విచారణలకు తప్పనిసరిగా హాజరవ్వాల్సిందే

25 Jun, 2016 03:29 IST|Sakshi
విచారణలకు తప్పనిసరిగా హాజరవ్వాల్సిందే

సాక్షి, హైదరాబాద్: న్యాయాధికారుల ప్రాథమిక కేటాయింపుల జాబితా విషయంలో కొద్ది రోజులుగా తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్న న్యాయవాదులను కట్టడి చేసే దిశగా స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు ప్రారంభించింది. కోర్టుల విధులకు ఆటంకం కలగకుండా కార్యకలాపాలు సజావుగా సాగిపోయేందుకు వీలుగా పలు చర్యలు చేపట్టింది. ఈ దిశగా జిల్లా కలెక్టర్లకు, పోలీస్ కమిషనర్లకు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ న్యాయవాదులు మొదలుకుని ఆందోళనలు చేస్తున్న లాయర్లకు సహాయ సహకారాలు అందకుండా చేసేందుకు అడ్వకేట్ జనరల్‌కు కూడా స్పష్టమైన సూచనలు చేసింది.

కోర్టుల్లో కేసుల విచారణకు విధిగా హాజరువాల్సిందేనని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు, ప్రభుత్వ న్యాయవాదులు, సహాయ ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్స్ కౌన్సిల్స్ అందరికీ తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ రెండు రోజుల క్రితం ఓ మెమో జారీ చేశారు. దానిపై తక్షణమే స్పందించిన ఏజీ, ఈ విషయాన్ని హైకోర్టులోని ప్రభుత్వ న్యాయవాదులందరికీ రాతపూర్వకంగా తెలియచేశారు. కింది కోర్టుల్లో విధులు నిర్వర్తిస్తున్న న్యాయాధికారులందరికీ అవసరమైతే సాయుధ రక్షణ కల్పించైనా కోర్టు కార్యకలాపాలు యథావిధిగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆ మెమోలో పోలీసులకు స్పష్టం చేసింది. విచారణ జాబితాలో పేరున్న లాయర్లనే కోర్టుల్లోకి అనుమతించేలా చూడాలంది. ‘‘కోర్టుల ప్రాంగణంలో, కోర్టు హాళ్లలో ఊరేగింపుల వంటివి చేసిన, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తాం.

తోటి న్యాయవాదులు వాదనలు విన్పించకుండా అడ్డుకునే, కోర్టు హాళ్లలో, ప్రాంగణాల్లో డ్రమ్ములు వాయించే, నినాదాలు చేసేవారిపై కఠిన చర్యలు తప్పవు’’ అని హెచ్చరించింది. అవసరమైన ప్రతి చోటా వీడియో, వాయిస్ రికార్డింగ్ చేయాలని, కెమెరాలూ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనిస్తుండాలని కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లను ఆదేశించింది. దీనిపై పోలీసులకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు, ఆదేశాలిస్తూ ఉండాలని డీజీపీకి స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను తూచా తప్పకుండా అమలు చేయాలంది. తీసుకున్న చర్యలన్నింటిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆందోళనకారుల కట్టడికి నిన్నటిదాకా హైకోర్టే పాలనాపరంగా పలు చర్యలు తీసుకోగా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే దిశగా రంగంలోకి దిగి ఇలా ఆదేశాలు జారీ చేయడం విశేషం. ప్రభుత్వం జారీ చేసిన ఈ మెమో ఇప్పుడు న్యాయవాద వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
 రిజిస్ట్రార్ జనరల్ లేఖతో కదిలిన ప్రభుత్వం
 లాయర్లు ఈ నెల 6 నుంచి అన్ని జిల్లాల్లోని కోర్టుల్లో విధుల బహిష్కరణ చేపట్టడం తెలిసిందే. ఈ నెల 13న హైకోర్టు విధుల బహిష్కరణ కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా లాయర్లు గతంలో ఎన్నడూ లేని రీతిలో వ్యవహరించడాన్ని, ముఖ్యంగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా నినాదాలు, ఆయన చాంబర్ ముందు బైఠాయించడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. హైకోర్టుతో సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో నెలకొన్న పరిస్థితులను, కక్షిదారుల ఇబ్బం దులను వివరిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఈ నెల 16న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. లాయర్లకు సమ్మె చేసే హక్కు లేదని, విధులను అడ్డుకోవడానికి కూడా వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని సీఎస్‌కు గుర్తు చేశారు.‘‘లాయర్లు దూకుడుగా వ్యవహరిస్తూ, గేట్లకు, కోర్టు హాళ్లకు తాళాలు వేస్తున్నారు. పలువురు న్యాయాధికారులను, ముఖ్యంగా మహిళా న్యాయాధికారులను తీవ్ర పదజాలంతో దుర్భాషలాడుతున్నారు. కక్షిదారులనూ విడిచిపెట్టడం లేదు’’ అని వివరించారు. ఈ లేఖ తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం ఆందోళనకారుల కట్టడికి చర్యలు ప్రారంభించింది.

మరిన్ని వార్తలు