ముంచుకొస్తోన్న హెపటైటిస్ సీ ముప్పు

18 Jul, 2016 03:29 IST|Sakshi
ముంచుకొస్తోన్న హెపటైటిస్ సీ ముప్పు

ఏపీ, తెలంగాణలో వైరస్ బారిన పడుతున్న కిడ్నీ రోగులు
- రక్తశుద్ధి సెంటర్ల నిర్వహణ సరిగా లేకే వ్యాధి వ్యాప్తి
 
 సాక్షి, హైదరాబాద్ : ఉభయ తెలుగు రాష్ట్రాలకు హెపటైటిస్ సీ ముప్పు ముంచుకొస్తోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా రక్తమార్పిడి (బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్), సిరంజిలు, శారీరక కలయిక వల్ల ఈ వైరస్ సోకుతుంది. ప్రస్తుతం డయాలసిస్ కేంద్రాల నిర్వహణ లోపం వల్ల రెండు రెట్లు అధికంగా ఈ వైరస్ సోకుతున్నట్టు వైద్యుల పరిశీలనలో వెల్లడైంది. ప్రస్తుతం హెపటైటిస్ బీ వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. హెపటైటిస్ సీ వైరస్‌కు వ్యాక్సిన్ లేదు. తెలంగాణ, ఏపీలో ప్రస్తుతం సుమారు 5 లక్షల మంది మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేయించుకుంటున్నారు.

గడిచిన రెండేళ్లలో వీరిలో సుమారు 70 వేల మందికి హెపటైటిస్ ిసీ సోకినట్టు వైద్య వర్గాలు చెబుతున్నాయి. డయాలసిస్ కేంద్రాల్లో రీ ఏజెంట్స్ (రక్తశుద్ధిలో వాడే పరికరాలు) పదే పదే వాడినవే వాడటం వల్ల ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ సోకుతున్నట్టు తేలింది. రక్తశుద్ధి చేయించుకుంటున్న బాధితుల్లో 8 నుంచి 10 శాతం మందికి హెపటైటిస్ సీ వైరస్ సోకుతున్నట్టు వెల్లడైంది. దీనివల్ల జీవితకాలం దారుణంగా తగ్గిపోతోందని మూత్రపిండాల నిపుణులు చెబుతున్నారు. మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు డయాలసిస్‌కు వె ళ్లేటప్పుడు హెపటైటిస్ సీ వైరస్ టెస్టులు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వైరస్ ఒక్కోసారి లివర్ క్యాన్సర్‌కూ దారితీస్తుందని చెబుతున్నారు.

 హెపటైటిస్ సీ లక్షణాలు..
► కడుపు ఉబ్బినట్లు.. ఆకలి సరిగా ఉండకపోవడం
► కాలేయం పాడై.. శారీరకంగా బలహీనమవ్వడం
► ఒళ్లంతా దురదలు, అప్పుడప్పుడు తలనొప్పి
► నెమ్మదిగా కాలేయం పాడైపోయి వాంతులు కావడం
 
 ఎక్కువగా డయాలసిస్ బాధితుల్లోనే..
 డయాలసిస్ బాధితుల్లో ఎక్కువ మంది హెపటైటిస్ సీ పాజిటివ్ వారున్నారు. దీనికి వ్యాక్సిన్ కూడా లేదు. ఇలాంటి వారికి కిడ్నీ మార్పిడి చేయాలన్నా వైద్యులుగా మేము కూడా భయపడాల్సిన పరిస్థితి ఉంది. పీసీఆర్ టెస్టు విధిగా చేయాలి. డయాలసిస్ నిర్వహణ మెరుగ్గా ఉంటేనే ఈ వైరస్ వ్యాప్తిని అదుపు చేయగలం.     -డాక్టర్ జె.రంగనాథ్, మాక్స్‌క్యూర్ ఆస్పత్రి

మరిన్ని వార్తలు