హీనం. మల్లన్నసాగర్‌లో రైతులను కొడుతుంటే, ధర్నాచౌక్‌లో ఉద్యమకారులను తరుముతుంటే తెలంగాణ మేధావులు ఏం చేస్తున్నారు? సమాధానం చెప్పాలి. ఎవరు ఎటువైపో తేల్చుకోండి..’’అని చెరుకు సుధాకర్‌ పిలుపునిచ్చారు.
 
ఇక ఐక్య ఉద్యమాలు
ఇక తెలంగాణలో ఐక్య ఉద్యమాలు అవసరమని, బహుజనులకు అధికారం కోసం పోరాటం జరగాల్సి ఉందని విమలక్క పేర్కొన్నారు. మలిదశ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. త్యాగాల తోవలో కొత్త ఉద్యమం చేయాల్సి ఉందని.. మోసపోయిన వారికి, దగాపడిన బిడ్డలకు తెలంగాణ ఇంటి పార్టీ సొంతిల్లు వంటిందని గాయకుడు ఏపూరి సోమన్న వ్యాఖ్యానించారు. 
 
మళ్లీ పోరాట జెండా ఎత్తుకున్నం
తెలంగాణ ఉద్యమకారుల కోసం మళ్లీ పోరాట జెండా ఎత్తుకున్నామని యెన్నం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. బడుగుల కోసం, తెలంగాణవాదుల కోసం ‘తెలం గాణ ఇంటి పార్టీ’ పెడుతున్నామని చెప్పారు. ప్రజల ఇంటికే సంక్షేమం రావాల నుకుంటున్నామని, సంక్షేమమంటే పెన్షన్లు ఇవ్వడమే కాదన్నారు. రాష్ట్రంలో విద్య కార్పొరేట్‌ సంస్థల చేతుల్లో బందీ అయింద ని.. అంతా కళ్లు తెరవాలన్నారు. సామాజిక శక్తులను ఏకం చేస్తామని.. తెలంగాణ ఇంటి పార్టీని పెంచి, నిలబెట్టి, తలకెత్తుకో వాల్సింది ఉద్యమకారులేనని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఖరిని నిలదీస్తే బెదిరిం పులకు పాల్పడుతోందన్నారు. కానీ ఈ తెలంగాణ గడ్డ ఎంతో మంది నియంతల ను చూసిందని, వారిని శంకరగిరి మాన్యా లు పట్టించిందని చెప్పారు. 2019 ఎన్నికల్లో సత్తా చూపుతామని, ఇంటి పార్టీ తరఫున ఆగస్టులో బస్సు యాత్ర ప్రారంభిస్తామని, డిసెంబరు 2న వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. 
మరిన్ని వార్తలు