బేటీ..పిటీ!

15 Mar, 2017 00:38 IST|Sakshi
బేటీ..పిటీ!

సిటీబ్యూరో: పట్ణణ ప్రాంతాల్లో పేదరికం, ఆడపిల్లల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పడానికి ఇటీవలి సోషియో ఎకనమిక్‌ సర్వే తేల్చిన అంశాలను ఉదాహరణలుగా చెప్పొచ్చు. ముఖ్యంగా అభివృద్ధిపథంలోకి దూసుకెళుతోందనుకుంటున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బాలబాలికల నిష్పత్తి తెలంగాణ రాష్ట్ర సగటు బాలబాలికల నిష్పత్తికంటే కూడా అతి తక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రం మొత్తంమీద బాలబాలికల నిష్పత్తిలో అంతరాలు కొంత తగ్గినట్లుగా కన్పిస్తున్నా... హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పరిస్థితి మాత్రం విచిత్రంగా ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో 2011 జనాభా లెక్కలతో పోల్చి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో లింగ నిష్పత్తి కొంత మెరుగ్గానే ఉంది. తెలంగాణలో బాలబాలికల నిష్పత్తి గత పదేళ్ళలో ప్రతి వెయ్యిమంది బాలురకి 971 బాలికల నుంచి 988 బాలికలకు పెరిగింది.  అయితే హైదరాబాద్‌లో ప్రతి వెయ్యిమంది బాలురకి రాష్ట్ర సగటుకంటే అతి తక్కువగా 954 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలలో ప్రతి వెయ్యిమంది బాలురకు 961 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. ఈ రెండు జిల్లాల పరిధిలో పేదరికం, నిరక్షరాస్యత, లింగనిర్ధారణ పరీక్షల ప్రభావం వల్లే ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. కాగా షెడ్యూల్డ్‌ కులాల్లో మాత్రం బాలికలు బాలురకన్నా (రాష్ట్ర సగటుకన్నా) అధికంగా ఉన్నట్టు తేలింది.

ప్రతి వెయ్యిమంది బాలురకు 1008 మంది బాలికలు షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ కుటుంబాల్లో ఉండడం గమనార్హం. ఆదివాసీల్లోనైతే ప్రతి వెయ్యిమంది బాలురకి 977 మంది బాలికలు ఉన్నట్టు నమోదయ్యింది. అలాగే 0–6 వయసు బాల బాలికల నిష్పత్తిలో సైతం చాలా తేడా కనిపిస్తోంది. ఈ వయసు బాలబాలికల్లో ప్రతి వెయ్యిమంది బాలురకి బాలికల సంఖ్య 957 నుంచి 932కి పడిపోయింది. ఈ విభాగంలో హైదరాబాద్, నల్గొండ, వరంగల్, మహబూబ్‌నగర్‌ జిల్లాలు చిట్టచివరి స్థానాల్లో ఉండడం గమనించాల్సిన విషయం.  

బాల్య వివాహాలు ఎక్కువే..
బాల్య వివాహాల విషయానికొస్తే తెలంగాణలోని అన్ని జిల్లాల కంటే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్కువగా నమోదవుతున్నట్లు సోషియో ఎకనమిక్‌ సర్వేలో తేల్చారు. 2011 లెక్కల ప్రకారం దేశంలో బాల్యవివాహాలు 3.7 శాతంగా ఉంటే తెలంగాణలో కొంత తగ్గి 2.1 శాతంగా ఉంది. అయితే 2017– సోషియో ఎకనమిక్‌ సర్వేలో మాత్రం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. వీటికి పలు అంశాలను కారణాలుగా పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ హైటెక్‌ సిటీగా పేరొంది...అభివృద్ధిలో దూసుకుపోతూ ఆదర్శ నగరంగా కీర్తిస్తున్న హైదరాబాద్‌ నగరంలో బాల్యవివాహాలు, బాలికల సంఖ్య తగ్గడం వంటి అంశాలు మచ్చలుగానే చెప్పొచ్చు.

మరిన్ని వార్తలు