అంత ఇవ్వలేం!

12 Dec, 2016 13:50 IST|Sakshi
అంత ఇవ్వలేం!

నగదు విత్‌డ్రాపై బ్యాంకుల అనధికార కోతలు

వారానికి రూ.24 వేలు తీసుకోవచ్చంటున్న కేంద్రం
బ్యాంకుల్లో మాత్రం ఇస్తున్నది రూ.నాలుగైదు వేలే
ఆర్‌బీఐ మౌఖిక ఆదేశాలున్నాయంటున్న మేనేజర్లు
హైదరాబాద్‌లో భారీగా నగదు మార్పిడి జరుగుతోందంటూ ఆర్థిక శాఖకు నివేదికలు
బ్లాక్‌మనీని విపరీతంగా చలామణీలోకి తెచ్చారంటూ ఐబీ రిపోర్ట్‌.. పాతబస్తీ కేంద్రంగా వందల కోట్ల పాత నోట్ల మార్పిడి!
నగరంలో రూ.4,200 కోట్ల మేర నగదు మార్పిడి!


సాక్షి, హైదరాబాద్‌
వారానికి రూ.24 వేల వరకు నగదు విత్‌డ్రా చేసుకోవచ్చన్న కేంద్రం, రిజర్వు బ్యాంకు ప్రకటనలు ఆచరణలో అమలుకావడం లేదు. ఏ బ్యాంకుకు వెళుతున్నా ఖాతాదారులకు కేవలం రూ.2 వేల నుంచి రూ.5వేల వరకు మాత్రమే నగదు చేతిలో పెడుతున్నారు. అంతకుమించి ఇవ్వలేమని స్పష్టం చేస్తున్నారు. ఇదేమిటంటే రిజర్వుబ్యాంకు నుంచి అనధికారిక ఆదేశాలు ఉన్నాయంటూ బ్యాంకు మేనేజర్లు చెబుతున్నారు. పెళ్లిళ్లు ఉన్నవారు పత్రికలు, ఆధారాలు పట్టుకుని బ్యాంకులకు వెళుతున్నా.. రూ.2.5 లక్షలు నగదు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. అంటే బ్యాంకుల్లో సరిపడినం తగా నగదు ఉందన్న రిజర్వు బ్యాంకు ప్రకటనలు ఉత్తి డొల్లేనని స్పష్టమవుతోంది.

ఖాతాదారులకు చుక్కలు..
శనివారం హైదరాబాద్‌లోని అన్ని బ్యాంకులూ నగదు ఉపసంహరణ కోసం వచ్చిన ఖాతాదారులకు చుక్కలు చూపించాయి. బ్యాంకులో నగదు లేదంటూ వచ్చిన ప్రతి ఖాతాదారుడికి రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు మాత్రమే ఇచ్చాయి. మరీ అత్యవసరంగా కావాలంటూ నిలదీసిన వారికి మాత్రం కొన్ని బ్యాంకులు రూ.10 వేల వరకు ఇచ్చాయి. ప్రైవేటు బ్యాంకుల్లోనూ ఇదే పరిస్థితి కనిపిం చింది. అయితే సాధారణ ఖాతాదారులకు రూ.10 వేలు ఇవ్వడానికి కూడా నిరాకరించిన ప్రైవేటు బ్యాంకులు.. ప్రాధాన్య ఖాతాదారులకు మాత్రం రూ.24 వేల వరకు ఇచ్చాయి. మామూలుగా రూ.50 కోట్ల నుంచి వంద కోట్ల మేర టర్నోవర్‌ చేసే బ్యాంకులు శనివారం రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు మాత్రమే లావాదేవీలు నిర్వహించడం గమనార్హం.

భారీగా నల్లధన మార్పిడి జరిగిందంటూ నివేదికలు
నోట్ల రద్దు నిర్ణయం వెలువడినప్పటి నుంచి దేశవ్యాప్తంగా భారీగా నల్లధనం మార్పిడి జరిగిందని కేంద్రం గుర్తించింది. నగదు మార్పిడిలో ఇందులో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా తరువాత దేశంలో హైదరాబాద్‌ నాలుగో స్థానంలో ఉంది. తరువాత స్థానాల్లో చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, పుణె ఉన్నాయి. గత వారం రోజుల్లో హైదరాబాద్‌లో సుమారు రూ.4,200 కోట్ల మేర కరెన్సీ మార్పిడి జరిగిందని... ప్రత్యేకించి నగరంలోని ఓ ప్రాంతంలో ఏకంగా రూ.1,900 కోట్ల మేర పాత రూ.500, రూ.1,000 నోట్లను మార్చారని కేంద్ర ఆర్థిక శాఖకు నిర్దిష్టమైన సమాచారం అందింది. మార్పిడికి వచ్చిన వారు ఒకసారి ఉపయోగించిన ఆధార్‌ పత్రాన్నే 10 సార్లకంటే ఎక్కువగా వినియోగించారని ఇంటెలిజె¯Œ్స బ్యూరో (ఐబీ) కూడా అనుమానం వ్యక్తం చేస్తూ నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో నగదు చలామణికి అడ్డుకట్ట వేయాలని కూడా రిజర్వుబ్యాంకుకు సూచించినట్లు సమాచారం. మరోవైపు హైదరాబాద్‌ కేంద్రంగా కొందరు బ్యాంకర్లు పెద్ద ఎత్తున నగదును బ్లాక్‌మార్కెట్‌కు తరలించినట్లు వచ్చిన ఫిర్యాదులపై రిజర్వుబ్యాంకు మౌనం దాల్చడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కానీ సాధారణ ఖాతాదారుల లావాదేవీలపై మాత్రం అనధికార నియంత్రణ విధించడం గమనార్హం.

ఖాతాలో డబ్బున్నా..
దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రామకృష్ణారావు ముసారాంబాగ్‌లోని ఆంధ్రా బ్యాంకు శాఖకు వెళ్లి రూ.24 వేలకు చెక్కు సమర్పించారు. కొద్దిసేపు తటపటాయించిన అధికారులు బ్యాంకులో నగదు లేదన్నారు. నిబంధనల ప్రకారం తనకు రూ.24 వేలు ఎందుకివ్వరని ఆయన నిలదీశారు. దీంతో నగదు రావాల్సి ఉందంటూ గంటసేపు కూర్చోబెట్టి రూ.5 వేలు మాత్రమే ఇచ్చి పంపారు. ఎల్‌బీ నగర్‌కు చెందిన ఈసీఐఎల్‌ ఉద్యోగి చంద్రశేఖర్‌రావు తనకు డబ్బు అవసరమంటూ స్థానిక ఆంధ్రాబ్యాంకుకు వెళితే నగదు లేదని తిప్పిపంపారు. సింగపూర్‌లో ఉన్నత విద్య కోసం తన కుమారుడు వెళుతున్నాడంటూ సరైన ఆధారాలతో దిల్‌సుఖ్‌నగర్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా శాఖకు వచ్చిన ప్రతాప్‌రెడ్డికి అధికారులు చుక్కలు చూపించారు. తన ఖాతాలో ఉన్న మొత్తానికి ట్రావెలర్‌ చెక్కు ఇవ్వడానికీ అధికారులు ససేమిరా అనడంతో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇవే కాదు.. శనివారం హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు. ఒక్క ఎస్‌బీఐ శాఖలకు వెళ్లిన ఖాతాదారులకు మాత్రం రూ.10 వేల వరకు నగదు ఇచ్చారు.

ప్రయాణాలన్నీ వాయిదా..
విదేశాలకు వెళ్లేందుకు ఆరు నెలలు ముందుగానే విమాన టికెట్లు బుక్‌ చేసుకున్నవారు ప్రస్తుత పరిస్థితుల కారణంగా వాయిదా వేసుకుంటున్నారు. సికింద్రాబాద్‌కు చెందిన సీతారామారావు తన నలుగురు కుటుంబ సభ్యులతో కలసి ఈ నెల 21న యూరప్‌ పర్యటనకు బయలుదేరాల్సి ఉంది. కానీ అక్కడి ఖర్చుల కోసం అవసరమైన మేర యూరోలు (యూరప్‌ కరెన్సీ) తీసుకొనేందుకు చేసేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు. తనకు ఖాతా ఉన్న బ్యాంకును సంప్రదించి ఖాతాలో ఉన్న నగదుకు సరిపడా యూరోలు ఇవ్వాలని అభ్యర్థించారు. కానీ అందుకు నిబంధనలు అంగీకరించవని బ్యాంకర్లు స్పష్టం చేయడంతో ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. టికెట్ల రద్దుతో రూ.93 వేలు నష్టపోయినట్లు ఆయన పేర్కొన్నారు. ఇలా ఎందరో దేశ విదేశీ ప్రయాణాల కోసం ముందుగా టికెట్లు బుక్‌ చేసుకున్నా.. రద్దు చేసుకున్నారు. ‘‘నా తమ్ముడి కుమారుడి పెళ్లి ఉంది. వివాహం సందర్భంగా ఓ పది గ్రాముల బంగారం కొనుగోలు చేయడానికి రూ.31 వేలు కావాలి. నిబంధనల ప్రకారం నాకు రూ.24 వేలు అయినా ఇవ్వండంటూ చెక్కు తీసుకుని బ్యాంకుకు వెళితే.. అబ్బే రూ.10 వేలతో సర్దుకొండంటూ చేతిలో పెట్టారు. మరో నాలుగు రోజులు ఇలాగే ఉంటే ప్రజలు దాడులు చేసినా ఆశ్చర్యం లేదు..’’ అని బంజారాహిల్స్‌కు చెందిన దక్షిణామూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.

పెళ్లి ఖర్చులకు 2.5 లక్షలు ఉత్తిదే..!
వివాహాలు జరుగుతున్న కుటుంబాల వారికి రూ.2.5 లక్షలు నగదు ఇస్తామని కేంద్రం ప్రకటించి మూడు రోజులవుతున్నా బ్యాంకర్లు దానిని అమలు చేయడం లేదు. ఇంకా తమకు అధికారికంగా ఉత్తర్వులు రాలేదని కొన్ని బ్యాంకులు చెబుతుంటే... పెళ్లికి సంబంధించి వివిధ కార్యక్రమాలకు ఇచ్చిన అడ్వాన్స్ రసీదులు చూపాలంటూ మరికొన్ని బ్యాంకులు సతాయిస్తున్నాయి. దీంతో ఆశగా బ్యాంకులకు వెళుతున్నవారు ఆందోళనతో వెనుదిరుగుతున్నారు. ‘‘ఈ చర్యతో దేశం బాగుపడుతుందో లేదో నాకు తెలియదు. నాలాంటి వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేమేమో నగదు లేక ఇబ్బంది పడుతుంటే.. కొందరు ఏం ఫరవాలేదు మా దగ్గర కొత్త నోట్లున్నాయి.. 35 శాతం ఎక్కువ పాత నోట్లు ఇచ్చి తీసుకువెళ్లండంటూ ఫోన్లు చేస్తున్నారు. ఇదేనా నల్లధనం కట్టడి..?’’ అని నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌కు చెందిన రిటైర్డ్‌ టీచర్‌ భావ నారాయణ ఆవేదన చెందారు. తన మనవరాలి వివాహం దృష్టా ్య రూ.2.5 లక్షలు ఇవ్వాలంటూ దిల్‌సుక్‌నగర్‌లో ఓ ప్రైవేట్‌ బ్యాంకుకు వెళ్లినా ఫలితం లేదని.. తన ఖాతాలోని డబ్బుకే ఇన్ని ఆంక్షలా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

రూ.2 వేల నోట్లతో తంటాలు
పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకులు, ఏటీఎంల వద్ద రద్దీ కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్‌లోని అన్ని చోట్లా భారీ క్యూలు దర్శనమిస్తూనే ఉన్నాయి. బ్యాంకుల్లో మొదట వచ్చిన వారికి మాత్రమే రూ.వంద నోట్లు లభిస్తుండగా.. తరువాత వచ్చిన వారికి రూ.2 వేల నోట్లు ఇస్తున్నారు. వీటికి మార్కెట్లో చిల్లర లభించకపోతుండడంతో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పలు ఏటీఎంలలోనూ రూ.2 వేల నోట్లు మాత్రమే రావడంతో చిల్లర కష్టాలు తప్పడం లేదు. శనివారం బ్యాంకుల్లో ఖాతాదారులకు మాత్రమే సేవలు అందించిన నేపథ్యంలో ఎక్కువ శాతం ప్రజలు ఏటీఎంల వైపు మళ్లడంతో అన్ని చోట్లా రద్దీ కనిపించింది.

ప్రజల్లో అశాంతి పెరుగుతోంది
నగదు లభించకపోతుండడంతో ప్రజల్లో అశాంతి నెలకొంటోందని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)తో పాటు రాష్ట్ర నిఘా విభాగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించాయి. ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్‌కు ఇంటెలిజెజెన్స్ విభాగం తాజా పరిస్థితిపై నివేదిక అందజేసింది. పెద్ద నోట్లు రద్దు చేసి పది రోజులైనా పరిస్థితిలో మార్పు రాలేదని.. నగదు కోసం ప్రజలు అల్లాడుతున్నారని వివరించింది. ఐబీ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. హైదరాబాద్‌లో కొన్ని చోట్ల జనం ఏటీఎంలను ధ్వంసం చేసిన ఘటనలను ప్రస్తావించింది. సోమవారం బ్యాంకులకు కొత్త రూ.500 నోట్లు అందుతాయని, ప్రస్తుతమున్న అలజడి బుధవారం నాటికి సర్దుకుంటుందని రిజర్వుబ్యాంకు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

మరిన్ని వార్తలు