బయో..అయోమయం

10 Aug, 2015 00:42 IST|Sakshi
బయో..అయోమయం

బయోమెట్రిక్ ఆధారంగా ఉపకారవేతనాలు
కాలేజీల్లో  అందుబాటులో   లేని మిషన్లు

 
సిటీబ్యూరో: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉపకార వేతనాల భయం పట్టుకుంది. ప్రభుత్వ విధానాల వల్ల స్కాలర్‌షిప్‌లు అందుతాయో లేదోనని ఆందోళన మొదలైంది. ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియెట్ విద్యార్థులకు బయోమెట్రిక్ ఆధారంగా ఉపకార వేతనాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవంగా గతేడాదే అమలు చేయాలని సూచించినప్పటికీ.. చివరి దశలో వాయిదా వేశారు. ఇటీవల అన్ని కళాశాలల్లో బయోమెట్రిక్ ద్వారా విద్యార్థుల వివరాలు నమోదు చేయాలని సర్కారు సూచించింది.

అయితే ప్రైవేటు కాలేజీలను పక్కనబెడితే..
ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఈ నిర్ణయం శరాఘాతంగా మారుతోంది. బయోమెట్రిక్ మిషన్లను ఎవరు ఇవ్వాలన్న అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. తమ కళాశాలల్లో బయోమెట్రిక్ మిషన్ లేకపోవడంతో సాంఘిక సంక్షేమ కార్యాలయాలకు వెళ్లి నమోదు చేసుకోవాలని విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లు సూచిస్తున్నారు. వాస్తవంగా సాంఘిక సంక్షేమ కార్యాలయాల్లోనూ మిషన్లు అందుబాటులో ఉండవు. ఆయా కళాశాలలే  తమ డబ్బుతో వాటిని సమకూర్చు కోవాల్సి ఉంటుంది. ఈ విషయం తెలియక విద్యార్థులు సాంఘిక సంక్షేమ కార్యాలయాలకు తిరిగి వేసారిపోతున్నారు.

 కొరవడిన స్పష్టత..
 ఒక్కో బయోమెట్రిక్ మిషన్ కొనుగోలు చేయాలంటే రూ. 20 వేల నుంచి రూ. 30 వేలు అవసరం. ఈ మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందా? లేక కళాశాలలే కొనుగోలు చేసుకోవాలా? అందుకు నిధులు ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలి? తదితర అంశాలపై స్పష్టత కొరవడింది. ఏదో ఒకటి చెప్పకముందే బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయమనడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. జంట జిల్లాల్లో 44 ప్రభుత్వ కళాశాలలు ఉండగా.. వాటిలో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి 16 వేల మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యార్థులంతా అయోమయంలో చిక్కకున్నారు. మరోపక్క ప్రభుత్వ కళాశాలలను బయోమెట్రిక్ విధానం నుంచి మినహాయించాలన్న డిమాండ్ కూడా వ్యక్తమవుతోంది.
 

మరిన్ని వార్తలు