బతుకు..పూలపాట

28 Sep, 2014 20:44 IST|Sakshi
బతుకు..పూలపాట

కనిపించని బాధలతో  కన్నీరు పెట్టే పల్లెకు.. బతుకమ్మ పండుగ ఓదార్పునిస్తుంది. పట్నంలో క నుమరుగైన సంస్కృతిని బతుకమ్మ పండుగ ఏడాదికోసారి గుర్తుచేస్తుంది. జనపదాలలో ఎదిగిన జానపదుల బతుకమ్మ పాటలు తరాలు మారినా.. వనితల నాల్కలపై నాట్యం చేస్తూనే ఉన్నాయి. ఉయ్యాలలో జోగుతున్న చరిత్రను ఉయ్యాల పాటలతో నిద్రలేపి తర్వాతి తరాలకు అందించిన ఘనత బతుకమ్మ పాటలది.

వెన్నెల మకుటంతో సాగే పాటల వన్నె నేటికీ తగ్గలేదు. బతుకమ్మ పాటలు.. వాల్మీకికీఅందని రామాయణ ఘట్టాలు వినిపిస్తాయి.. వ్యాసుడు చెప్పని పురాణగాథలను వర్ణిస్తాయి. ఇక బతుకమ్మ ఆటలో లయబద్ధంగా సాగిన నాటి ఆడపడుచుల అడుగుల్లో.. నేటి ముదితలూ మురిపెంగా నడుస్తున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆటపాటల్లో ఉన్న మహిళలను ‘సిటీప్లస్’ తరఫున స్టార్ రిపోర్టర్‌గా ప్రజాకవి గోరటి వెంకన్న పలకరించారు.
 
గోరటి వెంకన్న: మనం బతుకుతూ అన్నింటినీ బతికించే సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం ఈ బతుకమ్మ. ప్రకృతిలోని సమస్త జీవులనూ ప్రేమించి, ఆరాధించి వాటి మనుగడను కోరుకునే పండుగ ఇది. అమ్మవారిని పూలలో చూసుకునే పండుగ ఇది. స్త్రీలు.. పూలు ఒక్కటే. అగో.. అక్కడ అందంగా పేర్చిన బతుకమ్మలు ఎలాగున్నాయో.. ఇక్కడ అమ్మలు కూడా అలాగే ఉన్నారు.
తెలంగాణ వచ్చాక, రాష్ట్ర పండుగగా బతుకమ్మను ప్రకటించాక ఎలా జరుపుకుంటున్నారు తల్లీ..?
సావిత్రమ్మ: చాలా సంతోషంగా ఉంది. పిల్లలంతా చాలా ఘనంగా చేసుకుంటున్నారు.
సులోచన: పదిహేనురోజులు సెలవులు ఇచ్చిండ్రు సార్.  కానీ తొమ్మిదిరోజుల పండుగలా కూడా ప్రకటించాలి సార్.
గోరటి వెంకన్న: అమ్మా.. కౌసల్యమ్మా! ఈ బతుకమ్మ ఎప్పటి పండుగమ్మా..?
కౌసల్య: తరతరాల నుంచి చేసుకుంటున్నరు. మన పరిస్థితి మంచిగున్నా, లేకున్నా.. బతుకమ్మ పండుగొచ్చిందంటే రంగురంగుల పూలతో పండుగచేసుకునేటోళ్లం.
గోరటి వెంకన్న: బతుకమ్మ పూల కోసం అప్పట్లో కొండలుగుట్టలు తిరిగి కట్ల పూలు, గునుగు పూలు, బంతులు, చేమంతులు అన్నింటినీ కోసుకుని తెచ్చుకునేటోళ్లు.. మరి ఇప్పడు ఏం చేస్తున్నారు?
రేఖ: కొనుక్కుంటున్నం సార్
పద్మ: మా చిన్నప్పడు ఊళ్ల ఆడపిల్లలమంతా చెట్లంట, పుట్లెంట తిరిగి రకరకాల పూలు తెచ్చుకునేటోళ్లం. పూల కోసం చాలా తిరిగేటోళ్లం.
సరిత: ఇప్పుడు ఏ పువ్వు కొనాలన్నా.. కిలో వంద రూపాయలకు తక్కువ లేదు. ఏం చేస్తం.. ప్రతి రోజూ బతుకమ్మ పేర్చాలంటే మార్కెట్‌వోయి పూలు కొనాల్సిందే.
గోరటి వెంకన్న: ముఖ్యంగా ఏమేం పూలు వాడుతున్నరు తల్లీ..?
కౌసల్య: తంగేడు పువ్వు, కట్ల పువ్వు, పార్వతీపరమేశ్వరుని పువ్వు, పుట్నం పువ్వు, గునుగు పువ్వు, గన్నేరు పువ్వు, ఉప్పు పువ్వు, అడవి చేమంతి, గుమ్మడి పువ్వు, బంతి పువ్వు.. ఇట్ల చానా పువ్వులను పెట్టేటోళ్లం. గిప్పుడు ఏవి దొరికితే గవ్వే..
గోరటి వెంకన్న: పూర్వం యోగులు, రుషులు చెట్లతో మాట్లాడేవారని మన పెద్దలు చెప్పేవాళ్లు. స్వయంగా మొక్కల దగ్గరికి వెళ్లి మీ చేతులతో పూలను కోసుకుంటే పొందే అనుభూతి మార్కెట్‌లోని పూలమ్మేవారితో బేరం చేస్తే రాదు కదా !
రేఖ: రాదు సార్. కానీ ఏం చేస్తం. మాకు అందుబాటులో ఉన్న పూలతోనే బతుకమ్మను అందంగా తయారుచేసుకుంటున్నాం.
సరిత: పండుగ రాష్ట్ర పండుగయ్యింది కాబట్టి ఈ పూల పెంపకంపై కూడా దృష్టి పెట్టాలి.
గోరటి వెంకన్న: అమ్మా.. సావిత్రమ్మా! మీరు.. మూడు రోజుల పాటు ఆపకుండా
 బతుకమ్మ పాట రూపంలో రామాయణం చెబుతారని విన్నాను.
సావిత్రమ్మ: మేం ఆనాటి మనుషులం సార్. ఎంతసేపైనా ఆపకుండా పాట పాడతనే ఉంటం. గిప్పటి పిల్లలకు ఒక పాట పాడంగనే ఆయాసమొస్తది.
గోరటి వెంకన్న: బతుకమ్మ పాటకు, ఆటకు ఒక లయ ఉంటుంది కదమ్మా.. ?
కౌసల్య: అవును.. హైరానా పడకుండా పాడాలి. అందరి అడుగు ఒక్కలెక్కనే పడేలా ఆడాలి. మా చిన్నప్పుడు ఆపకుండా ఐదారు గంటలు ఆడేటోళ్లం.
గోరటి వెంకన్న: బతుకమ్మ పండుగంటే ఆడబిడ్డల పండుగంటరు?
పద్మ: అవును సార్. అన్నకు అక్కచెల్లెళ్లు గుర్తుకొచ్చేరోజు. బతుకమ్మ పండుగెప్పుడొస్తదా అని.. అత్తారింట్లున్న ఆడపిల్ల వెయ్యికళ్లతో ఎదురుచూసే పండుగ. ఇంటి ఆడపిల్లతో బతుకమ్మ పేర్చుకోవాలి. బతుకమ్మ పండుగప్పుడు అన్నాచెల్లెళ్ల అనుబంధం తెలుపుతూ పాడే పాటలు కూడా చానా ఉంటయి.
గోరటి వెంకన్న: ఎంత మంచి మాట చెప్పినవ్ తల్లీ.. బతుకమ్మ అంటే మన ఇంటి ఆడపిల్ల. ఆమె చల్లగ ఉండి, తన పుట్టింటి వారి క్షేమం కోరుకుంటూ బతుకమ్మకు మొక్కుకుంటే మనకు ఏ కష్టాలు రావు. అమ్మా.. బతుకమ్మ అలంకరణలో ముఖ్యమైనది తంగేడు పువ్వు. దాని గురించి చెప్పండి.
సరిత: చాలా ముఖ్యమైనది సార్. కానీ ఆ పువ్వును కూడా కొంటున్నం.  
గోరటి వెంకన్న: హిమాలయాల్లో బ్రహ్మకమలం పువ్వుని పూజించినట్టు మన దగ్గర తంగేడు పువ్వుని పూజించే రోజు వస్తదంటరా?
పద్మ: వస్తుంది సార్. తప్పకుండా వస్తుంది.
సులోచన: సార్.. ఇంకో ముఖ్యమైన విషయం. మా చిన్నప్పుడు బతుకమ్మలను చెరువులో వదిలి ఆ చెరువులో నీరు తాగి ఇంటికొచ్చేటోళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సార్. మంచినీళ్ల సంగతి పక్కన పెట్టండి. అసలు చెరువులే కానొస్తలేవు.
గోరటి వెంకన్న: అవునమ్మా.. బతుకమ్మను మనం తయారుచేసుకోగలం. కానీ ఆ గంగమ్మని చేసుకోలేం. . అయినా ఊరికో చెరువులాగా మన పట్నంల కూడా నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలి.
సురేఖ: మన సిటీల ఏ చెరువులకు పోయిన మురుగునీరే సార్.
నీళ్లల్ల దిగేటట్టే లేదు.
గోరటి వెంకన్న: ఇప్పుడైనా అంతే తల్లీ.. రాష్ట్ర పండుగైన బతుకమ్మ మన దేశ పండుగలా చేసుకోవాలి. ప్రాంతాలు, జాతులకు అతీతంగా పూలను ఆరాధించే పండుగగా తీర్చిదిద్దుకునే బాధ్యత మనదే.
గోరటి వెంకన్న: బొడ్డెమ్మ పాటలు ఎవరికన్నా వచ్చామ్మా.
రేఖ: అందరికీ వస్తయి సార్.
గోరటి వెంకన్న: ఏదీ.. ఒక పాట పాడు తల్లీ.

రేఖ: బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో.. నీ బిడ్డ పేరేమీ ఉయ్యాలో
     నీ బిడ్డ నీళ్ల గౌరి ఉయ్యాలో.. నీ బిడ్డ నీళ్లు పోసే ఉయ్యాలో
     నిత్యం నీళ్లు పోసి ఉయ్యాలో.. నిత్యమల్లె చెట్టేసే ఉయ్యాలో
     నిత్యమల్లె చెట్టూకు ఉయ్యాలో.. ఏడే మొగ్గలు ఉయ్యాలో
     ఏడు మొగ్గలకు ఉయ్యాలో.. ఏడు విత్తుల పత్తి ఉయ్యాలో
     ఆ పత్తి తీసుకుని ఉయ్యాలో.. సాలోనికిస్తే ఉయ్యాలో
     సాలోడు నేసేనే ఉయ్యాలో.. నెలకొక్కపోగు ఉయ్యాలో
     దిగెనే ఆ చీర ఉయ్యాలో.. దివిటీల ఆ చీర ఉయ్యాలో...
     ఇట్ల చానా పెద్దగ ఉంటది సార్.


గోరటి వెంకన్న: ఎంత అందమైన, అద్భుతమైన సాహిత్యమో చూడండి. బిడ్డ దగ్గర మొదలుపెడితే ఎక్కడికో వెళ్లింది.
బతుకమ్మ పాటలంటే.. మన బతుకు పాటలు.
కౌసల్య: మొత్తం నాలుగు రకాలుగా బతుకమ్మ పాటలుంటయి. ఉయ్యాలో, రామ, వెన్నెల, చందమామ.. ఇట్ల ముగింపు పదాలతో చరిత్రను చెబుతాయి. పురాణాలు చెబుతాయి. ఏ విషయానైన్నా చెప్పొచ్చు.
సావిత్రమ్మ: పదాలకంటే పాట బలమైంది. అందులోనూ బతుకమ్మ పాటకుండే ప్రత్యేకత చాలా గొప్పది.
ఈ పాట రూపంలో చెప్పిన ఏ విషయమైనా వినడానికి ఇంపుగా ఉంటుంది.
 
గోరటి వెంకన్న: బతుకమ్మ పండుగప్పుడు చేసే ఫలహారాల గురించి చెప్పండి తల్లీ.
సులోచన: కుడుములు, గుడాలు, మలిదలు, సద్దులు, పెరుగన్నం.. రకరకాలు
కౌసల్య: ఒక్కొక్క తాన ఒక్కోతీరు ఉంటయి సార్. నైవేద్యాలు ఎవరిష్టమున్నట్టు వారు పెట్టుకుంటరు. మా చిన్నప్పుడైతే పచ్చొడ్లు, జొన్నలు, తైదలు దంచుకుని నైవేద్యం తయారు చేసేటోళ్లు. అప్పట్ల బతుకే బతుకమ్మ అన్నట్లు ఉండేది సార్.
 
బతుకమ్మ కారు
విలక్షణమైన కార్ల రూపకర్త, గిన్నిస్ రికార్డు గ్రహీత సుధాకర్ తాజాగా బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా బతుకమ్మ ఆకారంలో కారును జీహెచ్‌ఎంసీ కోసం ప్రత్యేకంగా రూపొందించారు. పది అడుగుల వ్యాసం, పదమూడు అడుగుల ఎత్తుతో రూపొందించిన ఈ మూడు చక్రాల కారు 150 సీసీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ బతుకమ్మ కారులో రెడ్‌లైట్, మ్యూజిక్ సిస్టమ్ ఉన్నాయి. సుధాకర్ ఇంతకుముందు వినాయకుడి ఆకారంలో కూడా ఒక కారు రూపొందించారు.

-బహదూర్‌పురా

మరిన్ని వార్తలు