‘ఆరోగ్యలక్ష్మి’ అంతంతే!

16 Sep, 2017 02:59 IST|Sakshi
‘ఆరోగ్యలక్ష్మి’ అంతంతే!
భారీగా తగ్గిన లబ్ధిదారులు
  •   ఆగస్టులో పౌష్టికాహారం తీసుకుంది 20 శాతమే
  •   గర్భిణులు 20.17 శాతం, పాలిచ్చే తల్లులు 18.69 శాతం హాజరు
  •   గాడి తప్పిన అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ
సాక్షి, హైదరాబాద్‌: గర్భిణులు, పాలిచ్చే తల్లులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు తలపెట్టిన ‘ఆరోగ్యలక్ష్మి’ పథకం లబ్ధిదారులకు రుచించడం లేదు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహకుల ఉదాసీనత... దానికి తోడు స్పాట్‌ ఫీడింగ్‌ నిబంధన విధించడంతో లబ్ధిదారుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత నెలలో ఆరోగ్యలక్ష్మి పథకం కింద పౌష్టికాహారాన్ని తీసుకున్న లబ్ధిదారులు కేవలం 20 శాతమే. నెలవారీ నివేదికల్లో లబ్ధిదారుల సంఖ్య పతనమవుతుండటం ఆధికారవర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్‌వాడీ కేంద్రాలుండగా.. ఇందులో 31,711 ప్రధాన అంగన్‌వాడీలు, 3,989 మినీ అంగన్‌వాడీలున్నాయి. వీటి పరిధిలో 5,12,374 మంది గర్భిణులు, పాలిచ్చే తల్లులు నమోదయ్యారు. వీరికి ఆరోగ్యలక్ష్మి పథకం కింద ప్రతిరోజూ పాలు, ఉడికించిన కోడిగుడ్డు, 150 గ్రాముల బియ్యం, 30 గ్రాముల పప్పు తదితరాలతో కూడిన పౌష్టికాహారాన్ని అందించాలి. వారంలో ఒక రోజు 200 మిల్లీలీటర్ల పెరుగు, కోడిగుడ్డు కూరని పంపిణీ చేయాలి. ప్రతి రోజూ లబ్ధిదారులు అంగన్‌వాడీ కేంద్రానికి హాజరై పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. 
 
20 శాతం దాటని పంపిణీ.. 
ఆరోగ్యలక్ష్మి లబ్ధిదారుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. స్పాట్‌ఫీడింగ్‌ (అంగన్‌వాడీ కేంద్రంలో తప్పనిసరి హాజరు) నిబంధనను ఆ శాఖ కట్టుదిట్టం చేసింది. మరోవైపు అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ గాడితప్పింది. కొన్నిచోట్ల మధ్యాహ్నం వరకు కేంద్రాలను తెరవడం లేదు. మరికొన్ని కేంద్రాల్లో పౌష్టికాహార పంపిణీలో జాప్యం జరుగుతున్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల హాజరుపై తీవ్ర ప్రభావంపడుతోంది. ఫలితంగా లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఆగస్టు గణాంకాలను పరిశీలిస్తే... రాష్ట్రవ్యాప్తంగా 2,88,634 మంది గర్భిణులకుగాను కేవలం 58,229 మంది హాజరయ్యారు. 2,23,700 మంది పాలిచ్చే తల్లులకుగాను కేవలం 41,815 మంది హాజరయ్యారు. గర్భిణులు 20.17 శాతం, పాలిచ్చే తల్లులు 18.69 శాతం హాజరయ్యారు. ఈ క్రమంలో లబ్ధిదారుల సంఖ్య తగ్గుదలపై కారణాలను అధికారవర్గాలు అన్వేశిస్తున్నాయి.
మరిన్ని వార్తలు