బకాయిలు.. రూ.30 వేల కోట్లు

5 Jan, 2018 01:30 IST|Sakshi

ప్రభుత్వ పథకాల అమలుపై తీవ్ర ప్రభావం

అన్ని శాఖల్లో ఆగిన బిల్లులు

ప్రాధాన్య కార్యక్రమాలకు నిధుల కొరత

సర్దుబాటుకు తిప్పలు పడుతున్న ఆర్థిక శాఖ  

జీఎస్టీ ప్రభావం, కేంద్ర నిధులు నిలిచిపోవడం ప్రధాన కారణం

సాక్షి, హైదరాబాద్‌: భారీగా బడ్జెట్‌ అంచనాలు వేసుకోవటం.. ఆచరణలో అంత స్థాయిలో ఆదాయం రాకపోవటంతో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పెండింగ్‌ బిల్లులు పేరుకుపోయాయి. అన్ని శాఖల్లో ఇప్పటికే దాదాపు రూ.30 వేల కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు లెక్కతేలుతోంది. దీంతో ప్రాధాన్య క్రమంలో నిధులను సర్దుబాటు చేసేందుకు ఆర్థిక శాఖ తిప్పలు పడుతోంది.

ఈ ఆర్థిక సంవత్సరంలో మరో మూడు నెలలు మిగిలి ఉండగానే... డిసెంబర్‌ నుంచే నిధుల సమీకరణకు తంటాలు పడుతోంది. గత నెలలో ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు చెల్లింపులు ఆలస్యమవటంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆసరా పింఛన్ల పంపిణీ దాదాపు రెండు వారాల పాటు వాయిదా పడింది. ప్రధానంగా బడ్జెట్‌లో అంచనా వేసుకున్న స్థాయిలో రెవెన్యూ రాబడి లేకపోవటం, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు మూడు నెలలుగా ఆగిపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు స్పష్టమవుతోంది.  

దెబ్బతీసిన జీఎస్టీ!  
జూలై నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ ప్రభావం కూడా రాష్ట్ర ఖజానాను అతలాకుతలం చేసింది. జీఎస్టీతో వచ్చే ఆదాయంపై స్పష్టత లేకపోవటంతో వివిధ పథకాలు, కార్యక్రమాలకు నిధుల కేటాయింపులోనూ గందరగోళమే కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న సాగునీటి రంగానికి సైతం సరిపడేన్ని నిధులను అందించలేకపోయింది. అత్యధికంగా ప్రాజెక్టులకు రూ.25 వేల కోట్లు కేటాయించాలని ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది.

అదే దిశగా కాళేశ్వరంతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టుల పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే రూ.13 వేల కోట్లకుపైగా విలువైన పనులు పూర్తయ్యాయి. ఇందులో రూ.5,657 కోట్ల బిల్లులు ప్రస్తుతం పెండింగ్‌లోనే ఉన్నాయి. అన్ని శాఖల్లోనూ ఇంచుమించుగా ఇదే పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. నీటిపారుదల రంగం తర్వాత అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న పరిశ్రమలపైనా ఇదేరకమైన ప్రభావం కనిపిస్తోంది. వివిధ పరిశ్రమలకు అందించాల్సిన ప్రోత్సాహకాలను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది.

మూడేళ్లుగా దాదాపు రూ.2 వేల కోట్లకుపైగా ప్రోత్సాహకాలను చెల్లించలేదు. అదే తరహాలో అన్ని శాఖల్లోనూ నిధుల విడుదల అసంపూర్తిగానే సాగుతోంది. ఇదిలా ఉండగా రైతు రుణమాఫీ పథకానికి సంబంధించి చివరి విడత రూ.4 వేల కోట్లను ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం మొదట్లోనే విడుదల చేసింది. ఇంత పెద్ద మొత్తంలో నిధులను ముందే చెల్లించటంతో ఆ మేరకు మిగతా కార్యక్రమాలపై దాని ప్రభావం పడినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోని డిస్కంలను ఉదయ్‌ పథకం పరిధిలోకి తెచ్చి రుణాల నుంచి విముక్తులను చేసేందుకు కంకణం కట్టుకుంది. ఈ పథకంలో చేరినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు రూ.12 వేల కోట్ల బకాయి పడింది.


వివిధ పథకాలు, కార్యక్రమాల వారీగా బకాయిలు
సాగునీటి ప్రాజెక్టులు             రూ.5,657 కోట్లు
డిస్కంలు                           రూ.12,000 కోట్లు
జెన్‌కో, ట్రాన్స్‌కో                   రూ. 3,400 కోట్లు
పౌరసరఫరాల శాఖ              రూ. 3,000 కోట్లు
ఫీజు రీయింబర్స్‌మెంట్‌          రూ. 2,000 కోట్లు
పరిశ్రమలకు రాయితీలు        రూ. 2,000 కోట్లు
వడ్డీ లేని రుణాలు                రూ. 800 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణ,
పాలీ హౌజ్‌లు                     రూ. 600 కోట్లు
ఆరోగ్య శ్రీ                           రూ.400 కోట్లు
స్థానిక సంస్థలు                   రూ.700 కోట్లు  
మొత్తం                             రూ.30,557 కోట్లు  

మరిన్ని వార్తలు