ఇళ్ల దరఖాస్తులు తీసుకోం...

3 Jan, 2016 12:20 IST|Sakshi

కలెక్టరేట్‌లో ప్రకటన కరపత్రాలు
 
హైదరాబాద్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే‘మీకోసం’ కార్యక్రమంలో ఇళ్ల దరఖాస్తులు తీసుకోబోమని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ గోడలపై ప్రకటన కరపత్రాలు అంటించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తులతో వందలాది మంది మహిళలు కలెక్టరేట్‌కు తరలి వస్తున్నారు. దీంతో తొక్కిసలాట జరిగి మహిళలు సొమ్మసిల్లడం, చంటి పిల్లల తల్లులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో అధికారులు హైరానా పడటం, పోలీసులు బందోబస్తు నిర్వహించటం, సహా యక కార్యక్రమాలకు సంబంధించిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. పరిస్థితిని గమనించిన అధికారవర్గాలు జిల్లా కలెక్టర్, గృహ నిర్మాణ శాఖ పేరుతో కలెక్టరేట్ గోడలపై‘ ఇళ్ల దరఖాస్తులు తీసుకొనబడవు’ పేరుతో ప్రకటన నోటీసులు అంటించారు.

అదేవిధంగా కలెక్టరేట్‌కు వచ్చే మహిళలకు కూడా ఈ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. కొందరు దళారులు రూ.10  ఇళ్ల దరఖాస్తులు విక్రయించడంతోపాటు, ఇళ్లు ఇప్పిస్తామని మాయ మాటలు చెబుతున్నారని, వారి మాటలు నమ్మవద్దని అధికారులు పేర్కొంటున్నారు. నియోజకవర్గానికి 400 చొప్పున ఇళ్లు మంజూరు కాగా, నిర్మించే బస్తీలను గుర్తించినట్లు వివరిస్తున్నారు. అర్హులైన నిరుపేదలకు డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు మంజూరవుతాయని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు