ఒంటరి మహిళల ఆర్థిక భృతికి దరఖాస్తులు

8 May, 2017 02:22 IST|Sakshi

నేటి నుంచి ప్రారంభం..13 వరకు దరఖాస్తుల స్వీకరణ

సాక్షి, హైదరాబాద్‌: ‘ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి’ పథకానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. సోమవారం నుంచి ఈనెల 13 వరకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపిక ప్రక్రియకు సంబంధించి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) తాజాగా షెడ్యూల్‌ను, మార్గదర్శకాలను జారీ చేసింది.

లబ్ధిదారుల ఎంపికకు అర్హతలివే..
► ఒంటరి మహిళల ఎంపికకు 18 ఏళ్లు నిండిన వివాహిత మహిళలు భర్త నుంచి ఏడాదికిపైగా వేరుగా ఉంటున్న వారై ఉండాలి.
► అవివాహితులైతే గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్లు, పట్టణ ప్రాంతాల్లో 35 ఏళ్ల వయస్సు నిండిన వారై ఉండాలి.
► దారిద్య్రరేఖకు దిగువన ఉండి, వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు.
► ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సామాజిక భద్రత పథకాలు, పింఛన్ల లబ్ధిదారులై ఉండరాదు.
►దరఖాస్తుకు జత చేయాల్సిన పత్రాలు తహసీల్దార్, సంబంధిత మున్సిపల్‌ కార్యాలయాల్లో నేరుగా దరఖాస్తులు సమర్పించవచ్చు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని వారు మీసేవ, ఈ సేవ కేంద్రాల్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను సమర్పించేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదు. దరఖాస్తుతోపాటు వయస్సు నిర్ధారణ కోసం ఆధార్‌ కార్డు, ఎన్నికల గుర్తింపు కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, స్కూల్‌ టీసీలలో ఏదో ఒక జిరాక్స్‌ ప్రతిని జతపరచాలి.

మరిన్ని వార్తలు