కాన్వాస్‌పై బసవన్న

14 Jan, 2015 23:24 IST|Sakshi
కాన్వాస్‌పై బసవన్న

అయ్యగారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు అని తన యజమాని చెప్పగానే తలాడిస్తూ బసవన్న చేసే విన్యాసాలు ఆ పల్లెటూరి చిన్నోడి కళ్లలో స్థిరపడిపోయాయి. గంగిరెద్దు గజ్జెల సవ్వడి, అలంకరణ, ఊరంతా దానికి కప్పిన రంగురంగుల పంచెలు.. ఆ పిల్లాడికి ముచ్చటగొలిపింది.

అప్పుడు మనసులో తిష్టవేసిన బసవడి రూపం చేయి తిరిగిన కళాకారుడిగా మారిన తర్వాత కాన్వాస్‌పై కదంతొక్కింది. హిందూ సంప్రదాయంలో భాగంగా ఉన్న గంగిరెద్దు విన్యాసాలు ఈ ముస్లిం చిత్రకారుడి కుంచెలో ప్రాణం పోసుకుంటున్నాయి. ఆర్ట్‌కు మతాలతో సంబంధం లేదని నిరూపిస్తున్న మహమ్మద్ ఉస్మాన్‌ను సిటీప్లస్ పలకరించింది..
 ..:: వాంకె శ్రీనివాస్
 
మాది మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట. హిందువుల పండుగ సంబురాల్లో ముస్లింలు పాల్గొనేవారు. రంజాన్ వేడుకల్లో హిందువులూ పాలుపంచుకునేవారు. అలా హిందువుల పండుగలను దగ్గరగా చూసే అవకాశం దొరికింది. మా నాన్న మహమ్మద్ ఇషాక్ మంచి పెయింటర్ కావాలనుకున్నాడు. ఆర్థిక సమస్యలతో తన లక్ష్యాన్ని వదిలేసి అటవీశాఖలో ఉద్యోగిగా చేరి సరిపుచ్చుకున్నాడు.
 
ఫోకస్ పల్లెటూరే..
నేనూ చిన్నప్పటి నుంచి బొమ్మలు వేసేవాడిని. నా ఆసక్తి గమనించిన నాన్న నన్ను జేఎన్‌టీయూలో బీఎఫ్‌ఏ (బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్) ఎంట్రెన్స్ కోసం సిటీకి తీసుకొచ్చాడు. అప్పుడు నాకు అవకాశం రాలేదు. ఊళ్లోనే కమర్షియల్ ఆర్టిస్ట్‌గా జీవనం సాగించాను. పెళ్లయి, ఇద్దరు పిల్లలు పుట్టాక నా లక్ష్యం వెతుక్కుంటూ కుటుంబంతో 1998లో హైదరాబాద్ వచ్చేశా. అదే ఏడాది జేఎన్‌టీయూలో బీఎఫ్‌ఏలో చేరాను. నాలోని కళకు మెరుగులు దిద్దుకుని ప్రొఫెషనల్ ఆర్టిస్ట్‌గా మారాను. మొదట్లో పల్లెటూరి అందాలను ఫోకస్ చేస్తూ పెయింటింగ్ చేసేవాన్ని.
 
మూపుర ప్రాభవం..
నాలుగేళ్ల కిందట సంక్రాంతికి మా ఊరెళ్లాను. గంగిరెద్దులను చూడగానే నా బాల్యం గుర్తుకు వచ్చింది. గంగిరెద్దులను ఆడించేవాళ్లు వాటిని భలేగా అలంకరిస్తారు. మూపురం నుంచి తోక వరకూ వాటి ఆహార్యం ఎంతో హుందాగా ఉంటుంది. రంగురంగుల కొమ్ములు, వాటి చివర ధగధగ మెరిసే ఇత్తడి గొట్టాలు, నొసట అందమైన తోలు కచ్చడాలు.. మూపురంపై రంగు పంచె, దానిపై ఓ పూలదండ.. ఈ అలంకరణతో గంగిరెద్దు నందీశ్వరుడికి ప్రతిరూపంలా కనిపిస్తుంది.

అయితే కాలక్రమంలో గంగిరెద్దుల సందడి కాస్త తగ్గింది. ఆనాటి ప్రాభవం ఇప్పుడు పల్లెల్లోనూ కనిపించడం లేదు. వాటి ప్రాశస్త్యాన్ని తెలిపేందుకు బసవన్నల థీమ్‌తో పెయింటింగ్స్ వేయడం మొదలుపెట్టాను. నాలుగేళ్లుగా ఈ పెయింటింగ్స్‌తో దిల్లీ, బెంగళూరు, ముంబైలలో ప్రదర్శనలు నిర్వహించాను. గతేడాది నవంబర్‌లో సింగపూర్‌లోనూ ఆర్ట్ ఫెయిర్ నిర్వహించాను. అన్నిచోట్లా మంచి రెస్పాన్స్ వచ్చింది.
 
సమాజంతో సంబంధం..
కళాకారుడికి సంబంధం ఉండాల్సింది మతంతో కాదు సమాజంతో. మన చుట్టూ ఉన్నవాటిల్లో నుంచే సబ్జెక్ట్‌ను ఎంచుకోవాలి. గంగిరెద్దు థీమ్ కూడా ఇలా ఎంచుకున్నదే. గవ్వలు, మువ్వలు.. వివిధ అలంకరణ సామగ్రిని కాన్వాస్‌పై చిత్రించేందుకు ఎంతో ఓపిక కావాలి. ఒక బొమ్మ వేయడానికి 15 రోజులకు పైగా పడుతుంది. పెయింటింగ్స్ బాగున్నాయన్న ప్రశంసలే నా కష్టాన్ని మరచిపోయేలా చేస్తాయి. ప్రస్తుతం మీర్‌పేట సమీపంలోని అల్మాస్‌గూలో నేనుంటున్న ఇంట్లోనే స్టూడియో నిర్వహిస్తున్నాను. నా పెయింటింగ్స్ రూ.18 వేల నుంచి రూ.2.40 లక్షల వరకూ పలుకుతున్నాయి. నా ఇద్దరు బిడ్డలు సహన తన్వీర్, సమీన తన్వీర్‌లను ఆర్టిస్టులుగా చూడాలని ఉంది.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు