ఆపరేషన్ ‘సాగర్’

1 May, 2015 23:46 IST|Sakshi
ఆపరేషన్ ‘సాగర్’

హుస్సేన్ సాగర్ సందర్శనకు ఆస్ట్రియా నిపుణులు
నేడు ఉన్నతాధికారులతో సమావేశం


సిటీబ్యూరో: హుస్సేన్‌సాగర్  ప్రక్షాళనకు, సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఆస్ట్రియాకు చెందిన నిపుణులు శనివారం హుస్సేన్‌సాగర్‌ను సందర్శించనున్నారు. సాగర్ ప్రక్షాళనలో భాగంగా ఇప్పటికే తొలిదశ పనుల్ని చేపట్టిన అధికారులు తూములు, అలుగుల ద్వారా వీలైనంత నీటిని వెలుపలికి పంపిస్తున్న విషయం తెలిసిందే. నీరంతా ఖాళీ అయ్యాక పూడిక తొలగింపు.. వ్యర్థాల డంప్ తీవ్ర సమస్యగా మారనుంది. అలాగే సాగర్ భూగర్భంలోని రసాయన విషతుల్యాల ప్రభావం..వాటి ద్వారా వెలువడే దుర్వాసనను అంచనా వేసి, పరిష్కారానికి తగుచర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇందుకుగాను అధికారులు హుస్సేన్‌సాగర్‌లో కూకట్‌పల్లి నాలా కలిసే చోట ప్రయోగాత్మకంగా పనులు ప్రారంభించారు. నాలాలు, తూముల సామర్థ్యం పెంచడంతోపాటు అక్కడ నీరు త్వరగా ఖాళీ చేసేందుకు చర్యలు తీసుకున్నారు.

దీంతో ఆ ప్రాంతంలో నీరు ఇంకిపోయింది. ఆస్ట్రియా నిపుణులు తమ పర్యటనలో హుస్సేన్‌సాగర్‌ను పరిశీలించడంతోపాటు నీరు ఇంకిన ప్రదేశం, అక్కడి కెమికల్స్ తదితర అంశాలను అధ్యయనం చేసే అవకాశం ఉంది. సాగర్‌లో పేరుకుపోయిన ప్లాస్టర్‌ఆఫ్‌ప్యారిస్, ప్లాస్టిక్, తదితర వ్యర్థాలతో దుర్గంధం వెలువడుతోంది. నీటిలో పెరిగే పిచ్చిమొక్కలతో పాటు అల్గే వల్ల కూడా వాసన వస్తుందనే అంచనాలున్నాయి. సాగర్‌లో చేరే కాలుష్య కారకల ప్రభావం, తదితర అంశాలు అంచనా వేసి నిపుణులు నీటిని పూర్తిగా ఖాళీ చేసేందుకు అనుసరించాల్సిన విధానాలు,  దుర్వాసన రాకుండా ప్రత్యామ్నాయాలపై తగు సలహాలు, సూచనలు  ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. హుస్సేన్‌సాగర్‌ను సందర్శించే ముందు లేదా అనంతరం నిపుణులు సాగర్ ప్రక్షాళనలో పాలుపంచుకునే వివిధ ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శితో పాటు జీహెచ్‌ఎంసీ, జల మండలి, హెచ్‌ఎండీఏ, పీసీబీ, తదితర విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొననున్నారు.
 

>
మరిన్ని వార్తలు