'అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి'

27 Jul, 2016 16:46 IST|Sakshi
'అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి'

హైదరాబాద్: అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి, కృష్ణానదీ యాజమాన్యం బోర్డు పరిధిపై నోటిఫికేషన్ జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం రఘువీరా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. ఎగువన ఉన్న తెలంగాణ రాష్ట్రం నీటి కేటాయింపులు, అనుమతులు లేకుండా శ్రీశైలం రిజర్వాయరు నుంచి 120 టిఎంసీల కృష్ణాజలాలను తరలించుకుపోయే విధంగా పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్మిస్తోందని తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే ఏపీలో 48 లక్షల ఎకరాల సాగుభూమి నీరు అందక బీడు భూమిగా మారిపోయే ప్రమాదముందని లేఖలో పేర్కొన్నారు.

దీని ఫలితంగా 2 కోట్ల మంది ప్రజలకు త్రాగునీటి కొరత, జల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతుందని చెప్పారు. దాంతో ఏపీ థార్ ఎడారిలా మారిపోతుందని అన్నారు. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ రాష్ట్రం గానీ, ఏపీ గానీ కొత్త ప్రాజెక్టులు నిర్మించాలంటే నదీ యాజమాన్యం బోర్డుల సిఫారసు, కేంద్ర జలవనరుల కమీషన్ సిఫారసు, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి అని అన్నారు.  దీనికి సంబంధించి విభజన చట్టం, సెక్షన్ 84, సబ్ సెక్షన్ (3) లో స్పష్టంగా ఉందని రఘువీరా లేఖలో తెలిపారు.

మరిన్ని వార్తలు