ఏపీ ఉద్యోగులను బాబు తీసుకెళ్లాలి

15 Jun, 2016 03:05 IST|Sakshi
ఏపీ ఉద్యోగులను బాబు తీసుకెళ్లాలి

ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్
- ఉద్యోగులను తెలంగాణకు తీసుకురావడం పట్ల హర్షం
- ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులను చంద్రబాబు సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించైనా తీసుకెళ్లాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఆంధ్రలో పనిచేస్తున్న 883 మంది తెలంగాణ ఉద్యోగులను సొంత రాష్ట్రంలోకి తీసుకుంటామని ప్రకటించినందుకు కృతజ్ఞతగా సీఎం కేసీఆర్ చిత్ర పటానికి ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. సచివాలయంలో మంగళవారం తెలంగాణ ఉద్యోగులు ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ 883 మంది ఉద్యోగులను రప్పించేందుకు కేసీఆర్ ప్రత్యేకంగా సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించారన్నారు. కమల్‌నాథన్ కమిటీ సాగతీత ధోరణిలో ఉందన్నారు. ఖాళీలను భర్తీ చేయనీయకుండా ఏపీ సీఎం చంద్రబాబుతో సహా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. తమ ఉద్యోగులను అమరావతికి రమ్మంటోన్న ఆంధ్రా ప్రభుత్వం... వస్తామని చెబుతోన్న పోలీసులు, ఉపాధ్యాయులు తదితరులను పట్టించుకోవడం లేదన్నారు. వారిని ఏపీ సీఎం రానీయడంలేదన్నారు.

 ఏపీ సచివాలయ తెలంగాణ ఉద్యోగుల ఆందోళనకు శ్రీనివాస్‌గౌడ్ సంఘీభావం
 ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి కేటాయించిన తెలంగాణ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు. మంగళవారం భోజన విరామ సమయంలో తమకు న్యాయం చేయాలంటూ నిరసన ప్రకటిస్తున్న టీ ఉద్యోగులకు ఆయన సంఘీభావం తెలిపారు. తమను తెలంగాణకు తీసుకునే విషయంలో ఇరు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఏపీలోని తెలంగాణ ఉద్యోగుల నేతలు వీర వెంకటేశ్వరరావు, జగన్ ముదిరాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తెలంగాణ ప్రభుత్వంతో మీ ముందే మాట్లాడతానంటూ సీఎస్ వద్దకు ఉద్యోగులందర్నీ తీసుకువెళ్లారు. ఆ సమయంలో సీఎస్ లేకపోవడంతో రేపు కలుస్తామని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సచివాలయ సంఘం అధ్యక్షుడు నర్సింగ్, ప్రధాన కార్యదర్శి జాకబ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు