‘హోదా’ గళాలపై వేటు!

29 Jan, 2017 04:02 IST|Sakshi

ఐదుగురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై చర్యలకు సిఫారసు చేయనున్న హక్కుల కమిటీ.. సర్కారు ఒత్తిడితోనే!

  • హోదాపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టడమే కారణం
  • చర్యలు వద్దన్న ప్రివిలేజెస్‌ కమిటీ సభ్యుడు పెద్దిరెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు, ప్రజలు, విద్యార్థులు, యువతపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. కేసులు నమోదు చేసి వేధిస్తోంది. హోదా సాధన పోరాటంలో భాగంగా ఇటీవల విశాఖపట్నం ఆర్‌కే బీచ్‌లో కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొనేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రభుత్వం అడ్డుకుంది. అత్యంత అనాగరికంగా, పాశవికంగా రన్‌వే పైనే నిర్బంధించింది.

ప్రత్యేక హోదా కోసం చట్టసభలో గళం విప్పిన వారిపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రజల ఆకాంక్ష అయిన హోదాపై శాసనసభలో చర్చించాలంటూ పట్టుబట్టిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని, వారిని ఏడాదిపాటు సభ నుంచి బహిష్కరించాలని దాదాపు నిర్ణయానికొచ్చింది. ఐదుగురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేయాలంటూ శాసనసభా హక్కుల సంఘం (ప్రివిలేజెస్‌ కమిటీ) సిఫార్సు చేయనున్నట్లు తెలిసింది. టీడీపీ సీనియర్‌ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన శనివారం హైదరాబాద్‌ అసెంబ్లీ కమిటీ హాల్‌లో ప్రివిలేజెస్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. సభ్యులపై చర్య తీసుకునే అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది.

ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవద్దని వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం ఉపనేత, కమిటీ సభ్యుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రజా ప్రాధాన్యం గల అంశాలపై ఎమ్మెల్యేలు సభలో చర్చ కోసం పట్టుబట్టడం సాధారణమేనని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేద్దామని ఆయన సూచించగా మిగతా సభ్యులు పరిగణనలోకి తీసుకోలేదు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవడానికే కమిటీ మొగ్గు చూపింది. ప్రివిలేజెస్‌ కమిటీలోని మొత్తం ఏడుగురు సభ్యుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మిగిలిన ఆరుగురు అధికార పార్టీకి చెందినవారే కావడం గమనార్హం. సొంత పార్టీ సభ్యులతో టీడీపీ ప్రభుత్వం ఇప్పించుకునే నివేదిక ఎలా ఉంటుందో సులభంగానే అర్థం చేసుకోవచ్చు.

12 మంది సభ్యులకు నోటీసులు
గతేడాది సెప్టెంబర్‌ 8, 9, 10 తేదీల్లో శాసనసభ వర్షాకాల సమావేశాల్లో ప్రత్యేక హోదాపై తక్షణమే చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ సభ్యులు సభను స్తంభింపజేశారు. ఈ సందర్భంగా సభలో చోటుచేసుకున్న సంఘటనలు సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తున్నాయని భావిస్తూ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఈ వ్యవహారంపై విచారణను సభాహక్కుల కమిటీకి అప్పగించారు. విచారణ అనంతరం నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఆ మేరకు హక్కుల కమిటీ ఇప్పటిదాకా ఐదుసార్లు సమావేశమైంది. 12 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు... ఆళ్ల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కొడాలి నాని, రాచమల్లు ప్రసాదరెడ్డి, దాడిశెట్టి రాజా, ఎం.సునీల్‌కుమార్, బూడి ముత్యాల నాయుడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కంబాల జోగులు, చిర్ల జగ్గిరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులకు నోటీసులు జారీ చేసింది. వారంతా దశల వారీగా కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. కమిటీ చివరి సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, బి.సి.జనార్దనరెడ్డి, శ్రావణ్‌ కుమార్‌ హాజరయ్యారు. ఇతర సభ్యులు జ్యోతుల నెహ్రూ, నందమూరి బాలకృష్ణ హాజరు కాలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు...

ముగ్గురు కాదు.. ఐదుగురు
అందరి వివరణలూ వచ్చిన నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, దాడిశెట్టి రాజాపై చర్యలు తీసుకుందామని కమిటీ సభ్యుల ముందు గొల్లపల్లి సూర్యారావు తొలుత ప్రతిపాదించారు. చర్యలు వద్దంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన ప్రతిపాదనను మిగతా సభ్యులెవరూ పట్టించుకోలేదు. మరో ఇద్దరిపై కూడా చర్యలు తీసుకోవాల్సిందేనంటూ ‘ముఖ్య’నేత నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ గట్టిగా కోరారు. దాంతో కొరుముట్ల శ్రీనివాసులు, బూడి ముత్యాలనాయుడుపై కూడా చర్యలు తీసుకోవాలంటూ ప్రివిలేజెస్‌ కమిటీ వారి పేర్లను కూడా జాబితాలో చేర్చింది. వచ్చే నెల మొదటివారంలో స్పీకర్‌కు నివేదిక ఇస్తామని గొల్లపల్లి సూర్యారావు చెప్పారు.

సామాజిక సమీకరణలు
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే విషయంలో ప్రివిలేజెస్‌ కమిటీ సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలుత చర్య తీసుకోవాలని భావించిన ఎమ్మెల్యేల్లో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు (ఆళ్ల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి), మరొకరు కాపు వర్గానికి చెందిన వారు (దాడిశెట్టి రాజా) ఉన్నారు. వీరిపైనే చర్య తీసుకుంటే ఫలానా సామాజిక వర్గాలనే లక్ష్యంగా చేసుకున్నారనే అపవాదు మోయాల్సి వస్తుంది. అందుకే అలాంటి వాదనకు తావు లేకుండా అందరిపైనా చర్య తీసుకున్నామని చెప్పడానికే బూడి ముత్యాల నాయుడు(బీసీ), కొరుముట్ల శ్రీనివాసులు (ఎస్సీ)ని కూడా జాబితాలో చేర్చినట్లు సమాచారం. ఈ ఇద్దరి పేర్లను ‘ముఖ్య’నేత ఆదేశాలకు మేరకు ఆయనకు  నమ్మిన బంటు అయిన ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ ప్రతిపాదించడం గమనార్హం.  

సర్కారు అభీష్టాన్ని బట్టి నివేదిక
ఎమ్మెల్యేలపై చర్య తీసుకునే విష యంలో వ్యూహాత్మకంగా వ్యవహరించా లని టీడీపీ ప్రభుత్వం భావిస్తోంది. శని వారం సమావేశంలో చర్చలు పూర్తయ్యాక అసెంబ్లీ సిబ్బందిని బయటకు వెళ్లాల్సింది గా కమిటీ చైర్మన్‌ సూర్యారావు ఆదేశించా రు. ఆ తరువాత కొంతసేపు ఇతర సభ్యులతో రహస్యంగా చర్చించారు. ఈ ఐదుగురు ఎమ్మెల్యేలను కనీసం ఏడాది పాటు సస్పెండ్‌ చేయాలని తొలుత నిర్ణ యానికి వచ్చినప్పటికీ.. స్పీకర్, ప్రభు త్వం నుంచి వచ్చే సూచనలను పరిగణన లోకి తీసుకుని కమిటీ తరపున సిఫార్సులు చేద్దామని నిర్ణయించారు. ప్రభుత్వ అభీష్టాన్ని బట్టి నివేదిక రూపొందించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు