21 రోజుల్లో గృహ నిర్మాణాల అనుమతి

13 Feb, 2018 02:53 IST|Sakshi

దరఖాస్తుల్లో లోపాలను వారంలో తెలపండి

జాప్యం చేస్తే జరిమానాలు విధిస్తాం

టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల సమావేశంలో మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రావిర్భావం తర్వాత ప్రజలు ప్రభుత్వం నుంచి సరికొత్త పాలన ఆశించారని, ఆ దిశగా అనేక పాలనా సంస్కరణలతో ముందుకు పోతున్నామని పురపాలక మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పురపాలక శాఖలో ఏకీకృత సర్వీస్‌ నిబంధనలు తెచ్చామని, ప్రజలకు సత్వర సేవలందించడానికి డీపీఎంఎస్‌ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. జీహెచ్‌ఎంసీతో పాటు రాష్ట్రంలోని ఇతర పురపాలికల్లో పనిచేస్తున్న టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బందితో మంత్రి కేటీఆర్‌ సోమవారం ఇక్కడ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ భవన నిర్మాణ అనుమతుల జారీ గడువును ఇటీవ 30 రోజుల నుంచి 21 రోజులకు కుదించామని, ఈ మేరకు సత్వరంగా అనుమతులు జారీ చేయాలని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను ఆదేశించారు. గడువులోగా అనుమతులు జారీ చేయకపోతే బాధ్యులపై జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. భవన నిర్మాణ అనుమతులకు దరఖాస్తు చేసుకున్న వారం రోజుల లోపు అందులో ఉన్న లోపాలను దరఖాస్తుదారులకు రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు. అనుమతుల ప్రక్రియలో అనవసర జాప్యాన్ని నివారించేందుకు ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు.  

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులనుసత్వరమే పరిష్కరించండి
ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించాలని కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. డీపీఎంఎస్‌ విధానం పట్ల పూర్తి అవగాహన పెంచుకోవాలని, సంపూర్ణ పరిజ్జానంతో పనిచేయాలని కోరారు. టౌన్‌ ప్లానింగ్‌ అధికారుల సమస్యల పరిష్కారం పట్ల సానుకూలంగా ఉన్నామన్నారు. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులతో ప్రతి మూడు నెలలకోసారి సమావేశం అవుతామని మంత్రి తెలిపారు. క్రమబద్ధమైన పురపాలనలో టౌన్‌ప్లానింగ్‌ అధికారుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.

నూతనంగా ఎర్పాటైన జిల్లా కేంద్రాల్లో రోడ్ల విస్తరణ, అక్రమ కట్టడాల నిర్మూలన వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. లే అవుట్లలోని ఖాళీ ప్రదేశాలు (ఓపెన్‌ ప్లాట్లు)ను కాపాడటంలో మున్సిపల్‌ కమిషనర్లతో కలసి పనిచేయాలన్నారు. అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు స్థానికంగా ఉన్న టౌన్‌ ప్లానింగ్‌ అధికారులతో పాటు రాష్ట్ర స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలను ప్రతిపాదించాలని పురపాలక శాఖ డైరెక్టర్‌ శ్రీదేవిని, డీటీసీపీ విద్యాధర్‌రావును ఆదేశించారు.

మరిన్ని వార్తలు