68వ బ్యాచ్ ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్

28 Oct, 2016 09:47 IST|Sakshi

హైదరాబాద్ : హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 68వ బ్యాచ్ ట్రైనీ ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్ శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ హాజరయ్యారు. ఐపీఎస్ అధికారులు దిక్షాంత్ పరేడ్ నిర్వహించారు. ఈ బ్యాచ్లో మొత్తం 109 మంది ట్రైనీ ఐపీఎస్లు ఈ పరేడ్లో పాల్గొన్నారు.

ఈ బ్యాచ్‌లో మరో 15 మంది విదేశీ అధికారులు సైతం శిక్షణ పొందారు. అందులో భూటాన్ నుంచి ఆరుగురు, నేపాల్ నుంచి ఐదుగురు, మాల్దీవుల నుంచి నలుగురు ఉన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న 109 మంది ఐపీఎస్ శిక్షణార్థుల్లో 75 మంది ఇంజనీరింగ్, వైద్య విద్యను చదివిన వారే ఉన్నారు. పది మంది ఆర్ట్స్, తొమ్మిది మంది సైన్స్, ఇద్దరు కామర్స్ నేపథ్యం నుంచి రాగా, 66 మంది ఇంజనీర్లు, తొమ్మిది మంది ఎంబీబీఎస్, తొమ్మిది మంది ఎంబీఏ, ముగ్గురు లా, ఒకరు ఎంఫిల్ చేశారు.

కాగా నేషనల్ పోలీస్ అకాడమీలో 2015 బ్యాచ్ అధికారులుగా శిక్షణ ముగించుకున్న 109 మంది ట్రైనీ ఐపీఎస్‌ల్లో  ఏడుగురిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. వారిలో తెలంగాణకు రక్షిత కె.మూర్తి(కర్ణాటక), పాటిల్ సంగ్రామ్‌సింగ్ గణపత్‌రావు(మహారాష్ట్ర), చేతన మైలబత్తుల(తెలంగాణ).. ఏపీకి కె.ఆరీఫ్ హఫీజ్(కర్ణాటక), అజిత వేజెండ్ల (ఏపీ), గౌతమి సలి(ఏపీ), బరుణ్ పురకయత్స(అసోం) ట్రైనీ ఐపీఎస్‌లుగా రానున్నారు.

>
మరిన్ని వార్తలు