నోట్ల మార్పిడి కేసులో బ్యాంక్ క్లర్క్ అరెస్ట్

16 Nov, 2016 01:12 IST|Sakshi
నోట్ల మార్పిడి కేసులో బ్యాంక్ క్లర్క్ అరెస్ట్

హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా పాతనోట్లు జమచేసి కొత్త నోట్లు తీసుకెళ్లిన కేసులో క్లర్క్ మల్లేష్‌ను సరూర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ వేణుగోపాలరావు తెలిపిన వివరాల ప్రకారం.. చిక్కడపల్లి బాపునగర్‌కు చెందిన వంగాల మల్లేష్ (56) చైతన్యపురి కమలానగర్‌లోని సిండికేట్ బ్యాంకులో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. పెద్ద పాతనోట్ల రద్దుతో తన వద్ద ఉన్న రూ.6 లక్షలు పాత నోట్లను ఈ నెల 12న బ్యాంక్‌కు తీసుకొచ్చాడు. క్యాషియర్ రాధిక సాయంతో పాత నోట్ల స్థానంలో కొత్త రూ.2వేల నోట్లను తీసుకెళ్లాడు. రోజుకు రూ.4వేలు మాత్రమే మార్పిడి చేసేందుకు నిబంధనలు ఉన్నప్పటికీ ఒకేసారి రూ.6 లక్షలు మార్చుకోవడంతో గుర్తించిన బ్యాంకు మేనేజర్ దాసరి నర్సయ్య ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.

అయితే క్లర్క్ మల్లేష్, క్యాషియర్ రాధికలను సస్పెండ్ చేసి సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడు మల్లేష్‌ను మంగళవారం అరెస్ట్ చేసి అతని నుంచి రెండు రూ.2వేల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. విషయం బయటకు పొక్కడంతో రూ.5.40 లక్షలను మల్లేష్ తిరిగి బ్యాంకులో జమచేశాడు. మిగిలిన మొత్తం ఖర్చు అయినట్లుగా పోలీసుల విచారణలో తెలిపాడు. అయితే మార్పిడి చేసిన డబ్బు మల్లేష్‌దేనా... లేక ఎవరిదైనా అనే విషయాన్ని విచారిస్తామని ఏసీపీ తెలిపారు. మల్లేష్‌కు సహకరించిన క్యాషియర్ రాధిక పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు. మల్లేష్‌ను రిమాండ్‌కు తరలించారు.

>
మరిన్ని వార్తలు