ఏపీ, తెలంగాణల్లో బాసర ట్రిపుల్ ఐటీ ప్రథమం

6 May, 2016 02:16 IST|Sakshi

- నోటిఫికేషన్ విడుదల సందర్భంగా వీసీ సత్యనారాయణ
బాసర: తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆదిలాబాద్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీనే ప్రథమ స్థానంలో ఉందని ట్రిపుల్ ఐటీ వైస్ చాన్సలర్ సత్యనారాయణ అన్నారు. గురువారం ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలిసారిగా ఆర్జీయూకేటీ విశ్వవిద్యాలయంలో 2016-17 సంవత్సరానికిగాను పదో తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రాల్లో మొత్తం 3 ట్రిపుల్ ఐటీలు ఉండగా.. బాసరనే ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు.  ప్రస్తుతం వెయ్యి మంది విద్యార్థులకు సరిపోయే అడ్మిషన్లు ఉన్నాయన్నారు.
 
 వీటిలో 80 శాతం తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు అవకాశం ఉంటుందని, మరో 15 శాతం తెలంగాణ, ఆంధ్ర ఉమ్మడి వారికి, 5 శాతం మహారాష్ట్ర, ఎన్‌ఆర్‌ఐ, తదితర రాష్ట్రాల వారికి కేటాయిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం మరో 500 సీట్లు పెంచితే వారికి కూడా సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సీట్లు పెంచడంతో పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుందని, ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని కోరారు. ఈ ఏడాది జూలై 15వ తేదీ నుంచే తరగతులు ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. 2009-10 సంవత్సరానికి  వివిధ కోర్సుల్లో చదివిన 2000 మంది విద్యార్థుల్లో 845 మంది ఉద్యోగాలు సాధించారని, 2010-11లో 315 మందికి ఉద్యోగాలు వచ్చాయని, వచ్చే ఆగస్టు నాటికి మరో 500మంది విద్యార్థులకు ఉద్యోగావకాశాలు వస్తాయని వెల్లడించారు. అలాగే లెక్చరర్ల భర్తీకి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని తెలిపారు. ట్రిపుల్ ఐటీకి 12 బీ (యూజీసీ) హోదా వస్తే ప్రభుత్వం నుంచి రూ.12 కోట్లు వస్తాయని, దీంతో కళాశాల రూపురేఖలు పూర్తిగా మార ్చవచ్చని వివరించారు. విద్యార్థుల రాణింపు పట్ల ట్రిపుల్ ఐటీని రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అభినందించారని వెల్లడించారు. సమావేశంలో ఏవో రాజేశ్వర్, ఎస్‌డబ్ల్యూవో ఎం.సుధాకర్, పీఆర్వో గోపాలకష్ణ, మధుసూదన్‌గౌడ్, విజయ్‌కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు.
 
నోటిఫికేషన్ విడుదల..
 - తెలంగాణ లోని పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు.
 - ఈ నెల 6వ తేదీ నుంచి దరఖాస్తులు పొందాల్సి ఉంటుంది.
 - 31వ  తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
 - డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆర్జీయూకేటీబాసర.కంలో దరఖాస్తు చేసుకోవాలి.
 - దరఖాస్తులు సక్రమంగా పూర్తిచేసిన వారికి జూన్ 11న కౌన్సెలింగ్ ఉంటుంది.
 - జూన్ 23న వికలాంగులు, ఎన్‌సీసీ, స్పో ర్ట్స్ విద్యార్థులకు కౌన్సెలింగ్‌కు అవకాశం.
 - జూలై 1న మొదటి విడత, 7న రెండో విడత జాబితాల వెల్లడి.
 - జూలై 15వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం.

మరిన్ని వార్తలు