కృష్ణమ్మకు అడ్డుకట్ట!

7 Feb, 2017 03:17 IST|Sakshi
కృష్ణమ్మకు అడ్డుకట్ట!
  • కృష్ణాపై మరో నాలుగు ఎత్తిపోతల పథకాలు చేపట్టిన కర్ణాటక
  • అదనంగా 21 టీఎంసీల వినియోగానికి ప్రణాళిక
  • ఇప్పటికే ఓకే చెప్పిన కేంద్ర పర్యావరణ శాఖ
  • అవి పూర్తయితే రాష్ట్రానికి భారీగా తగ్గిపోనున్న నీటి రాక
  • సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా జలాలను ఎగువనే పూర్తిగా బందీ చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పైనుంచి కిందకు నీటి ప్రవాహాలు రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేసేందుకు యత్నిస్తోంది. ఇందు లో భాగంగా కొత్త ఎత్తిపోతల పథకాలకు కేంద్రం నుంచి అనుమతులు సాధించుకునే దిశగా కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందులో ఇప్పటికే నాలుగు ఎత్తిపోతల పథకాలకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు ఇచ్చింది. ఈ ప్రాజెక్టులు అధికారికమైతే దిగువకు 21 టీఎంసీల మేర ప్రవాహాలు తగ్గిపోనుండడం రాష్ట్రాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.

    అవి పూర్తయితే మనకు కష్టమే..
    ఇప్పటికే అప్పర్‌ కృష్ణా ఇరిగేషన్‌ ప్రాజె క్టు(యూకేఐపీ) కింద కర్ణాటక.. బీజాపూర్, గుల్బర్గా, ఉద్గీర్, భగల్‌కోట్, రాయచూర్‌ జిల్లాల్లోని 6.22 లక్షల హెక్టార్ల ఎకరాలకు నీరందిస్తోంది. ఈ ఆయకట్టును మరింత విస్తారించాలని కృష్ణ భాగ్య జల నిగమ్‌ లిమిటెడ్‌ (కేబీజేఎన్‌ఎల్‌) ప్రతిపాదించింది. ఇందులో భాగంగా అప్పర్‌ కృష్ణాలో బీజాపూర్‌ జిల్లా బుధిహాల్‌– పీరాపూర్, రాయిచూర్‌ జిల్లాల్లోని నందవాడ్జి, రామత్తల్, భగల్‌కోట్‌ జిల్లాలోని తిమ్మాపూర్‌ వద్ద నాలుగు ఎత్తిపోతల పథకాలను రూ.3,710 కోట్లతో చేపట్టాలని కర్ణాటక సర్కారు నిర్ణయించింది. వీటికి మొత్తంగా 21 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ప్రణాళికలు వేసింది.

    వీటిద్వారా 1.29 లక్షల హెక్టార్లకు సాగునీటిని ఇవ్వాలని చూస్తోంది. ఈ ఎత్తిపోతల పథకాల కోసం 2,403 హెక్టార్ల మేర భూసేకరణ అవసరం ఉండగా... కేబీజేఎన్‌ఎల్‌ ఇప్పటికే 822 హెక్టార్ల మేర భూసేకరణను పూర్తి చేసింది. తాజాగా పర్యావరణ, అటవీ, ఇతర అనుమతుల కోసం కేంద్రానికి దరఖాస్తు చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు కూడా మంజూరు చేసింది. ఇది తెలంగాణను కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ ప్రాజెక్టులు నీటి వినియోగాన్ని మొదలు పెడితే దిగువన ఉన్న జూరాలకు నీటి ప్రవాహాలు తగ్గుతాయి. ఇప్పటికే ఎగువన వచ్చిన వరదను వచ్చినట్టే కర్ణాటక పట్టేసుకుంటోంది.

    కిందకు చుక్క నీటిని వదలకపోవడంతో తెలంగాణ, ఏపీలో కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులకు గడ్డుకాలం తప్పడం లేదు. ఒకవేళ నీరొచ్చినా ఖరీఫ్‌ సాగుకు నవం బర్, డిసెంబర్‌ వరకు ఆగాల్సిన పరిస్థితి వస్తోంది.  అదనంగా మరో 21 టీఎంసీల నీటి వినియోగం మొదలు పెడితే దిగువకు నీటి రాక మరింత తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది.

    పోలవరం వాటాల్లోంచేనా?
    గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తూ పోలవరం ప్రాజెక్టును చేపట్టిన వెంటనే ఎగువ రాష్ట్రాలకు 35 టీఎంసీల మేర వాటాలు దక్కుతాయని బచావత్‌ ట్రిబ్యునల్‌ అవార్డులో ఉంది. ప్రస్తుతం పోలవరానికి జాతీయ హోదా కట్టబెట్టడంతో ఎగువ రాష్ట్రాలకు వాటాలు దక్కాయి. ఇందులో 14 టీఎంసీలు మహారాష్ట్రకు దక్కనుండగా, కర్ణాటకకు 21 టీఎంసీలు దక్కుతాయి. దీన్ని ఆధారంగా చేసుకొనే కర్ణాటక 4 ఎత్తిపోతల పథకాలు చేపట్టిందని, అందుకే కేంద్ర పర్యావరణ శాఖ సైతం వెంటనే అనుమతులు జారీ చేసి ఉండవచ్చని తెలంగాణ నీటి పారుదల శాఖ వర్గాలు అంటున్నాయి. నిజంగా ఆ నీటి వాటాలపై ఆధారపడే ఈ ఎత్తిపోతలు చేపట్టారా? లేదా అదనపు నీటి వినియోగమా? అన్న అంశమై సోమవారం ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఈఎన్‌సీ మురళీధర్‌ హైడ్రాలజీ, అంతరాష్ట్ర వ్యవహారాల విభాగపు అధికారులతో భేటీ నిర్వహించారు. పూర్తిస్థాయి అధ్యయనం తర్వాతే తదుపరి ప్రతిస్పందన తెలియ జేయాలని నిర్ణయించారు.

    ‘కృష్ణా’ నియంత్రణపై వెనక్కి తగ్గని బోర్డు
    కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులను నియం త్రణలోకి తెచ్చుకునే అంశంపై బోర్డు వెనక్కి తగ్గట్లేదు. ఈ విషయమై గత ముసాయిదా నోటిఫికేషన్‌పై రాష్ట్ర ప్రభు త్వం అభ్యంతరం చెప్పనందున తమ సిఫార్సులకు సమ్మతిగానే భావిస్తామని పేర్కొంటోంది. బుధవారం జరగనున్న బోర్డు భేటీలో నోటిఫికేషన్‌ అంశాన్ని ఎజెండాగా చేర్చింది. దీనిని తప్పుబడు తూ తెలంగాణ ప్రభుత్వం గతంలో చేసిన ఫిర్యాదుపై కేంద్ర జలవనరులశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ పని మొదలు పెట్టకముందే కృష్ణా బోర్డు తన ‘ఎజెండా’తో ముందుకు సాగుతుండటం గమనార్హం.

    ప్రాజెక్టులను నియంత్రణ లోకి తెచ్చుకునేందుకే దీన్ని ఎజెండాలో చేర్చారని తెలంగాణ ప్రభుత్వం అనుమా నిస్తోంది.  పారదర్శకంగా నీటి వినియో గం జరిగేందుకు టెలిమెట్రీ పరికరాలను సైతం ఏర్పాటు చేస్తుండగా మళ్లీ ప్రాజె క్టుల నియంత్రణ అవసరం ఏమిటని వాదిస్తోంది. పులిచింతల ఫోర్‌షోర్‌ నీటిపై ఆధారపడి నల్లగొండ జిల్లాలో ఉన్న ఎత్తిపోతల కింది 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా ఏపీ తీసుకోవాల్సిన చర్యలపైనా లేవనెత్తనుంది.

మరిన్ని వార్తలు