రాష్ట్రానికి మరో జాతీయ రహదారి

16 Apr, 2017 02:47 IST|Sakshi

కొత్తకోట–గద్వాల–గూడూరు – మంత్రాలయం మధ్య నిర్మాణం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి మరో జాతీయ రహదారి మంజూరైంది. కొత్తకోట– గద్వాల– గూడూరు– మంత్రా లయం మధ్య దీన్ని నిర్మించనున్నారు. హైదరాబాద్‌– మంత్రాలయం– రాయచూర్‌ అనుసంధానంగా కర్ణాటక రాష్ట్రం ఈ రోడ్డును ప్రతిపాదించగా.. కేంద్ర భూ ఉపరితల రవాణా శాఖ తాజాగా పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి కొత్తకోట వరకు జాతీయ రహదారి ఉండటంతో అక్కడి నుంచి కొత్త జాతీయ రహదారి నిర్మించనున్నారు.

రాష్ట్ర భూభాగంలో దాదాపు 70 కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ రోడ్డును రోడ్లు భవనాల శాఖ పరిధిలోని జాతీయ రహదారుల విభాగం నిర్మించనుంది. రహదారి నిర్మాణానికి దాదాపు రూ.400 కోట్లు ఖర్చవుతుందని అంచనా. త్వరలో డీపీఆర్‌లు రూపొందించి ఢిల్లీకి పంపనున్నట్లు జాతీయ రహదారుల విభాగం ఈఎన్‌సీ గణపతిరెడ్డి వెల్లడించారు. కాగా, రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకు 2,915 కిలోమీటర్ల నిడివి గల 21 జాతీయ రహదారులను కేంద్రం మంజూరు చేసింది. తాజాగా కర్ణాటక ప్రతిపాదనతో ఈ 22వ జాతీయ రహదారి మంజూరైంది.  

అనుసంధానమే: మంత్రి తుమ్మల
దేశంలోని హైవేలను అనుసంధానించే క్రమంలో ఇలాంటి లింకు రోడ్లను కేంద్రం మంజూరు చేస్తోందని మంత్రి తుమ్మల తెలిపారు. రాయచూర్‌ 167 నం జాతీయ రహదారితో అనుసంధానించే క్రమంలో ఈ రోడ్డు నిర్మాణం జరుగుతోందన్నారు.

మరిన్ని వార్తలు