ఆగిన ఆటో

4 Sep, 2013 03:42 IST|Sakshi

 సాక్షి, సిటీబ్యూరో : ప్రతిరోజు సుమారు 10 లక్షల మందికి పైగా ప్రయాణికులు, విద్యార్థులకు రవాణా సదుపాయాన్ని అందజేసే ఆటోరిక్షా ఆగింది. ట్రాఫిక్ ఉల్లంఘనలపై చలానా మొత్తాన్ని రూ.100 నుంచి రూ.వెయ్యికి పెంచుతూ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీవో 108 కి వ్యతిరేకంగా గ్రేటర్‌లోని అన్ని ఆటోసంఘాలు నిరవధిక బంద్‌కు పిలుపున్విడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఎక్కడి ఆటోలు అక్కడే నిలిచిపోయాయి. అన్నిరకాల వాహనాలు కలుపుకొని గ్రేటర్‌లో మొత్తం లక్షా 60 వేల వాహనాలు ఆగిపోనున్నాయి. సుమారు 80 వేల ప్రయాణికుల ఆటోలు, మరో 30 వేల విద్యార్థుల ఆటోలు, 20 వేల వరకు స్కూల్ ఓమ్ని వ్యాన్‌లు, మరో 30 వేల వస్తురవాణా వాహ నాలు ఈ బంద్‌లో పాల్గొంటున్నాయి. నిరుపేద డ్రైవర్ల నడ్డివిరిచే విధంగా ఉన్న 106 జీవోను వెంటనే రద్దు చేయాలని, ఈ చలానా పద్ధతికి స్వస్తి చెప్పాలనే ప్రధాన డిమాండ్లతో ఆటోసంఘాలు ఈ నిరవధిక సమ్మెకు దిగాయి.
 
  ప్రధాన ఆటోసంఘాలైన ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ, ఆంధ్రప్రదేశ్ ఆటోడ్రైవర్ల సమాఖ్య, టీఎన్‌టీయూసీ, తెలంగాణ ఆటోడ్రైవర్ల జేఏసీ, తదితర అన్ని ఆటోసంఘాలు ఈ బంద్‌లో పాల్గొంటున్నాయి. మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు కూడా ప్రభుత్వం తమతో సంప్రదింపులు జరుపుతుందని ఆశించామని, అయినప్పటికీ చర్చల దిశగా ఎలాంటి పురోగతి లేకపోవడంతో సమ్మె అనివార్యమైందని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి బి.వెంకటేశ ం, ఆంధ్రప్రదేశ్ ఆటోడ్రైవర్ల సమాఖ్య ప్రధానకార్యదర్శి ఎ.సత్తిరెడ్డిలు ఁసాక్షి*తో చెప్పారు. ఆటో బంద్ వల్ల ప్రయాణికులతో పాటు విద్యార్థులకు ఇబ్బందులు తప్పవు. కూరగాయలు, ఉల్లిగడ్డ, పప్పులు, బియ్యం వంటి వివిధ రకాల వస్తువులను మార్కెట్‌ల నుంచి వివిధ ప్రాంతాలకు తరలించే వాహనాలు ఆగిపోవడం వల్ల కూడా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి.
 
  బుధవారం నుంచి తలెత్తే ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొనైనా ప్రభుత్వం తమతో చర్చలు జరపాల్సింది* అని వారు అన్నారు. రాత్రింబవళ్లు కష్టపడి పని చేసినా రూ.300 సంపాదించలేని ఒక ఆటోడ్రైవర్ చిన్నపాటి తప్పిదానికి రూ.వెయ్యి చెల్లించడమంటే కుటుంబంతో సహా తమ జీవించే  హక్కును కోల్పోవడమే అవుతుందని ఐఎఫ్‌టీయూ ప్రధానకార్యదర్శి కిరణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారీ వాహనాలు, మధ్యతరహా, తేలికపాటి వాహనాలు, ద్విచక్ర వాహనాలు అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెస్తూ అమల్లోకి తెచ్చిన 108 జీవో  పేద, మధ్యతరగతి వర్గాలపై ఉక్కుపాదంగా మారిందన్నారు. తక్షణమే ఈ జీవోను రద్దు చేయాలన్నారు.
 ఆర్టీసీ  అదనపు బస్సులు
 ఆటోబంద్ వల్ల ఎదురయ్యే ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో 100 బస్సులు అదనంగా నడిపేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎ.కోటేశ్వర్‌రావు చెప్పారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వివిధ రూట్లలో ట్రిప్పులను పెంచనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా రైల్వేస్టేషన్‌లు, ఆసుపత్రులు, మార్కెట్లకు రాకపోకలు సాగించే ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ట్రిప్పులు పెంచుతామన్నారు.

>
మరిన్ని వార్తలు