3 నుంచి ఏపీ ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ

27 Jan, 2016 19:57 IST|Sakshi

-అపరాధ రుసుము లేకుండా తుది గడువు మార్చి 21
-మార్చి 3 నుంచి పీజీసెట్ దరఖాస్తులు
-దరఖాస్తు రుసుము రూ.100 పెంపు


హైదరాబాద్

 ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్సు టెస్టు (ఏపీ ఎంసెట్-2016), ఏపీ పీజీసెట్ దరఖాస్తుల స్వీకరణ తేదీలు ఖరారయ్యాయి. ఎంసెట్ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఫిబ్రవరి మూడో తేదీనుంచి ప్రారంభం కానుంది. పీజీసెట్ దరఖాస్తుల స్వీకరణ మార్చి ఆరో తేదీనుంచి ప్రారంభమవుతుంది. ఎంసెట్ నోటిఫికేషన్‌ను ఈనెల 29న, పీజీసెట్ నోటిఫికేషన్‌ను మార్చి 4వ తేదీన విడుదల చేయనున్నారు. ఏపీ ఎంసెట్, పీజీసెట్ కమిటీల మొదటి సమావేశం బుధవారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగింది. సమావేశానంతరం ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈనెల 29న నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని ఫిబ్రవరి 3 నుంచి మార్చి 21 వరకు అపరాధ రుసుము లేకుండా ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నామని వివిరించారు. ఆన్‌లైన్ దరఖాస్తుల సమయాన్ని 48 రోజుల పాటు కేటాయిస్తున్నారు. దరఖాస్తులను ఆన్‌లైన్లో మాత్రమే దాఖలు చేయాలని కన్వీనర్ సాయిబాబు స్పష్టంచేశారు.

దరఖాస్తు, ఇతర నియమనిబంధనలకు సంబంధించిన అంశాలను www.apeamcet.org ’’లో పొందుపరుస్తున్నామన్నారు. ఒక దరఖాస్తు ఒక్కసారే ఆన్‌లైన్లో ఆమోదం పొందుతుందని, ఈ విషయాన్ని అభ్యర్ధులు గమనించి వివరాలను సరిచూసుకొని అప్‌లోడ్ చేయాలని సూచించారు. దరఖాస్తు ఫీజును ఏపీ ఆన్‌లైన్, టీఎస్ ఆన్‌లైన్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు, కొటక్ మహీంద్రాబ్యాంకు, క్రెడిట్, డెబిట్ మాస్ట్రో కార్డుల ద్వారా చెల్లించవచ్చని వివరించారు. పరీక్ష నమూనా గత ఏడాది మాదిరిగానే ఉంటుందన్నారు. అపరాధ రుసుము రూ.500 తో ఏప్రిల్ 2వరకు, రూ.1000తో ఏప్రిల్ 11వరకు, 5వేల అపరాధ రుసుముతో ఏప్రిల్19 వరకు, రూ.10వేల అపరాధ రుసుముతో ఏప్రిల్ 27వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువుగా నిర్ణయించినట్లు వివరించారు. ఏప్రిల్27నుంచి హాల్‌టిక్కెట్ల జారీచేయనున్నారు. ఈఏడాది.. ఎంసెట్ కు 2.70 లక్షల మంది దరఖాస్తు చే యవచ్చని అంచనావేస్తున్నామని తెలిపారు.

 ఇలా ఉండగా ఏపీ పీజీసెట్‌కు సంబంధించి మార్చి 4న నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. మార్చి 6 నుంచి ఏప్రిల్ 20వరకు అపరాధరుసుము లేకుండా దరఖాస్తులు స్వీకరించనున్నారు. అపరాధ రుసుములతో చివరి గడువు మే 21గా నిర్ణయించారు. ఇలా ఉండగా ఈసారి పీజీసెట్ పరీక్షను కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలన్న అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. గేట్ తరహా పరీక్షలు దేశవ్యాప్తంగా ఆన్‌లైన్లో నిర్వహిస్తున్నారని, రాష్ట్రంలో కూడా వాటి పరీక్ష కేంద్రాలున్నందున వాటిని వినియోగించుకొని పీజీసెట్ పరీక్షలు నిర్వహించవచ్చని సమావేశంలో సూచనలు వచ్చాయి. అయితే.. దీనిపై అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవడానికి కాకినాడ జెఎన్‌టీయూ వీసీ కుమార్ నేతృత్వంలో మండలి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఏపీ ఎంసెట్ పరీక్ష కేంద్రాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

>
మరిన్ని వార్తలు