అత్యాచారయత్నం చేసింది కానిస్టేబులే!

3 Mar, 2017 13:06 IST|Sakshi
అత్యాచారయత్నం చేసింది కానిస్టేబులే!
కారులో విజయవాడ తీసుకెళ్తామని నమ్మించి, దారిలో కారులోనే ఆమెపై అత్యాచారయత్నం చేసిన నిందితులలో ఒకరిని ఏఆర్ కానిస్టేబుల్‌గా గుర్తించారు. నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో ఎల్బీనగర్ సమీపంలో నిల్చుని.. విజయవాడ వైపు వెళ్లేందుకు ఎదురుచూస్తున్న  హెయిర్ స్టైలిస్ట్‌ను మహేష్ అనే ఏఆర్ కానిస్టేబుల్‌తో పాటు నికొలస్ అనే మరో వ్యక్తి ఆమెను కారులోకి ఎక్కించుకున్నారు. విజయవాడలో దింపుతామని ఆమెను నమ్మబలికారు. కొద్ది దూరం వెళ్లాక ఆమెపై అత్యాచారయత్నం చేశారు. కారు టోల్‌గేట్‌ వద్దకు చేరుకోగానే యువతి అందులో నుంచి దూకి రక్షించమని కేకలు వేసింది. ఇది గుర్తించిన టోల్‌గేట్‌ సిబ్బంది యువతిని రక్షించి నిందితులను పోలీసులకు అప్పగించారు. 
 
తమకు ముందుగా క్యాబ్ నెంబర్ దొరికిందని, దానిపై ఎల్బీనగర్ డీసీపీ బృందం, ఎస్‌ఓటీ బృందం కలిసి విచారణ మొదలుపెట్టారని సీపీ మహేష్‌ భగవత్ చెప్పారు. ఆ యువతి విజయవాడ వెళ్లేందుకు ఎల్బీనగర్‌ లో క్యాబ్‌ ఎక్కిందని, చౌటుప్పల్‌ దాటాక ఆమె పట్ల డ్రైవర్లు అసభ్యంగా ప్రవర్తించారన్నారు. వెంటనే యువతి డయల్‌ 100కు సమాచారం ఇచ్చిందని తెలిపారు. ఆ నెంబరుతో ఉన్న క్యాబ్‌లు రెండింటిలో ఒకటి నిజామాబాద్‌లో, మరోటి మౌలాలిలో ట్రేస్ అయ్యాయని, తక్కువ సమయంలోనే కారు ఆచూకీ తెలుసుకున్నామని వివరించారు.
 
అంత అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా విజయవాడకు, అది కూడా ప్రైవేటు క్యాబ్‌లో ఎందుకు వెళ్లాలనుకున్నారని ఆ మహిళను ప్రశ్నించగా, తనకు అది అలవాటేనని జవాబిచ్చారన్నారు. మహిళలు ఎవరూ ఇలా ఒంటరిగా వెళ్లొద్దని, వీలైనంత వరకు ఆర్టీసీ లేదా ప్రైవేటు బస్సులలో వెళ్లాలని, తప్పనిసరిగా కారులో వెళ్లాల్సి వస్తే.. తమవద్ద 'సేఫ్ క్యాబ్' అని రిజిస్టర్ అయి ఉన్న క్యాబ్‌లలోనే వెళ్లాలని ఆయన సూచించారు. అవైతే సురక్షితంగా తీసుకెళ్తాయని చెప్పారు.
మరిన్ని వార్తలు