కమాండో శిక్షణపైనే ఎటాక్!

25 Oct, 2016 04:10 IST|Sakshi
కమాండో శిక్షణపైనే ఎటాక్!

- ట్రైనింగ్ కోసమే పెద్ద సంఖ్యలో ఏఓబీకి చేరిన దళ సభ్యులు, నేతలు
- భారీ దాడుల కోసమే సభ్యులకు కమాండో శిక్షణ
- అందువల్లే ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు లభ్యం
- ఆర్కే సహా కీలక నేతల్ని బతికించిన బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు?
 
 సాక్షి, హైదరాబాద్ : మెరుపు దాడుల ద్వారా భయోత్పాతం సృష్టించేందుకు మావోయిస్టులు కేడర్‌కు కమాండో శిక్షణ ఇస్తున్న నేపథ్యంలోనే ఏఓబీ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆ శిక్షణ కోసమే పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఆ ప్రాంతానికి చేరారని సమాచారం. ఎన్‌కౌంటర్ స్థలంలో భారీ స్థాయిలో వివిధ రకాలైన ఆయుధాలు దొరకడం ఈ అనుమానాలకు బలాన్నిస్తోంది. ఈ శిక్షణపై పక్కా సమాచారం అందుకున్న ఏపీ-ఒడిశాలకు చెందిన ప్రత్యేక పోలీసు బలగాలు వ్యూహాత్మకంగా దాడి చేశాయని తెలిసింది. దీంతో మావోయిస్టు ఉద్యమ చరిత్రలోనే ఒకేసారి 24 మంది మరణించారు.

 భారీ దాడుల కోసమే..
 గతంలో సల్వాజుడుం నేత మహేంద్రకర్మతో పాటు కేంద్ర మంత్రి, పీసీసీ చీఫ్ ప్రయాణించిన కాన్వాయ్‌పై మావోయిస్టులు మందు పాతర ప్రయోగించిన ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ దాడిలో పాల్గొన్న మావోయిస్టు పార్టీ మిలటరీ కంపెనీ సభ్యులతో పాటు పీఎల్‌జీఏ బలగాలు, మిలీషియా సభ్యులు కూడా గెరిల్లా శిక్షణ పొం  దినట్లు పోలీసులు అనుమానించారు. మావోయిస్టు పార్టీ తమకు పెట్టని కోటలైన అబూజ్‌మడ్‌తో పాటు ఏవోబీ లోని కొన్ని ప్రాంతాల్లో కమాండో శిక్షణా కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు గతంలోనే నిఘా వర్గాలు గుర్తించాయి. ప్రస్తు తం భారీ దాడులకు వ్యూహం పన్నుతున్న మావోయిస్టు లు.. అందుకు తగ్గట్టుగానే భారీ సంఖ్యలో కేడర్‌కు కమాం డో శిక్షణ ఇస్తున్నట్లు తెలిసింది. మరోవైపు పారా మిలటరీ బలగాల కూంబింగ్ విస్తృతమవుతున్న దృష్ట్యా ప్రతిదాడుల కోసం మావోయిస్టులు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నారు. మావోయిస్టు పార్టీ మిలటరీ కమిషన్ బాధ్యుడిగా వ్యవహరిస్తున్న నంబాల కేశవరావు ఆధ్వర్యంలో కమాండో శిక్షణ కేంద్రం నడుస్తున్నట్లు భావిస్తున్నారు.

 ఆరు నెలల పాటు: కమాండో శిక్షణ కోసం గుర్తించిన కేడర్‌కు మావోయిస్టు పార్టీ ఆరు నెలలు కఠోర శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ శిక్షణ కేంద్రాన్ని ఆరు నెలలకోసారి మరోచోటికి మారుస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ శిక్షణలో మిలటరీ ఇంటెలిజెన్స్, యాక్షన్ టీమ్ దాడుల వంటి అంశాలను నేర్పుతున్నారు. మెరుపుదాడుల్లో మంచి పేరున్న కేంద్ర యాక్షన్ టీమ్ బాధ్యుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న వంటి వారు కమాండో శిక్షణలో కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. 2009 నుంచి దండకారణ్యంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన శిక్షణలో ఒక్కో బ్యాచ్‌కు 35 మంది చొప్పున శిక్షణ ఇచ్చినట్లు సమాచారం.
 
 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లతో అగ్రనేతలు?

 మావోయిస్టుల యుద్ధ వ్యూహాలు మారుతుండడం, పోలీసు బలగాలపై హోరాహోరీ దాడులకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో అగ్రనేతలు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు సమకూర్చుకుంటున్నట్లు తెలిసింది. కొందరు కీలక వ్యక్తుల అరెస్టు సందర్భంగా వారి నుంచి స్వాధీనం చేసుకున్న రహస్య డాక్యుమెంట్లను పరిశీలించిన పోలీసులు దీనిపై సమాచారం సేకరించారు. వరుస ఎన్‌కౌంటర్లలో అగ్రనేతలను కోల్పోయిన నేపథ్యంలో... కీలక ఆపరేషన్లు/ఘట్టాల్లో పాల్గొనే అగ్రనేతలకు మావోయిస్టు పార్టీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇస్తున్నట్లు సమాచారం.

గెరిల్లా యుద్ధతంత్రంలో భాగంగా అదను చూసి దాడిచేసే పరిస్థితి నుంచి మొబైల్ వార్, పొజిషినల్ వార్ దశకు మారుతున్న క్రమంలో అగ్రనేతల రక్షణ కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో బయటపడిన మావోయిస్టుల డంపుల్లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కూడా లభించాయి. దంతెవాడలోని చింతల్‌నార్‌లో కొంతమంది మావోలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సేకరించిన సమాచారం ప్రకారం కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల వినియోగం విషయం బయటపడింది. తాజాగా ఏవోబీలో శిక్షణను పర్యవేక్షించడానికి వచ్చిన ఆర్కే సహా మావోయిస్టు అగ్రనేతలు కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు