ఆత్మగౌరవమే అటా నినాదం

15 Aug, 2015 00:09 IST|Sakshi
ఆత్మగౌరవమే అటా నినాదం

సిటీబ్యూరో: తెలుగువారి ఆత్మగౌరవ పరిరక్షణ, అన్ని రంగాల్లో వారి అభ్యున్నతే లక్ష్యంగా అమెరికా తెలుగు అసోసియేషన్ పాతికేళ్ల క్రితం పురుడు పోసుకుందని అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు ఏసీరెడ్డి కరుణాకర్‌రెడ్డి తెలిపారు. పాతికేళ్ల ప్రస్థానంలో అటా తెలుగుభాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం కృషిచేస్తోందని, వివిధ రంగాల్లో ప్రతిభగల కళాకారులకు చేయూతనందిస్తోందని తెలిపారు. జూలై 1, 2016 నుంచి అటా రజతోత్సవాలను అమెరికాలోని చికాగోలో వైభవంగా నిర్వహించనున్నట్టు చెప్పారు. నగర పర్యటనలో ఉన్న ఆయన ‘సాక్షి’ ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన మనోగతం ఇదిగో..

 రజతోత్సవాలకు సన్నాహాలు..
 అమెరికాలో ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేసుకున్న సంస్థ అమెరికా తెలుగు అసోషియేషన్(అటా). ఇది ప్రత్యేక పరిస్థితుల్లో తెలుగువారి ఆత్మగౌరవ రక్షణ కోసం 1991లో ఏర్పడింది. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవాలు నిర్వహిస్తున్నాం. 2016 జూలై 1 నుంచి ప్రారంభమై జూలై 3 వరకు చికాగో నగరంలో ఉత్సవాలు జరగనున్నాయి. వీటిని పురస్కరించుకొని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నాం.అటా ఆవిర్భావం నుంచి నేటి వరకు ప్రతి రెండేళ్లకో మారు చొప్పున ఇప్పటి వరకు 11 సభలు జరుపుకుంది. వచ్చే ఏడాది జూలైలో జరిగే సభ 12వది.  ఈ సందర్భంగా ‘అమెరికా భారతి’ పేరుతో ప్రత్యేక సంచికను విడుదల చేస్తున్నాం. ఇందులో తెలుగు భాష, సంస్కృతి, వారసత్వం, సాహిత్యం, సంప్రదాయాలు, విభిన్న రంగాల్లో లబ్దప్రతిష్టుల ఇంటర్వ్యూలు, మనోగతాలను ప్రచురించనున్నాం.

 సేవా కార్యక్రమాలకు 20 బృందాలు..
 ఈ ఏడాది డిసెంబరులో డిసెంబర్ 3 నుంచి 20 వరకు 20 ఎన్‌ఆర్‌ఐ బృందాల సభ్యులు ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. డిసెంబరు 19న ‘సేవ్ గర్ల్ చైల్డ్’ పేరుతో నెక్లెస్ రోడ్డులో 5కే రన్, 20న శిల్పకళావేదికలో సదస్సు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నాం. ఇందులో ఒక్కో విభాగం నుంచి ముగ్గురిని ఎంపిక చేసి వారిని చికాగోలో జరిగే ఉత్సవాలకు తీసుకెళ్తాం. ఆసక్తి గల వారు ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.అటావరల్డ్.ఓఆర్‌జి’ వెబ్‌సైట్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాలి.
 
విద్యార్థుల కోసం ఓ వెబ్‌సైట్
 అమెరికాకు వచ్చే తెలుగు విద్యార్థులకు ప్రత్యేక గెడైన్స్ ఇచ్చేందుకు వెబ్‌సైట్‌ను అటా ప్రారంభించింది. విద్యార్థులెవరైనా ‘ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఎట్‌దిరేట్ అటావరల్డ్.ఓఆర్‌జి వెబ్‌సైట్‌ను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలి. ఆయా అంశాల్లో అవగాహన కోసం డిసెంబరు 20న అమెరికాలోని ప్రతిష్టాత్మక కళాశాలల వివరాలను అందరికీ తెలియజెప్పాలన్న ఉద్దేశంతో రవీంద్ర భారతిలో సదస్సు ఏర్పాటు చేస్తున్నాం.
 

>
మరిన్ని వార్తలు