సిరిసిల్ల వెళ్తామంటే కేసీఆర్‌కు భయమెందుకు?

30 Jul, 2017 03:23 IST|Sakshi
సిరిసిల్ల వెళ్తామంటే కేసీఆర్‌కు భయమెందుకు?

ప్రభుత్వం అనుమతించకున్నా వెళ్లితీరతాం: ఉత్తమ్‌
బాధిత కుటుంబాలను పరామర్శిస్తామని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: తాము సిరిసిల్లకు వెళ్తామంటే కేసీఆర్‌ ఎందుకు భయపడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ఇసుక మాఫియాలో ఉన్న సీఎం బంధువుల కోసం సిరిసిల్లలో దళితులపై పోలీసులు దాడులు చేశారని  ఆరోపించారు. పీఏసీ చైర్‌పర్సన్‌ గీతారెడ్డి, మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, మధు యాష్కీగౌడ్‌తో కలసి శనివారం గాంధీభవన్‌లో ఉత్తమ్‌ మాట్లాడా రు. సిరిసిల్లలో దళితులపై దాడులు జరగకుంటే, తప్పేమీ జరగకుంటే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ భయపడాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు.

సిరిసిల్లలో దళితులను పోలీసు కస్టడీలోకి తీసుకుని నాలుగు రోజుల పాటు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు.అన్యాయానికి గురైన దళితుల  పక్షాన ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతున్నామని చెప్పా రు. ఇసుకు మాఫియాకు ప్రభుత్వం అండగా ఉందని ఆరోపించారు. నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న లారీల కిందపడి భూమయ్య చనిపో యాడని, ఆ ఆవేదనతోనే పోరాడిన వారిపై పోలీసు లు విచక్షణ రహితంగా దాడులకు పాల్పడటం అన్యాయమని పేర్కొన్నారు. ఇసుక మాఫియాలో సీఎం కేసీఆర్‌ దగ్గరి బంధువు సంతోష్‌రావుకు ప్రత్యక్ష సంబంధం ఉందని, ఇది నిజమో కాదో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ చెప్పాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు. 

సీఎం నోరు మెదపరేం?
దళితులకు, గిరిజనులకు అన్యాయం జరిగితే సీఎం ఎందుకు నోరు మెదపట్లేదని ఉత్తమ్‌ ప్రశ్నించారు. పోలీసు కస్టడీలో గాయపడ్డ వారికి, ఇసుక లారీల కిందపడి చనిపోయిన కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించాలని కాంగ్రెస్‌ చూస్తుంటే.. ప్రభుత్వం, పోలీసులు అనుమతి నిరాకరించడం సరికాదన్నారు. సిరిసిల్లలోని కాలేజీ మైదానంలో గతంలో ఇందిరాగాంధీ, ఎన్టీఆర్, వైఎస్సార్, సీఎం కేసీఆర్‌ కూడా సభలు పెట్టారని గుర్తుచేశారు. కుంటి సాకులతో అనుమతులను నిరాకరించడం సరి కాదని, అనుమతి కోసం కోర్టుకు వెళ్లామని, కోర్టు నుంచి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కలిగించినా సిరిసిల్లకు వెళ్లితీరతామని స్పష్టం చేశారు. లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ వచ్చి, దళితులను పరామర్శించి ఆర్థిక సాయం అందిస్తారని తేల్చి చెప్పారు.

క్రూరంగా వ్యవహరిస్తోంది: గీతారెడ్డి
సిరిసిల్ల భారతదేశంలో భాగమేనా అనే అనుమానం కలిగేలా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అత్యంత క్రూరంగా, నియంతృత్వంతో వ్యవ హరిస్తోందని గీతారెడ్డి అన్నారు. తెలంగాణ కోసం అగ్రభాగాన నిలిచిన దళితులపై చిత్రహింసలు, దాడులు రాష్ట్ర చరిత్రలో మాయని మచ్చని దుయ్యబట్టారు. మంత్రి వర్గంలో దళితుడైన రాజయ్యను నిర్ధాక్షి ణ్యంగా తొలగించి దళిత వ్యతిరేకతను కేసీఆర్‌ చాటుకున్నారన్నారు. ఎందరిని అరెస్టు చేసినా, ఎంతమంది కాంగ్రెస్‌ నేతల ను కొట్టినా సిరిసిల్ల పర్యటన ఆగబోదని స్పష్టం చేశారు. సిరిసిల్ల ఎస్పీని, పోలీసులను సస్పెండ్‌ చేసి, వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని వి.హనుమంతరావు డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు