'ఆ మాజీ ఎంపీకి మతి భ్రమించింది'

26 Jan, 2017 19:42 IST|Sakshi
'ఆ మాజీ ఎంపీకి మతి భ్రమించింది'

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్, ఎంపీ కవితలపై కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ చేసిన అనుచిత వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు ఖండించారు. పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి గురువారం టీఆర్‌ఎస్‌ఎల్‌పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మధుయాష్కీ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడారనిపిస్తోందని చెప్పారు. నిజామాబాద్ ఎంపీ కవిత గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. ఏడు నియోజకవార్గాల్లో రూ. వెయ్యి కోట్ల ఖర్చు పెట్టిన ఘనత కవితకే దక్కుతుందన్నారు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్న కవిత టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేస్తున్నారని తెలిపారు.

టీఆర్ఎస్ బలోపేతం అయితే వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కదనే అక్కసుతో యాష్కీ మాట్లాడుతున్నారని, ఓ మహిళ అనే కనీస గౌరవం లేకుండా ఆయన మాట్లాడిన తీరు గర్హనీయం అన్నారు. సోకుల కోసమే కవిత విదేశాలకు వెళుతున్నారని యాష్కీ అనడం ఆయన కుసంస్కారానికి నిదర్శనమన్నారు. యాష్కీ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని, క్షమాపణ చెప్పాలని... లేనిపక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కేసీఆర్‌ కుటుంబ సభ్యులపై యాష్కీ చేసిన మనీ లాండరింగ్ ఆరోపణలు అర్థరహితమని, మనీ లాండరింగ్ లాంటి విద్యలు కాంగ్రెస్ నేతలకే తెలుసునన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని కలిస్తే లేని తప్పు, ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్‌ కలిస్తే వచ్చిందా అని బాల్క సుమన్, జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు