ఆడిట్ అభ్యంతరాలను పరిష్కరించాలి

10 May, 2016 01:57 IST|Sakshi
ఆడిట్ అభ్యంతరాలను పరిష్కరించాలి

పీఏసీ సమావేశంలో నిర్ణయం

 సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న ఆడిట్ అభ్యంతరాలన్నింటినీ ఈ ఏడాది డిసెంబరు ఆఖరు నాటికి పరిష్కరించాలని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సమావేశం నిర్ణయించింది. పీఏసీ చైర్మన్ గీతారెడ్డి అధ్యక్షతన సోమవారం అసెంబ్లీ కమిటీ హాలులో ఈ సమావేశం జరి గింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో పాటు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు హాజరైన సమావేశం వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ఆడిట్ అభ్యంతరాలన్నింటినీ పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు కమిటీకి సమాచారం అందివ్వాలని అధికారులను ఆదేశించారు.

ఇందుకు ప్రతి నెలా కనీసం రెండుసార్లు సమావేశాలు జరిపాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఆడిట్‌నూ పీఏసీ పరిధిలోకి తేవాలని ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకు వెళ్లాలని కూడా నిర్ణయించారు. ఈ నెల 20వ తేదీన మరోమారు సమావేశం కావాలని పీఏసీ నిర్ణయించింది. రెవెన్యూ శాఖలోనూ ఎక్కువగా ఆడిట్ అభ్యంతరాలు పెండింగులో ఉన్నట్లు గుర్తించి వాటిపైనా చర్చించారు. వచ్చే సమావేశంలో పర్యాటకం, యువజన సంఘాల విభాగాలతోపాటు మున్సిపల్ శాఖలపై చర్చించనున్నారు. కమిటీ సభ్యులు డాక్టర్  లక్ష్మణ్, గువ్వల బాలరాజు, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఫారుఖ్ హుస్సేన్, పాటూరి సుధాకర్‌రెడ్డి, భానుప్రసాద్, రాములు నాయక్, శాసన సభా కార్యద ర్శి రాజసదారాం, జాయింట్ సెక్రటరీ నర్సింహా చారి తదితరులు పీఏసీ సమావేశంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు