ఏప్రిల్ 30లోగానే ఏఐసీటీఈ అనుమతులు

25 Jan, 2016 02:42 IST|Sakshi
ఏప్రిల్ 30లోగానే ఏఐసీటీఈ అనుమతులు

♦ ఆ తరువాత అనుమతులు నో
♦ 2016-17 షెడ్యూల్‌ను జారీ చేసిన ఏఐసీటీఈ
♦ వర్సిటీలు మే 31లోగా అనుబంధ గుర్తింపు ఇవ్వాలి
♦ జూన్ 30లోగా మొదటిదశ ప్రవేశాలు పూర్తి చేయాల్సిందే
♦ ఆగస్టు 1 నుంచి ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ తరగతులు
♦ పక్కాగా అమలు చేయాలని ఆదేశాలు
 
 సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ వంటి మేనేజ్‌మెంట్ కోర్సులకు ఏప్రిల్ 30లోగా అనుమతులు ఇస్తామని, ఆ తరువాత ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇచ్చేది లేదని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కరాఖండిగా చెప్పింది. వివిధ రాష్ట్రాల్లో యూనివర్సిటీలు కూడా అనుబంధ గుర్తింపు ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లో మే 31లోగా పూర్తి చేయాల్సిందేనని, ఆ తరువాత ఒక్క కాలేజీకి కూడా అనుబంధ గుర్తింపు ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేసింది. 2016-17 విద్యా సంవత్సరం కోసం కాలేజీలకు అనుమతులు, అనుబంధ గుర్తింపు, ప్రవేశాల కౌన్సెలింగ్, తరగతుల ప్రారంభం తదితర వివరాలతో కూడిన షెడ్యూల్‌ను ఏఐసీటీఈ ప్రకటించింది. కొత్త కాలేజీల అనుమతులకు సంబంధించి 2016-17  ప్రొసీజర్ హ్యాండ్ బుక్ విడుదల చేసింది. వీటిని అమలు చేయాలని ఆదేశించింది.

 ఏఐసీటీఈ షెడ్యూల్ ఇలా...
► కొత్త కాలేజీలకు అనుమతులు, అదనపు సీట్ల పెంపు, సీట్ల రద్దు, కోర్సుల రద్దు, కాలేజీల మూసివేత వంటి అన్నింటికీ వచ్చే నెల 21లోగా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
► వాటన్నింటికి తాము ఏప్రిల్ 10లోగా అనుమతులిస్తాం.. ఒకవేళ ఆలస్యమైనా గరిష్టంగా ఏప్రిల్ 30లోగా పూర్తి చేస్తాం.
► ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్, ఎంసీఏ, ఫార్మసీ, ఎంబీఏ వంటి మేనేజ్‌మెంట్ కోర్సుల అండర్ గ్రాడ్యుయేషన్ (యూజీ), పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ), డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు అన్ని రాష్ట్రాల్లో జూన్ 30లోగా మొదటిదశ ప్రవేశాల కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపును పూర్తి చేయాలి.
► రెండో దశ ప్రవేశాల కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపును జూలై 10లోగా, చివరి దశ ప్రవేశాలను జూలై 20 లోగా పూర్తి చేయాలి.
► ఆగస్టు 1 నుంచి తరగతులను ప్రారంభించాలి.
► యూజీ, పీజీ కోర్సుల్లో సెమిస్టర్‌లో 75 రోజులపాటు రోజుకు 7 గంటల చొప్పున 525 గంటల పాటు బోధన, ప్రాక్టికల్స్ నిర్వహించాలి.
► వీటికి అదనంగా మరో 15 రోజులు పరీక్షల ప్రిపరేషన్, నిర్వహణకు కేటాయించాలి. మొత్తంగా 90 రోజులు ఉండాలి.
► ఫస్టియర్‌లో మొదటి సెమిస్టర్‌ను ఆగస్టు 1 నుంచి నవంబరు 30 వరకు, రెండో సెమిస్టర్ జనవరి 1 నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహించాలి.
► ద్వితీయ, తృతీయ, నాలుగో సంవత్సరం విద్యార్థులకు జూలై 15న మొదటి సెమిస్టర్‌ను ప్రారంభించి, నవంబరు 15 నాటికి పూర్తి చేయాలి. రెండో సెమిస్టర్‌ను డిసెంబరు 15న ప్రారంభించి ఏప్రిల్ 15లోగా పూర్తి చేయాలి.

>
మరిన్ని వార్తలు