మంటలు ఆర్పేందుకు ఆస్ట్రేలియా టెక్నాలజీ

24 Jan, 2018 03:45 IST|Sakshi

మంత్రి జోగు రామన్న వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: అడవుల్లో మంటలను ఆర్పేందుకు ఆస్ట్రేలియా టెక్నాలజీని వినియోగిస్తామని అటవీ, పర్యావరణ మంత్రి జోగు రామన్న తెలిపారు. మంగళవారం సచివాలయంలోని ఆయన చాంబర్‌లో ఎఫ్‌డీసీ చైర్మన్‌ బండ నరేందర్‌ రెడ్డితో కలిసి అటవీ అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ) కార్యక్రమాలను సమీక్షించారు. ఎకో టూరిజంలో ప్రోత్సహించే చర్యల్లో భాగంగా నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ బ్యాక్‌ వాటర్‌తో నేరెడిగొమ్మ మండలం పెద్ద మునగాల గ్రామంలో రూ. రెండు కోట్లతో, మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామంలో రూ. రెండు కోట్ల వ్యయంతో కొత్త ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. ఎకో టూరిజం అభివృద్ధికి అనువైన ప్రాంతాలను గుర్తించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.  

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌డీసీకి యూకలిప్టస్‌ అమ్మకాల ద్వారా రూ.123 కోట్లు, వెదురు ద్వారా రూ.13 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. దేశంలోనే మొదటి సారిగా హైదరాబాద్‌ కొత్తగూడ బొటానికల్‌ గార్డెన్‌లో పాలపిట్ట సైక్లింగ్‌ పార్క్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎఫ్‌డీసీ పూర్తిగా నిరాదరణకు గురైందని, రానున్న రోజుల్లో ఎఫ్‌డీసీని మరింత బలోపేతం చేస్తామని బండ నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సమీక్షలో ఎఫ్‌డీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చందన్‌ మిత్రా సంస్థ పనితీరును పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. 

మరిన్ని వార్తలు